జగన్ అలా చేస్తే బీజేపీ ఇలానా ?

రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిన్న పార్టీలు నేతలు ఉన్న దేశం మనది. ఒకరు ఎత్తు వేస్తే మరొకరు పై ఎత్తు వేస్తారు. ఇపుడు ఏపీ రాజకీయాల మీద [more]

Update: 2020-07-17 02:00 GMT

రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిన్న పార్టీలు నేతలు ఉన్న దేశం మనది. ఒకరు ఎత్తు వేస్తే మరొకరు పై ఎత్తు వేస్తారు. ఇపుడు ఏపీ రాజకీయాల మీద కన్నేసిన బీజేపీ కూడా జగన్ బాటలోనే వెళ్తోంది. జగన్ రాజకీయాన్ని గమనిస్తూ తామూ అదే రూట్లో చలో అంటోంది. ఇంతకీ జగన్ రూటు తెలిస్తే బీజేపీ రాజకీయం కూడా అర్ధమవుతుంది. అదేంటి అంటే జగన్ విశాఖ రాజధాని అంటున్నారు. ఆయన పోయి పోయి ఏపీలో ఒక మూలన ఉన్న ఉత్తరాంధ్రా మీద గురి పెట్టారు. జగన్ కి ఆ మూడు జిల్లాలు 2014 ఎన్నికల్లో ఝలక్ ఇచ్చాయి. అవే జిల్లాలు 2019 ఎన్నికలో బ్రహ్మరధం పట్టాయి. దాంతో పార్టీని పటిష్టం చేసుకుని ఉత్తరాంధ్రా జిల్లాలను కంచుకోటగా మార్చుకోవాలని జగన్ ఆలోచన చేస్తున్నారు.

విశాఖ దానికే …

జగన్ విశాఖలో మకాం పెట్టడానికి అసలు కారణం రాజకీయం అని అందరికీ తెలిసిందే. ఇక్కడ మూడు జిల్లాల్లో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లు , అయిదు ఎంపీ సీట్లు గుత్తమొత్తంగా వైసీపీ ఖాతాలో వేసుకోవాలంటే ఏకంగా అక్కడే ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఉత్తరాంధ్రాకు ముఖద్వారంగా ఉన్న విశాఖను రాజధానిని చేయడం ద్వారా ఈ ప్రాంతం జనాలను ఆకట్టుకోవాలని జగన్ ప్లాన్. ఓ వైపు ఏపీకి అన్ని విధాలుగా విశాఖ గ్రోత్ ఇంజన్ అవుతుందని,అదే సమయంలో తన రాజకీయ ప్రయోజనాలూ నెరవేరుతాయని జగన్ తలపోస్తున్నారు.

అదే ధీమా….

ఇక జగన్ కి 2014 ఎన్నికల్లో అధికారం తృటిలో తప్పిపోవడానికి కారణం ఉత్తరాంధ్రా జిల్లాలు దారుణంగా దెబ్బ కొట్టడమే. మొత్తానికి మొత్తం 9 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రాతో పాటు గోదావరి జిల్లాలూ నాడు దెబ్బేశాయి, ఇపుడు రాజధాని పేరిట ఈ అయిదు జిల్లాలను అక్కున చేర్చుకుంటే తనకు ఎప్పటికీ తిరుగులేని మెజారిటీ సొంతం అవుతుందని, అధికారం శాశ్వతం అవుతుందని జగన్ భావిస్తున్నారుట. ఇక మరో వైపు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు, నెల్లూరు ప్రకాశం జిల్లాలు వైసీపీకి ఎపుడూ కంచుకోటలేనని, ఇక గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో కొంత రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా మొత్తం మీద భారీ రాజకీయ లాభం తన సొంతం అవుతుందని జగన్ గట్టి ప్లానే వేశారు.

రివర్స్ అటాక్….

అయితే ఇది రాజకీయం, ఎల్లకాలం ఒకేలా ఉండదు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా కొమ్ము కాస్తూ వచ్చిన రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు విశాఖ రాజధాని అంటే రివర్స్ అవుతాయని ఒక అంచనా ఉంది. పైగా జగన్ రాయలసీమ వాసి అయి ఉండి కర్నూల్లో రాజధాని పెట్టి గత కాలం నష్టాన్ని భర్తీ చేయకుండా సదూరంగా ఉన్న విశాఖకు రాజధానిని తీసుకుపోవడాన్ని సీమవాసులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆంధ్రా జిల్లాలు అయితే జగన్ మీద రగులుతున్నాయి. అమరావతిని డమ్మీని చేస్తే ఊరుకోమని కొన్ని సామాజికవర్గాలు సవాల్ చేస్తున్నాయి.

అదే ఆయుధంగా ….

ఇక ఇపుడు ఇవన్నీ కూడా టీడీపీ కంటే కూడా తాను బాగా ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయిందట. ఏపీలో టీడీపీకి జనంలో విశ్వాసం లేదని, నానాటికీ ఆ పార్టీ కుదించుకుపోతోందని కూడా అంచనా కడుతోంది. జగన్ ఇలా విశాఖకు షిఫ్ట్ కాగానే అలా రాయలసీమ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి బీజేపీ రెడీ అవుతోంది అంటున్నారు. అలాగే ఆంధ్రా ప్రాంతంలో ఉన్న బలమైన సామాజికవర్గాలను అక్కున చేరుకుని జగన్ కి యాంటీగా సమరం నడపాలని చూస్తోంది. మరి అది కనుక వర్కౌట్ అయితే జగన్ కి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నరాయల‌సీమతో పాటు ఇతర ప్రాంతాలు గట్టి షాక్ ఇస్తాయా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News