ముందుగా వెళ్ళేది ముఖ్యమంత్రే ?

అవును. ఒక రాష్ట్రంలో మొదటి వ్యక్తి ఎవరూ అంటే ముఖ్యమంత్రే అని చెబుతారు. ఇపుడు కూడా అలాంటిదే జరుగుతోంది. విశాఖను రాజధాని చేయాలన్నది జగన్ గట్టి పట్టుదల. [more]

Update: 2020-07-16 13:30 GMT

అవును. ఒక రాష్ట్రంలో మొదటి వ్యక్తి ఎవరూ అంటే ముఖ్యమంత్రే అని చెబుతారు. ఇపుడు కూడా అలాంటిదే జరుగుతోంది. విశాఖను రాజధాని చేయాలన్నది జగన్ గట్టి పట్టుదల. ఇది అందరికీ తెలిసిందే. అయితే విశాఖకు మొత్తం పాలనా వ్యవస్థను కదిలించడం అంటే కరోనా టైంలో సాధ్యపడుతుందా అన్నది ఒక పెద్ద డౌట్. పైగా సచివాలయం తరలింపు అన్నది అతి పెద్ద ప్రయత్నం. వారంతా ఇప్పటికే హైదరాబాద్ టు అమరావతి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. విశాఖ అంటే అది అసలు కుదిరే పని లేదు. ఇక అక్కడే విడిది చేయాలి. దాంతో పాటు కోర్టు కేసులు, అనేక చిక్కు ముడులు ఉన్నాయి. వీటన్నిటికీ మధ్యేమార్గంగా జగన్ ఒక ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తానే అలా …..

జగన్ ఒక మాట నిండు అసెంబ్లీలో ఆ మధ్య చెప్పారు. రాజధాని అన్న దానికి సరైన నిర్వచనం ఏదీ లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నారు. ఆ విధంగా తాను కనుక విశాఖ వెళ్ళిపోతే టెక్నికల్ గా అదే రాజధాని అవుతుంది అని జగన్ భావిస్తున్నారుట. గత కొద్ది రోజులుగా ఆయన దీని మీదనే సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. ఈ మధ్య డీజీపీ గౌతం సవాంగ్ విశాఖలో రెండు రోజుల పాటు పర్యటించి మొత్తం అంతా సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖకు తరలివస్తే ఎక్కడ పెట్టాలి. ఏది భద్రతాపరంగా మేలు అన్నది డీజీపీ స్వీయ అంచనా వేసుకోవడానికే టూర్ వేశారని చెబుతున్నారు.

అలా అందరూ….

తన వెంటను సిరి అన్నట్లుగా ముందుగా ముఖ్యమంత్రి కదిలితే మిగిలిన విభాగాలు కూడా ఒక్కోటీగా వచ్చేస్తాయి. అసలు సీఎం ఆఫీస్ వచ్చేసింది అంటే మిగిలినవి ఎక్కడా ఉన్నా వెతుక్కుంటూ రావాల్సిందే. ఏపీలోని మొత్తం పాలనావ్యవహారాలు అన్నీ కూడా సీఎం కనుసన్నలలోనే సాగుతాయి కాబట్టి తప్పనిసరిగా అధికారులు డేక్కుంటూ అయినా రావాల్సిందే. ఇక ముఖ్యమంత్రి వస్తే డీజీపీ వస్తారు. సీఎస్ వస్తారు. ఇతర విభాగాల పెద్దలు కూడా వస్తారు. వీరంతా వచ్చాక సచివాలయం కూడా తరలివస్తుంది. దీంతో జగన్ దీనికే ఓటు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

తొందరలోనే….

ఇక ముందుగా ముఖ్యమంత్రి వరకూ రావడం అంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని, జగన్ ఎపుడు తలచుకుంటే అపుడు విశాఖకు మకాం మారుస్తారని అంటున్నారు. శ్రావణ మాసంలో మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఆ నెల్లో సీఎం కుడి కాలు పెట్టి మరీ విశాఖను అధికారికంగా రాజధానిగా చేస్తారని అంటున్నారు. ఇక మాటలు లేవు అన్నీ చేతలే అన్నట్లుగా సీఎం క్యాంప్ ఆఫీస్ కనుక తరలివస్తే విశాఖకు మొత్తం రాజధాని వచ్చేసినట్లే లెక్క. విపక్షాలు శషబిషలు, విమర్శలు, మరే రకమైన ఉద్యమాలు, ఆందోళనలూ ఇవన్నీ కూడా ఇకపైన పూర్తిగా సద్దుమణగిపోతాయని కూడా వైసీపీ పెద్దలు అంచనా వేస్తున్నారుట. కరోనా మహమ్మారి తగ్గుతుందని చూస్తూ కూర్చుంటే అభివృధ్ధి ఆగిపోతోందని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోందిట. అందుక జగన్ దూకుడుగా ఈ అడుగు వేయాలని రెడీ అవుతున్నారని భోగట్టా.

Tags:    

Similar News