సొంత నేతలే విభేదిస్తున్నారే… జగన్ ముందున్న సమస్య

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పటికే ఉన్న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తాన‌ని సీఎం జ‌గ‌న్ [more]

Update: 2020-08-04 08:00 GMT

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పటికే ఉన్న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తాన‌ని సీఎం జ‌గ‌న్ ప్రక‌టించారు. అయితే, ఈ విష‌యంపై ప్రస్తుతం అధ్యయ‌నం సాగుతున్నా.. వ‌చ్చే ఏడాదిలో ఊపందుకోవ‌డం ఖాయం. క‌రోనా హ‌డావిడి లేకుండా ఉండి ఉంటే ఇప్పటికే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి వ‌చ్చి ఉండేది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు స్థానిక ఎన్నిక‌ల‌ను ప్రభుత్వం ప‌క్కన పెట్టేసింది. జ‌గ‌న్ ఏ ముహూర్తాన ఈ కొత్త జిల్లాల తేనెతుట్టెను క‌దిలించారో కాని అప్పటి నుంచి సొంత పార్టీ నేత‌ల నుంచే ఏదో ఒక విమ‌ర్శ అయితే వ‌స్తూనే ఉంటోంది.

ఆధిపత్యానికి తెరపడుతుందని….

ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ ఇప్పటి వ‌ర‌కు మౌనంగా ఉంటే.. సొంత పార్టీ నేత‌లే జ‌గ‌న్ మేకుల్లా మారార‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. చాలా వ‌ర‌కు జిల్లాల్లో సొంత పార్టీ నేత‌లు త‌మ‌ను ప‌క్క జిల్లాల్లో క‌ల‌ప‌వ‌ద్దని, సొంతంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. మ‌రి కొంద‌రు సీనియ‌ర్లు అస‌లు పెద్ద జిల్లా విడిపోతే త‌మ రాజ‌కీయ ఆధిప‌త్యానికి ఎక్కడ గండిప‌డుతుందో ? అని త‌మ జిల్లాను విభ‌జించ‌వ‌ద్దని కోరుతున్నారు. ఇప్పటి వ‌ర‌కు సీనియ‌ర్ నేత‌లు ఉన్న చోటే జ‌గ‌న్‌కు ఈ విష‌యంలో ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు గిరిజ‌న ప్రాంతాల‌కు చెందిన నాయకులు ఈ డిమాండ్‌ను ఎక్కువ‌గా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

పార్టీకి ఇబ్బందిగా మారుతుందని…

ఉదాహ‌ర‌ణ‌కు అర‌కు పార్లమెంటు ప‌రిధిని తీసుకుంటే.. ప్రస్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో విస్తరించి ఉంది. రేపు అర‌కును జిల్లాగా ప్రక‌టిస్తే.. ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు వ‌చ్చి దీనిలో క‌లుస్తాయి. ఇలా చేయ‌వ‌ద్దనేది వైఎస్సార్ సీపీ నాయ‌కుల వాద‌న‌. ఇలా చేస్తే.. పార్టీ తీవ్రంగా దెబ్బతింటుంద‌ని అంత‌ర్గత చ‌ర్చల్లోనూ చెప్పుకొంటున్నారు. ఇక‌, కొంద‌రు సీఎం జ‌గ‌న్‌కు నేరుగా సందేహాలు పంపారు. మ‌రికొంద‌రు బ‌హిరంగంగా త‌ప్పుబ‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో అర‌కుపై కిరికిరి త‌ప్పద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అర‌కును జిల్లాగా ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు జిల్లాలోకి వెళతాయి.

సాధన కోసం ఉద్యమం…..

శ్రీకాకుళం జిల్లా పాలకొండ సెగ్మెంట్ కూడా అర‌కు జిల్లాలోకే వెళ్తుంది. ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం కూడా అర‌కు జిల్లాలోకే వెళుతుంది. అప్పుడు రాజ‌మండ్రి ప‌క్కన ఉన్న ప్రాంతాల నుంచి.. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా బోర్డర్‌లో ఉన్న ప్రాంతాలు అన్ని ఒకే జిల్లాలో ఉంటాయి. భౌగోళికంగా చూస్తే అసలు ఈ జిల్లా ప్రజ‌ల‌కు చాలా రిస్క్‌. అందుకే దీనిని రెండు జిల్లాలు చేయాలన్న డిమాండ్ ఉంది. తమను అరకులో కలపకుండా పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ‘పార్వతీపురం జిల్లా సాధన సమితి’ ఏర్పడింది. సమావేశాలు నిర్వహించడం.. ధర్నాలు చేయటం.. ఉన్నతాధికారులకు వినతిపత్రాల ద్వారా తమ డిమాండ్‌ను వినిపిస్తోంది.

ఎవరికి వారే వినతులు….

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇటీవల జరిగిన కేబినెట్‌లో సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. పార్వతీపురం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ నేతలూ ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. ఇక పార్వతీపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో త‌మ‌ను క‌ల‌ప‌వ‌ద్దని.. సాలూరు కేంద్రంగా మ‌రో గిరిజ‌న జిల్లా ఏర్పాటు చేయాల‌ని అక్కడ ఎమ్మెల్యే రాజ‌న్నదొర‌తో పాటు మ‌రో ఉద్యమం ప్రారంభ‌మైంది. ఇక… శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు చేస్తే శ్రీకాకుళానికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్‌కు ఇబ్బందులు ఖాయ‌మనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News