మైండ్ బ్లాంక్ చేశారుగా.. నోట మాట రాదుగా?

విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ 125అడుగుల విగ్రహ ఏర్పాటు. ఈ వార్త చూడగానే ఉరుము లేని పిడుగులా ఏమిటీ నిర్ణయం? ఆ ఊసే లేకుండా ఏకంగా శంకుస్థాపనకి [more]

Update: 2020-07-07 08:00 GMT

విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ 125అడుగుల విగ్రహ ఏర్పాటు. ఈ వార్త చూడగానే ఉరుము లేని పిడుగులా ఏమిటీ నిర్ణయం? ఆ ఊసే లేకుండా ఏకంగా శంకుస్థాపనకి ఏర్పాట్లు. ఎవరు నోరెత్తే అవకాశమే ఇవ్వకుండా బెజవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం. అది కూడా 125 అడుగుల ఎత్తున. అక్కడెక్కడో నయా అమరావతిలో ఓ మూలన శాఖమురు కొండ మీద కదా ఇది ఏర్పాటు చేయాల్సింది…. ఇలా బెజవాడలో అంటే అది కులం మీద, కుల ఆధిపత్యం మీద కొట్టిన దెబ్బే కదా. ఈ ఊరు, ఈ నేల ఎప్పటికీ మన చెప్పు చేతల్లో, మన గుప్పెట్లో ఉండాలన్నది కదా ఆలోచన… అలాంటిది బెజవాడలో అంతెత్తున అంబేడ్కర్ విగ్రహం అంటే అహం మీద కోలుకోలేని దెబ్బే కదా.

ఆయనతోనే రాజకీయం…..

అయినా అంబేడ్కర్ పేరుతో ఎంత రాజకీయం చేయాలి… 2016 ఏప్రిల్ లో ముచ్చట…. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించడానికి, అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణానికి 210కోట్లు కేటాయిస్తూ జీవో ఇవ్వడంతో జూపూడి, కారెం శివాజీ లాంటి వాళ్ళు మైమరచి చంద్రబాబుని పొగడ్తలతో ముంచేశారు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో 125 అడుగుల ఎత్తున శాఖమురు లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి ఏప్రిల్ లో శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ నాటికి స్మృతి వనం, విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2020 వచ్చింది. అవి ఎందుకు పూర్తి కాలేదో జూపూడి ప్రభాకర్, కారెం సమాధానం చెప్పాలి. మేము ఆ పార్టీలో లేము అని వాళ్ళు చెబుతారు అనుకోండి. అయినా అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు అంటూ ప్రకటించి ఎన్నేళ్ళు అయ్యింది. రాజధాని మాటున రాజకీయం చేద్దాం అని ఆర్భాటంగా ప్రకటించి, ప్రచారం ఉదరగొట్టి ఎన్నేళ్ళు అయ్యింది. ఆ కొండ గుట్టల్ని చదును చేయడం కూడా కొలిక్కి రాలేదాయే. ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడెందుకు అని ఏకంగా బెజవాడలోనే కట్టేస్తారట.

.ఇప్పుడు ఏమిటి కర్తవ్యం…

ఎలా స్పందించినా ప్రమాదమే, ఔనంటే మీరు ఎందుకు చేయలేదంటారు. కాదంటే అంబేడ్కర్ మీద చిన్న చూపు అనేస్తారు. చంద్రబాబు ఒక్కరికే కాదు, ఒంటి కాలి మీద లేచే అన్ని పార్టీలకు ఇప్పుడు చుట్టూ పెద్ద గొయ్యి కనిపిస్తోంది. చంద్రబాబుకి మైక్ మాదిరి తయారైన భారత కమ్యూనిస్టు పార్టీ వైఖరి చూడాలి. ఉదయం పత్రికల్లో ఏదైనా వార్త రావడం ఆలస్యం, దాని మీద ముఖ్యమంత్రికి లేఖ రాయడం అలవాటుగా మారింది. ఇప్పుడు స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుకులంగానో, వ్యతిరేకంగానో లేఖ రాసి వారి కమిట్ మెంట్ చూపుకోవాలి. అలా చేస్తారా చేయరా అన్నది వారి సొంత నిర్ణయం.

చైనా భాగస్వామ్యంతో….

ఇక పిడబ్ల్యూడీ గ్రౌండ్ విషయానికి వద్దాం… అక్కడ చైనా భాగస్వామ్యంతో ఏదో ప్రాజెక్టు ప్లాన్ చేసి ఫోటోలు వదిలారు కదా….. అదేమయ్యింది. ఎందుకు అటకెక్కింది. ఇప్పుడు చైనా అనే దమ్ముందా? చైనాకు ఇచ్చిన మాట ప్రకారం ఆ స్థలం వాళ్లకి ఇవ్వాల్సిందే అని చూడండి. 2016 మే 22న దీనికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. చైనా కి చెందిన జిఐఐసితో ఒప్పందం కూడా చేసుకున్నారు. స్వరాజ్య మైదానం, స్టేట్ గెస్ట్ హౌస్, డీజీ క్వార్టర్స్, విద్యుత్ సబ్ స్టేషన్ అన్ని కలిపి సిటీ స్క్వేర్ కట్టాలని అనుకున్నారు. ఆ ఒప్పందాన్ని గౌరవించాలని చంద్రబాబు గారు కోరుకోవాలి. అప్పుడే ఆయన మాట మీద నిలబడే మనిషి అనుకుంటారు.

రూటు మార్చిన జగన్….అంతా తొండి…

విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏమిటి, కనీసం మాట మాత్రం బయటకు తెలియకుండా…, ముందస్తు మీడియా కథనాలు లేకుండా, చడి చప్పుడు లేకుండా ఇలా ఊరి మధ్యలో విగ్రహం ఏర్పాటుకు సిద్ధం అయ్యారు. నిజానికి జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అని కూల్చి వేశారు. దానిని కూల్చి వేయడం కంటే ఏ ఆస్పత్రి గానో, నిరాశ్రయులకి షెల్టర్ గానో, హెచ్ఐవి రోగుల ఆస్పత్రిగానో మార్చి ఉంటే చంద్రబాబు అక్కడ ఉండలేక ఎప్పుడో ఖాళీ చేసి ఉండే వారనే అభిప్రాయం ఉన్నతాధికారుల మాటల్లో వినిపించింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులకి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేదే అసలు ప్రశ్న…

Tags:    

Similar News