నేమ్ లతో ఫేమ్ కోసం… జగన్ కు సమస్యేనా?

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మాటేమోకానీ.. రానున్న రోజుల్లో అనేక రాజ‌కీయ ఉద్యమాల‌కు, నిర‌స‌న‌ల‌కు రాష్ట్రం వేదిక‌య్యేలా క‌నిపిస్తోంది. కొత్తగా రాష్ట్ర విభ‌‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ప్రజ‌ల‌కు [more]

Update: 2020-08-01 13:30 GMT

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మాటేమోకానీ.. రానున్న రోజుల్లో అనేక రాజ‌కీయ ఉద్యమాల‌కు, నిర‌స‌న‌ల‌కు రాష్ట్రం వేదిక‌య్యేలా క‌నిపిస్తోంది. కొత్తగా రాష్ట్ర విభ‌‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ‌గా పాల‌న‌ను అందించాల‌నే ఒక స‌త్సంక‌ల్పంతో వైఎస్సార్ సీపీ అధినేత సీఎం జ‌గ‌న్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేయాల‌ని నిర్ణయించారు. దీనివెనుక చాలా మంచి ఆశ‌యం ఉంది. అయితే, ప్రతిప‌క్షాలు, ప్రత్య‌ర్థి నేత‌లు దీనిని కూడా ఏదో ఒక విధంగా రాజ‌కీయం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నట్టుగా తాజా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటును కూడా రాజ‌కీయ అంశంగా మార్చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప‌నిలో ప‌డ్డాయి.

ప్రాంతాలే కాదు..పేర్లపై కూడా…..

ఈ క్రమంలో మేం ఆ జిల్లాలో క‌ల‌వం.. ఈ జిల్లాలో క‌ల‌వం అని ఇప్పటికే ఉద్యమాల‌కు రెడీ అంటూ.. స్కెచ్ సిద్ధం చేసుకుంటున్న నాయ‌కులు తాజాగా పేర్లపై కూడా పోరుకు సిద్ధమ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు చేసిన ప్రజాసంక‌ల్ప యాత్రలో ఏ ఆలోచ‌న‌తో అన్నారో కానీ.. కృష్ణాజిల్లాను విభ‌జించి ఏర్పాటు చేసే జిల్లాకు దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క రామారావు పేరు పెడ‌తామ‌న్నారు. అదేవిధంగా తూర్పును విభ‌జించిన‌ప్పుడు అల్లూరి సీతారామ‌రాజు పేరు పెడ‌తామ‌ని చెప్పారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు ఈ అంశాల‌నే ప్రాతిప‌దిక‌గా తీసుకుని పేర్ల విష‌యంలోనూ జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టేలా లోపాయికారీ స్కెచ్‌లు రెడీ అవుతున్నాయి.

ఎన్టీఆర్ పేరును….

కృష్ణా జిల్లాలో గుడివాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే కుద‌ర‌ద‌ని విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకే ఎన్టీఆర్ పేరు ఉంచాల‌ని టీడీపీలోకి కొన్ని వ‌ర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ… ‘రాబోయే జిల్లాకు ఫలానా పేరు’ పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అమలాపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ‘అంబేడ్కర్‌’ పేరు పెట్టాలని రాష్ట్ర దగాపడ్డ చర్మకారుల మహాసభ వ్యవస్థాపకుడు ఈతకోట తుక్కేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీనిపై కొన్నేళ్లుగా దశలవారీ ఆందోళన చేస్తున్నారు.

పరిటాల పేరుతో…..

ఇక… కాకినాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్‌ పేరు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కోరారు. 1912లో స్థాపించిన ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ద్వారా వందలాది ఎకరాలు దానం చేసి అనేక విద్యా సంస్థలకు ప్రాణం పోశారని చెప్పారు. అనంత‌పురం విభ‌జ‌న చేస్తే.. దానికి ప‌రిటాల జిల్లా పేరు పెట్టాల‌ని ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి, కుమారుడు సునీత‌, శ్రీరాంలు డిమాండ్ చేసిన‌ట్టు తాజాగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో…..

ఇక తూర్పు గోదావ‌రి జిల్లా మూడు మ‌ుక్కలు అవుతుండ‌డంతో ఆ జిల్లా పేరును రాజ‌మండ్రి కేంద్రంగా ఏర్పడే జిల్లాకే ఉంచాల‌ని ఆ ప్రాంత ప్రజ‌లు కోరుతుంటే… కాకినాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు తూర్పు గోదావ‌రి జిల్లాకు పేరు ఉంచాల‌ని అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇలా.. ఒక్కొక్క చోట ఒక్కొక్క ర‌కంగా పేర్ల కోసం కూడా పోరుకు సిద్ధమ‌వుతున్న ప‌రిస్థితి సీఎం జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌పోటుగా మారే అవ‌కాశం అయితే ఉంది.

Tags:    

Similar News