జగన్ క్లారిటీగానే ఉన్నారే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుల్లు క్లారిటీతోనే ఉన్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఆయన మరో ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. రాజధాని నగరంలో పనులను [more]

Update: 2019-11-26 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుల్లు క్లారిటీతోనే ఉన్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఆయన మరో ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. రాజధాని నగరంలో పనులను తిరిగి ప్రారంభించాలని జగన్ ఆదేశించడమే ఇందుకు నిదర్శనం. అయితే జగన్ ఇప్పటి వరకూ రాజధాని అమరావతిపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదన్నదే మిలయిన్ డాలర్ల ప్రశ్న. రాజధాని అమరావతిని తరలించే ఆలోచన జగన్ చేయరన్నది వైసీపీ అగ్రనేతల నుంచి చాలా రోజుల నుంచి విన్పిస్తున్న మాట.

సత్తిబాబు మాత్రం…..

అయితే మంత్రి బొత్స సత్యనారాయణ తరచూ రాజధాని అమరావతిపై పొంతన లేని వ్యాఖ్యలు చేయడం వల్లనే అమరావతిని రాజధానిగా జగన్ ఉంచుతారా? లేదా? అన్న సందేహాలు తలెత్తాయి. దీంతోనే హడావిడిగా విపక్షాలైన టీడీపీ, జనసేనలు రాజధానిని కొనసాగించాలని ఆందోళనలు చేశాయి. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి బంగారు బాతు గుడ్డుగా అమరావతిని అభివర్ణించారు. అయితే విపక్షాల ఆందోళనలను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. రాజధాని అమరావతిపై పెదవి కూడా విప్పలేదు.

పనులు ప్రారంభమయితే….

తాజాగా సీఆర్డీఏ సమీక్ష లో మాత్రం జగన్ తన మనసులో మాట చెప్పకనే చెప్పేశారు. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించమని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని కోరారు. అంతేకాదు 75 శాతం పూర్తయిన పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రీటెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఆర్థికంగా ఎక్కువ నిధులు గుమ్మరించకుండా అవసరమైన మేరకే పనులు చేపట్టాలని జగన్ తెలపడం చూస్తే ఇప్పటి వరకూ నిధుల సమస్యతోనే రాజధాని అమరావతిని పక్కన పెట్టారని తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు….

మరోవైపు డిసెంబరు 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని అమరావతి అంశాన్ని విపక్షం యాగీ యాగీ చేయాలనుకుంటోంది. మరోవైపు రాజధాని రైతులు కూడా తమ సంగతి చెప్పాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అమరావతి పనులను ప్రారంభించమని ఆదేశించారని చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే తమ అధినేత చంద్రబాబు రాజధాని ప్రాంత పర్యటన ఫిక్స్ అయిన వెంటనే జగన్ స్పందించారని సంబరపడుతోంది. మొత్తం మీద జగన్ రాజధానిపై క్లారిటీగానే ఉన్నారని అర్థమవుతోంది. ముఖ్య కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించినా రాజధాని అమరావతి మాత్రం అక్కడనే ఉండబోతుందన్న స్పష్టత వచ్చినట్లయింది.

Tags:    

Similar News