తొలి నుంచి జగన్ వెంటే నడిచినా.. ఇప్పుడు మాత్రం?

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత కీల‌క‌మైన అనుచ‌రులుగా ముద్ర వేసుకున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు. ఈ [more]

Update: 2020-07-10 15:30 GMT

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత కీల‌క‌మైన అనుచ‌రులుగా ముద్ర వేసుకున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు. ఈ ఇద్దరికీ జ‌గ‌న్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఒకే జిల్లాకు చెందిన వారు. పైగా.. ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నప్ప‌టి నుంచి జ‌గ‌న్‌తోనే క‌లిసిమెలిసి ఉన్నారు. క‌ష్టాలు, సుఖాలు కూడా పంచుకున్నారు. కాంగ్రెస్‌లో త‌న‌కు ఎదురైన ప‌రాభ‌వం నేప‌థ్యంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నప్పుడు తొలిసారిగా త‌న మ‌న‌సులో మాట‌ను జ‌గ‌న్ చెప్పుకొన్నది ఈ ఇద్దరితోనే కావ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ సోనియా గాంధీని క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు జ‌గ‌న్ వెంట ఉన్నది ఈ ఇద్దరు నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

తొలి నుంచి జగన్ వెంటే….

దీంతో అప్పటికే కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేలుగా ఉన్న కొరుముట్ల శ్రీనివాసులు, గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డిలు.. తాము కూడా నీ వెంటే అంటూ.. జ‌గ‌న్ వెంటే కాంగ్రెస్‌‌ను వీడి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా జ‌గ‌న్ వెంటే న‌డుస్తున్నారు. జ‌గ‌న్ క‌ష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేశారు. పార్టీని ఇద్దరూ త‌మ త‌మ స్థాయిల్లో ముందుకు న‌డిపించారు. అదే స‌మ‌యంలో 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున‌, త‌ర్వాత 2012 ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఈ ఇద్దరూ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి విజ‌యం సాధిస్తూనే ఉన్నారు. ఇక‌, ప్రత్యర్థుల నుంచి విమ‌ర్శల‌కు కూడా ఎప్పటిక‌ప్పుడు చెక్ పెడుతూనే ఉన్నారు. జిల్లా రాజ‌కీయాల్లోనూ, రైల్వేకోడూరు, రాయ‌చోటి రాజ‌కీయాల్లో వీరిది తిరుగులేని రాజ‌కీయం.

మంత్రి పదవులు రాక….

మొన్న ఎన్నిక‌ల త‌ర్వాత ఎస్సీ కోటాలో శ్రీనివాసుల‌కు కేబినెట్ బెర్త్ ఖాయం అనుకున్నారు. అయితే చివ‌ర్లో ఇత‌ర జిల్లాల నుంచి ఐదుగురు ఎస్సీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇవ్వడంతో శ్రీనివాసులు ఆశ‌లు నెర‌వేర‌లేదు. అలాంటి ఈ ఇద్దరు కూడా కేబినెట్‌లో మాత్రం చోటు సంపాయించుకోలేక పోవ‌డం వైసీపీలో ముఖ్యంగా వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. నిన్నగాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు ద‌క్కుతున్నాయి. నిన్నగాక మొన్న టీడీపీ నుంచి వ‌చ్చిన వారికి అవ‌కాశాలు చిక్కుతున్నాయి. కానీ, ఆది నుంచి పార్టీలో ఉండి.. పార్టీ కోసం అనేక వ్యయ‌ప్ర‌యాస‌లకు ఓర్చుకున్న త‌మ‌కు ఎందుకు ప‌దవులు జగన్ ఇవ్వడంలేద‌నే చ‌ర్చ వీరిలో ఉంది.

సొంత జిల్లా కావడంతో….

నిజానికి గ‌డికోట కొంత బెట‌రే.. కేబినెట్ హోదాతో కూడిన చీఫ్ విప్ ప‌ద‌వైనా ఆయ‌న‌కు ద‌క్కింది. కానీ, కొరుముట్లకు అది కూడా లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఈక్వేష‌న్లు ఎందుకు కుద‌ర‌డం లేదు? అనేది కీల‌క ప్రశ్న. నిజానికి ఇద్దరూ కూడా సౌమ్యులే. వివాదాలకు క‌డు దూరం కూడా. అయితే, ప‌ద‌వులు మొత్తం సొంత జిల్లాకు చెందిన వారికే ఇస్తే.. బ్యాడ్ నేమ్ వ‌స్తుంద‌నే కార‌ణంగానే జ‌గ‌న్ ఆచి తూచి అడుగులు వేస్తున్నార‌నే వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ఇక శ్రీనివాసుల‌కు ప్లస్‌లు ఉన్నా రె జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన వ్యక్తి కావ‌డం మైన‌స్‌గా మారింది. ఈ క్రమంలో వ‌చ్చే రెండున్నరేళ్ల త‌ర్వాత (ఇప్పటికే ఏడాది మూడు మాసాలు గ‌డిచిపోయాయి) జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో కొరుముట్లకు ఎస్సీ కోటాలో ఖ‌చ్చితంగా బెర్త్ ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. గ‌డికోటకు ఇప్పుడున్న ప‌ద‌వే కొన‌సాగుతుంద‌నే విశ్లేష‌ణ కూడా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News