నంబర్ గేమ్ కి జగన్ చెక్ .. మూడ్ అవుట్ చేశారా?

జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఎక్కడో తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీసులో కూర్చుని తాపీగా సమీక్షలు చేసుకుంటారు. మిగతా విషయాలు ఆయనకు తెలియవు అనుకుంటే పొరపాటే మరి. ఆయన [more]

Update: 2020-07-12 05:00 GMT

జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఎక్కడో తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీసులో కూర్చుని తాపీగా సమీక్షలు చేసుకుంటారు. మిగతా విషయాలు ఆయనకు తెలియవు అనుకుంటే పొరపాటే మరి. ఆయన సూపర్ పవర్ ముఖ్యమంత్రి. రాష్ట్రమంతటా ఆయనకు కళ్ళూ చెవులూ ఉన్నాయి. ఆయనకు సూది మొన అంత శబ్దం కూడా వినిపిస్తుంది. అతి సూక్ష్మ విషయం అయినా కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకంటే వైసీపీలో ఇపుడే నంబర్ గేమ్ స్టార్ట్ అయింది. జగన్ కొన్ని బాధ్యతలు కొందరికి అప్పగించి చూడమంటే వారంతా జగన్ తరువాత మేమే అనేంతగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. జగన్ నీడను అని ఒకరు అనుకుంటే, జగన్ తో సమానం నేను అని మరొకరు అనుకుంటున్నారు. ఇలా పార్టీలో వర్గ పోరుని గమనించిన తరువాతనే జగన్ అన్నిటికీ ఒకే యాక్షన్ తో అతి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేశారు.

మూడు ముక్కలే ….

ఏపీలో పార్టీ వ్యవహారాలు చూడమంటూ ముగ్గురు సీనియర్ నాయకులకు జగన్ బాధ్యతలు అప్పగించారు. దీని మీద వైసీపీలో సామాజిక న్యాయం లేదని మరో వైపు విపక్షం రచ్చ చేస్తోంది. ఆ గోల ఎలా ఉన్నా దీని వెనకాల జగన్ మార్క్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. అదేంటి అంటే జగన్ తరువాత నంబర్ టూ గా విజయసాయిరెడ్డి పేరు ఇప్పటిదాకా గట్టిగా వినిపించేది. పార్టీలో మొత్తం విజయసాయే అని బిల్డప్ కూడా ఇచ్చుకునే రేంజికి అది చేరింది. దాంతో ఆయన్ని కేవలం మూడు జిల్లాల నేతగా జగన్ చేసి పారేశారు. తాను పదమూడు జిల్లాలు అనుకుంటే మూడేంటి అని మూడ్ అవుట్ చేసుకోవడం విజయసాయి వంతు అవుతోందిట.

వారికీ సరి…..

ఇక జగన్ పార్టీలో కీలక‌మైన భూమిక పోషిస్తున్న సజ్జల రామ‌క్రిష్ణారెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన ఈ మధ్య తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరచూ వస్తూ హల్ చల్ చేస్తున్నారు. అసలు ఆయనకూ విజయసాయిరెడ్డికి అసలు పడడంలేదని టాక్ కూడా ఉంది. దాంతో ఆయన నేనే జగన్ తరువాత అనుకున్నారు. అయితే ఆయన్ని కూడా కేవలం నాలుగైదు జిల్లాల‌లే పరిమితం చేశారు. అంటే ఆయన పరిధి కూడా ఏంటో చూపించారని అంటున్నారు. ఇక జగన్ బాబాయ్ హోదాలో తాను పార్టీకి బహు సన్నిహితుడిని అని చెప్పుకుని నంబర్ టూ అంటే నేనే అని ఫీలవుతున్న వైవీ సుబ్బారెడ్డికి కూడా జగన్ గట్టి ఝలక్ ఇచ్చేశారని అంటున్నారు. వైవీని గోదావరి జిల్లాలు దాటి రావద్దు అన్నదే జగన్ సందేశమని కూడా చెబుతున్నారు.

జగనే సుప్రీం …..

వైసీపీలో సర్వం సహా జగనేనని తాజా పరిణామాలతో మరోమారు ఆయన రుజువు చేశారని అంటున్నారు. జగన్ తలచుకుంటేనే ఎవరైనా నాయకులు అని లేకపోతే వారి స్థానం జగనే నిర్ణయిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలను చూసిన వైవీ సుబ్బారెడ్డి పార్టీలో వన్ టూ టెన్ జగన్ మాత్రమేనని ఇపుడు అంటున్నారు. తమ పార్టీలో నంబర్ల గేమ్ నడవడం లేదని, జగన్ ఒక్కరే అసలైన లీడర్ అని కూడా ఆయన చెప్పేశారు. తామంతా కార్యకర్తలమేనని కూడా అన్నారు. మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో కానీ ఆయనకూ అదే జరిగిందని వైసీపీలో ఇపుడు వినిపిస్తోంది. మొత్తం మీద జగనే నంబర్ వన్ అని తేలిపోయింది అంటున్నారు.

Tags:    

Similar News