ఆయువు పట్టును పట్టేసుకున్నారా?

బీసీలకు సొంత పార్టీ టీడీపీ అని చంద్రబాబు చాలా ఆర్భాటంగా చెప్పేవారు. బీసీల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కూడా ఆయన అంటుండేవారు. టీడీపీ విషయంలో [more]

Update: 2019-12-02 14:30 GMT

బీసీలకు సొంత పార్టీ టీడీపీ అని చంద్రబాబు చాలా ఆర్భాటంగా చెప్పేవారు. బీసీల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కూడా ఆయన అంటుండేవారు. టీడీపీ విషయంలో అది చాలా వరకూ కరెక్టే మరి. ఎందుకంటే కాంగ్రెస్ ఏలుబడిలో బీసీలు అప్పట్లో దెబ్బతిన్నారు. రెడ్డిలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దానికి తోడు కాంగ్రెస్ లో ఎస్సీ, ఎస్టీలు ఉండేవారు. ఇక బీసీలే నిరాదరణకు గురి అవుతున్నారని వారిని అక్కున చేర్చుకుని టీడీపీ కొత్త సామాజిక సమీకరణలకు శ్రీకారం చుట్టింది. అన్న నందమూరి టైంలో బీసీలకు నిజంగా పెద్ద పీట వేశారు. వారికి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వడమే కాకుండా స్వతంత్రంగా పనిచేసేలా చూశారు. ఇక చంద్రబాబు హయాంలో కూడా బీసీలకు మంత్రి పదవులు దక్కినా అసలైన అధికారం మాత్రం దక్కలేదన్న ఆవేదన ఉండిపోయిందని చెబుతారు. ఇక కాలానికి తగినట్లుగా బీసీల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను టీడీపీ తీసుకోలేకపోయింది. దానికి తోడు వారిలో పెరుగుతున్న అసంత్రుపిని అంచనా కట్టడమో విఫలం అయింది. దాని ఫలితమే తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం.

బీసీలకు మరింత చేరువగా…?

ఇక జగన్ ఒక పధకం ప్రకారం బీసీల్లో ఉన్న అసంత్రుప్తిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఏలూరులో జరిగిన బీసీల డిక్లరేషన్లో జగన్ చెప్పిన ప్రతీ మాట ఇపుడు ప్రభుత్వంలోకి రాగానే అమలు చేసి చూపిస్తున్నారు. బీసీలకు మంత్రి పదవులు అరవై శాతం ఇవ్వడం ద్వారా టీడీపీ కంటే తాను ఎక్కువ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బాబు కంటే తాను మిన్న అని చాటుకున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టడం ద్వారా బీసీలకు తన కంటే ఎవరూ ఎక్కువ చేయలేరని జగన్ మరింతగా నిరూపించుకున్నారు. అందుకే జగన్ బీసీల ఆరాధ్యదైవం జ్యోతీరావ్ ఫూలే వేడుకల్లో ధీమాగా బీసీ నినాదాన్ని వినిపించగలిగారు. బీసీల తరఫున ఇలా వేడుకలు చేసే పూర్తి హక్కు తనకే ఉందని ధీమాగా చెప్పగలిగారు. తాను బీసీలను జాతికి వెన్నెముకగా తయారు చేస్తానని, వారి వెనకబాటుతనాన్ని పూర్తిగా రూపుమాపుతానని జగన్ చెప్పడం ద్వారా బీసీలకు ఇంకా చేరువ అయ్యారు. ఇక చేనేత కార్మికులతో పాటు ఒక్కో వర్గానికి కూడా సర్కార్ తరఫున పధకాలు ప్రవేశపెట్టడానికి జగన్ రచిస్తున్న ప్రణాళికలు బీసీలకు ఓ విధంగా కొత్త దారి చూపుతున్నాయని అనుకోవాలి.

సోషల్ ఇంజినీరింగ్ తో…..

ఇక టీడీపీకి బీసీలు నిన్నటి వరకూ ఆలంబనగా ఉన్నారు. వారిని పూర్తిగా ఎన్నికల తరువాత కూడా తనవైపునకు తిప్పుకోవడం ద్వారా జగన్ టీడీపీ అయువు పట్టు మీద గట్టి దెబ్బ కొట్టగలిగారు. అందుకే జగన్ మీద టీడీపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఆయన ఒక పధకం ప్రకారం తాను అనుకున్నది చేస్తూ వస్తున్నారు. ఇక ఏపీ సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ ఇపుడు మాస్టర్ చేశారనే చెపాలి. ఒక చట్రంలో బడుగులను, దళితులను, మైనారిటీలను, అగ్ర వర్ణాలను చేర్చడం అంటే అత సులువు కాదు. కానీ జగన్ ఈ ప్రయోగం విషయంలో విజయవంతం కావడమే కాదు, దీన్ని శాశ్వతం చేయాలనుకుంటున్నారు. దాంతో జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను విపక్షంగా టీడీపీ వ్యతిరేకించలేక, మద్దతు ఇవ్వలేక ఇరకాటంలో పడుతోంది. సర్కార్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన విధానం టీడీపీకి బీసీలను మరింతగా దూరం చేసేలా జగన్ చేసిన ప్రయత్నమే ఇందుకు అచ్చమైన ఉదాహరణ.

Tags:    

Similar News