సిక్స్టీ ప్లస్…దానికి మైనస్ ?

ఒకచోట ప్లస్ అయితే రెండవ చోట కూడా ప్లస్ కావాలి. అది అంక గణితం. రాజకీయ గణితంలో మాత్రం ప్లస్ లు కూడా ఒక్కోసారి మైనస్సులు అవుతాయి. [more]

Update: 2020-08-02 12:30 GMT

ఒకచోట ప్లస్ అయితే రెండవ చోట కూడా ప్లస్ కావాలి. అది అంక గణితం. రాజకీయ గణితంలో మాత్రం ప్లస్ లు కూడా ఒక్కోసారి మైనస్సులు అవుతాయి. ఇపుడు ఏపీలో మారిన రాజకీయాన్ని చూస్తే సీనియ‌ర్లకు ఇంక ఇంటికే అన్న భావన కలుగుతోందిట‌. ఈ సంస్కరణ లేక ప్రక్షాళన అధికార వైసీపీ నుంచే మొదలైంది. దానికి నాందిగా జగన్ మంత్రులు వారిని ఎంచుకుంటున్న తీరు చెబుతోంది. శ్రీకాకుళంలో కొత్త మంత్రి సీదరి అప్పలరాజుని చూసినా, తూర్పుగోదావరిలో చెల్లుబోయిన వేణుగోపాల్ ని గమనించినా జగన్ అరవైలు దాటిన వారు, సీనియర్లు వద్దు అంటున్నట్లుగానే ఉంది.

పెద్దరికమే ……

అలాగని వారిని జగన్ వదులుకోరు, సముచితంగా గౌరవిస్తారు. చట్ట సభల్లో ఉంచుతారు. వారి అనుభవాన్ని బలమైన వాణిని అలా వాడుకుంటారు. అంతే తప్ప మంత్రులుగా తెచ్చి పక్కన పెట్టుకోరు, ఇపుడు అదే జరుగుతోంది. నెల్లూరు పెద్దాయన ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ మోస్ట్ కావడమే ఆయనకు మంత్రి కుర్చీ దక్కకుండా చేస్తే సెవెంటీ యియర్స్ దాటిన స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి కోరిక కూడా అందుకే తీరలేదు అంటున్నారు. ఇపుడు చూచాయగా కనిపించిన ఈ జగర్ మార్క్ మరో ఏడాదిలో జరిగే పూర్తి స్థాయి విస్తరణలో పూర్తిగా బయటపడుతుంది అంటున్నారు.

ఇంటిదారేనా…?

రాష్ట్రంలో సీనియర్ సిటిజన్లు చాలా మందే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచి అలా మిగిలిపోయారు. వారు అరచి గీ పెట్టినా మంత్రిని చేయను గాక చేయను అని జగన్ అనేస్తున్నారు. వారు తమ పదవీ కాలాన్ని అలా గడిపేయడమే మిగిలిఉందని అంటున్నారు. ఇక ఈ టెర్మ్ అయిపోతే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కూడా దక్కడం కష్టమని కూడా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇవే ప్రమాణాలు జగన్ పాటిస్తారని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. అరవై లోపు వారికి ఎమ్మెల్యే టికెట్లు యాభై లోపు వారికే మంత్రి పదవులు ఇదే జగన్ మార్క్ సిధ్ధాంతమని కూడా అంటున్నారు.

అర్ధమైనట్లే…..

ఈ విషయం తాజాగా కొత్త మంత్రుల నియామకం ద్వారా తలపండిన సీనియర్లకు అర్ధమైపోయింది అంటున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు మంత్రి కల అలాగే మిగలనుంది. ఆయన అన్న గారు అయిదేళ్ళ పాటు మంత్రి అని కంఫర్మ్ అయిపోయింది. విజయనగరంలో చూసుకుంటే విస్తరణలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ శాఖల్లో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇదే విధంగా మిగిలిన జిల్లాల్లో సీనియర్లకు వైసీపీలో ఇకపైన పెద్దగా ప్రాధ్యాన్యత ఉండకపోవచ్చునని చెబుతున్నారు. జగన్ టీం అంతా యువతేనని కూడా తెలుస్తోంది. తాను టీం లీడర్ గా ఉంటూ కొత్త వారికి వయసు తక్కువ ఉన్న వారికి అవకాశాలు ఇస్తూ ఏపీలో కొత్తరకం రాజకీయం చూపించాలని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఇక ఇంతటితో సరి అని చాలా మంది నేతల‌కి వైసీపీలో సీన్ అర్ధమైపోతోందిట.

Tags:    

Similar News