సొనియా ముందు జగన్ ఆ కోరిక కోరారా ?

జగన్..సోనియాగాంధీ మధ్య జరిగిన వివాదం ఏంటి అన్నది చూచాయగా బయట జనాలకు తెలుసు. దాని కంటే ముందు నిజాలో అబద్దాలో కానీ నాటి పత్రికలు పెద్దగా అచ్చేశాయి. [more]

Update: 2020-07-25 08:00 GMT

జగన్..సోనియాగాంధీ మధ్య జరిగిన వివాదం ఏంటి అన్నది చూచాయగా బయట జనాలకు తెలుసు. దాని కంటే ముందు నిజాలో అబద్దాలో కానీ నాటి పత్రికలు పెద్దగా అచ్చేశాయి. వాటిని కూడా జనం నమ్మారు. ఇక మరో వైపు చూసుకుంటే వైఎస్సార్ కి సొంత కాంగ్రెస్ పార్టీలోనే శత్రువులు ఎక్కువ ఉన్నారు. వారు ఆయన చనిపోగానే ఒక్కసారిగా జూలు విదిలించారు. తమ కోపం, ప్రతాపం అంతా జగన్ మీద చూపించారు. దాంతో సోనియాకు, జగన్ మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందని, దాని మీద జగన్ ఏం చెప్పినా హస్తం పార్టీ అధినేత్రి అసలు వినిపించుకోలేదని అన్న మాట కూడా ఉంది.

ఆసక్తికరమే….

దీని మీద ఇప్పటికీ చర్చ ఉండనే ఉంది. జగన్ని సోనియా ఎందుకు దూరం చేసుకున్నారు. అసలు జగన్ ఆమెను ఏ రకమైన అలవి కాని కోరికలు కోరారు. ఆయన ముఖ్యమంత్రి సీటుపై పట్టుపట్టారా అన్నది కూడా ఒక చర్చ. ఇప్పటికీ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్ ని వీడారని చెబుతారు. కానీ ఆనాడు సోనియాతో జగన్ మాట్లాడినపుడు కనీసంగా కూడా సీఎం సీటు ప్రస్తావన రాలేదని అంటారు. నాడు జరిగిన విషయాలను జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ తాజాగా ఒక చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవి ఆసక్తికరమైన సమాచారాన్ని బయటకు తెచ్చాయి.

పార్టీ కోసమే….

తాను తన తండ్రి వైఎస్సార్ మాదిరిగానే పార్టీ కోసమే పనిచేస్తానని జగన్ ఆనాడు సోనియాకు చెప్పారట. తనకు అవకాశం ఇస్తే ఉమ్మడి ఏపీ అంతా పాదయాత్ర చేసి 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తెస్తానని చెప్పారట. అంతే కాదు 41 ఎంపీ సీట్లను కూడా కాంగ్రెస్ కి గెలిపించి ఇస్తామని అని కూడా జగన్ అన్నారట. ఇక తాను ఇంత చేసిన తరువాతనే 2014 ఎన్నికల తరువాత సీఎం సీటు కోరుకుంటానని కూడా జగన్ కాంగ్రెస్ అధినేత్రితో విన్నవించుకున్నారట. మరి సోనియా మాత్రం జగన్ విన్నపాలను ఏ మాత్రం పట్టించుకోలేదని, ఆయనకు అసలు ఏ అవకాశం ఇవ్వలేదని విజయమ్మ మాటల ద్వారా అర్ధమవుతోంది. దాంతోనే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు రావాల్సివచ్చిందని అంటున్నారు.

తప్పుడు అంచనా….

ఇవన్నీ ఇపుడు మళ్ళీ ప్రస్తావనకు వస్తున్నాయంటే దానికి కారణం ఓ వైపు ఏపీలో జగన్ రాజకీయ వైభవం ఘనంగా వెలిగిపోతూండడం. అదే సమయంలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ స్థాయిలో కునారిల్లడం. ఇక కాంగ్రెస్ లో వరస పెట్టి యువనేతలు పార్టీకి గుడ్ బై కొట్టడం. ఈ నేపధ్యంలో పదేళ్ళ క్రితం జగన్ పార్టీని వదిలి వెళ్ళిపోవడాన్ని అంతా మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. నాడు జగన్ దే తప్పు అన్నవారంతా ఇపుడు సోనియా వైపే వేలెత్తిచూపిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి తన పోకడలు, అహంకారపూరిత‌మైన వైఖరితోనే పార్టీని నాశనం చేసుకుంటున్నారని ఢిల్లీ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ లాంటి వారు నాడే కాంగ్రెస్ లో ఉంటే ఉమ్మడి ఏపీ విభజన లేకుండానే కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశాలు ఉండేవని, దేశంలో బీజేపీ వేవ్ నాడు ఉన్నా కాంగ్రెస్ కి ఎంతో కొంత పుంజుకునే చాన్స్ కూడా ఉండేదన్న భావన ఇపుడు అందరిలోనూ వ్యక్తం అవుతోంది. మొత్తానికి జగన్ విషయంలో కాంగ్రెస్ అతి పెద్ద తప్పు చేసిందన్న మాట ఇపుడు అంతా అంటున్నారు.

Tags:    

Similar News