జగన్ ఒడిసిపడుతున్నారు.. బాబు బిత్తరచూపులు

జగన్ మార్క్ రాజకీయానికి చంద్రబాబు సైతం బిత్తరపోవాల్సిందే. చంద్రబాబు పట్టు ఎక్కడ ఉందో చూసి మరీ జగన్ గట్టిగానే దెబ్బేస్తున్నాడు, టీడీపీని దశాబ్దాలుగా ఆదరించిన ఉత్తరాంధ్రను ఇపుడు [more]

Update: 2020-07-27 15:30 GMT

జగన్ మార్క్ రాజకీయానికి చంద్రబాబు సైతం బిత్తరపోవాల్సిందే. చంద్రబాబు పట్టు ఎక్కడ ఉందో చూసి మరీ జగన్ గట్టిగానే దెబ్బేస్తున్నాడు, టీడీపీని దశాబ్దాలుగా ఆదరించిన ఉత్తరాంధ్రను ఇపుడు ఆ పార్టీకి కాకుండా చేసేందుకు జగన్ వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. అందులో భాగంగానే ఏరి కోరి మరీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదరి అప్పలరాజుని మంత్రిని చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున మత్య్సకార సామాజికవర్గం ఉంది. వారికి టికెట్లు కూడా పెద్దగా దక్కిన దాఖలాలు లేవు. వారితో ఓట్లు వేయించుకోవడం తప్ప ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర కూడా పెద్దగా ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇక టీడీపీ ఇప్పటికి మూడు సార్లు వాసుపల్లి గణేష్ కుమార్ కి విశాఖలో టికెట్ ఇస్తే ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు మంత్రి కాదు కానీ ప్రభుత్వ విప్ కూడా దక్కలేదు.

చేరదీస్తున్నారా…?

ఇక జగన్ ఉతరాంధ్ర సామాజిక సమీకరణలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. గత పాలకులు విస్మరించిన వర్గాలను అక్కున చేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే టికెట్ అప్పలరాజుకి ఇచ్చారు. ఇపుడు మంత్రిని కూడా చేశారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ గా కేవలం వెలమల డామినేషన్ కే చంద్రబాబు అవకాశం ఇస్తే జగన్ మాత్రం మరో బలమైన సామాజికవర్గం కాళింగులను కూడా చేరదీస్తున్నారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాంకి అవకాశం ఇవ్వడం కూడా అలాగే చూడాలి. రానున్న రోజుల్లో ఇదే సామాజికవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా సముచిత స్థానం కల్పించేందుకు కూడా చూస్తున్నారు.

అలా చెక్ ….

ఇక వెలమలకు ఎన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినా కూడా కీలకమైన పోస్టులు మాత్రం వారికి దక్కలేదు. దాంతో జగన్ వారికి అతి ముఖ్యమైన పోర్ట్ ఫోలియోలు ఇవ్వడం ద్వారా తనకు చంద్రబాబుకు తేడా ఇదేనని చూపిస్తున్నారు. ఇక తూర్పు కాపులు కూడా బాబు హయాంలో ఇబ్బంది పడ్డారు. అయితే జగన్ మాత్రం బొత్స సత్యనారాయణకు అతి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టి ఆయన హోదాను, స్థాయిని పెంచారు. అదే విధంగా ఓసీ కాపుగా ఉన్న అవంతి శ్రీనివాస్ ని మంత్రిని చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో కాపులకు తాను కాపు కాస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారు.

బాబు మరచిన చోట…..

ఇక గిరిజన వర్గాలకు బాబు మొండి చేయి చూపించారు అంటారు. కేవలం మంత్రి పదవి కోసమే వైసీపీని వీడి టీడీపీలో చేరిన కిడారి సర్వేశ్వరరావుని ఆశపెట్టి మరీ అలాగే ఉంచేశారు. చివరికి ఆయన మరణంతో కానీ బాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. అది కూడా ఎన్నికలకు అరు నెలల ముందు సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ ని మంత్రిని చేసి అసెంబ్లీకి నెగ్గలేదని తరువాత తీసేశారు. దీంతో జగన్ అలా కాకుండా తనతో పాటే విజయనగరం జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. వెనువెంటనే గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేసి గిరిజన‌ ఎమ్మెల్యేలందరికీ చోటు కల్పించారు. మొత్తానికి బీసీలలో వెనక్కి నెట్టబడిన వర్గాలను ఆదరించడం ద్వారా జగన్ తనదైన సామాజిక న్యాయం పాటిస్తున్నారు. 2024 నాటికి ఉత్తరాంధ్రను వైసీపీకి కంచుకోటను చేయాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే తెలుగుదేశానికి ఎపుడూ విపక్ష స్థానమే ఖాయమవుతుందనడంలో డౌటే లేదు.

Tags:    

Similar News