ఫీడ్ బ్యాక్ అలా రావడంతో … జగన్?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ వ్యూహాన్ని మార్చబోతున్నారు. తన కొచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఒక సామాజిక వర్గం దూరమవుతుందని తెలుసుకున్న జగన్ దిద్దుబాటు చర్యలు [more]

Update: 2020-07-13 08:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ వ్యూహాన్ని మార్చబోతున్నారు. తన కొచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఒక సామాజిక వర్గం దూరమవుతుందని తెలుసుకున్న జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆ సామాజికవర్గానికి పెద్దయెత్తున ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే జగన్ కేబినెట్ లోకి ఆ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి వచ్చి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

కమ్మ సామాజిక వర్గం టార్గెట్ గా….

ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన తర్వాత కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారన్న టాక్ ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారైతే దూరంగా పెడుతున్నారన్న ఆరోపణలు కూడా విన్పించాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ దగ్గర నుంచి అధికారులైన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్ లాంటి వారిని టార్గెట్ చేయడం మరింత చర్చకు దారి తీసింది.

కేబినెట్ లో మరొకరికి….

గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గంలోని అనేకమంది కూడా జగన్ వెంట నిలిచారు. చంద్రబాబు పోకడలు ఇష్టపడక వారు జగన్ కు మద్దతిచ్చారు. అయితే రాజధాని అమరావతి తరలింపు, గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలు జగన్ కు ఆ సామాజికవర్గం దూరమయిందన్న ఫీడ్ బ్యాక్ అందింది. దీంతో త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే కొడాలి నాని ఉన్నప్పటికీ, మరో మంత్రికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఇందుకోసం మర్రి రాజశేఖర్ పేరు బలంగా విన్పిస్తుంది.

నామినేటెడ్ పోస్టులు కూడా…..

కేవలం దీంతో సరిపెట్టకుండా నామినేషన్ పోస్టుల్లో కూడా కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అధికారుల విషయంలో కూడా కొన్ని కీలక పోస్టుల్లో నియమించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తద్వారా పార్టీలో కూడా ఆ సామాజికవర్గం నేతలకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందంటున్నారు. మొత్తం మీద జగన్ త్వరలోనే తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది అమరావతి టాక్.

Tags:    

Similar News