జగన్ హోదాకు పిల్లి శాపాలు ?

కొత్త కోడలు వస్తే శుభం అనుకుంటారు. అలాగే పార్టీలో కొత్తగా ఎవరైనా నెగ్గితే నాలుగు మంచి మాటలు చెప్పాలి. శుభమాని పెద్దల సభకు వెళ్తున్న మాజీ మంత్రి [more]

Update: 2020-07-07 02:00 GMT

కొత్త కోడలు వస్తే శుభం అనుకుంటారు. అలాగే పార్టీలో కొత్తగా ఎవరైనా నెగ్గితే నాలుగు మంచి మాటలు చెప్పాలి. శుభమాని పెద్దల సభకు వెళ్తున్న మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీకి ఏం కావాలో అన్నీ తెస్తానని చెప్పడం మాట వరసకు అయినా సబబు. అలా కాకుండా మొదటి మాటే అపశకునం పలకడమంటే తేడాగా ఉంటుంది మరి. ప్రత్యేక హోదా ఏపీకి కష్టమని ఇంకా రాజ్యసభకు కూడా వెళ్లకుండా పిల్లి శాపాలు పెడుతున్నారు మాజీ మంత్రివర్యులు. ఈ విషయంలో ఎవరూ చేసేది లేదని కూడా నీరసం కబుర్లు చెబుతున్నారు. అంటే జగన్ అయిదేళ్ళు విపక్షంలో ప్రత్యేక హోదా కోరుతూ చేసిన పోరాటాలు, అధికారంలోకి వచ్చాక నిన్న మొన్నటివరకూ కూడాచెబుతున్న మాటలు అన్నీ కూడా ఉత్తవేనని అనుకోమంటున్నారా బోసు గారు అంటున్నారు విపక్ష నేతలు.

కష్టమట…..

అది అందరికీ తెలిసిందే. కానీ అధికారంలో ఉన్న వారు, పైగా పెద్ద బాధ్యతలు మోస్తున్న వారు అనకూడని మాట అది. జగన్ సైతం భారీ మెజారిటీతో గెలిచాక గత ఏడాది మే 26న ఢిల్లీకి వెళ్ళినపుడు మీడియా మీటింగులో చెప్పినది కాస్తా అటు ఇటుగా ఇదే. హోదా రావడం అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వల్ల ఇప్పటికిపుడు సాధ్యం కాకపోవ‌చ్చు, కానీ మేము అడుగుతూనే ఉంటాం, ఢిల్లీ వచ్చినపుడల్లా తాను గుర్తు చేస్తూనే ఉంటానని కూడా చెప్పారు. ఇక కేంద్రానికి జగన్ రాసే ప్రతీ లేఖలో హోదా ఇవ్వండని అడుగుతూనే ఉన్నారు. ఈ మధ్య పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ కూడా ఏపీకి హోదా రావ‌డం తధ్యమని కూడా జగన్ చెబుతూ నిబ్బరం నింపారు. అలాంటిది హోదా రావడం కష్టమని రాజ్యసభ సభ్యుడిగా బోస్ అనడం అంటే కొంత ఇబ్బందికరమైన మాటే.

పోరాడాలిగా…?

వైసీపీకి రాజ్యసభలో ఇపుడు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. పెద్దల సభలో ఆరవ అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉంది. ఇక కేంద్రానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు, అందువల్ల ప్రతీ బిల్లూ పాస్ కావాలంటే వైసీపీ బలం చాలా ముఖ్యం. ఇటువంటి వాతావరణాన్ని అవకాశంగా తీసుకుని సందర్భోచితంగా హోదా గురించి వైసీపీ ఎంపీలు ప్రస్తావించాలి. ఏడు పదుల వయసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బోస్ లాంటి వారు ఈ విషయంలో గట్టిగా పోరాడి ఏపీకి న్యాయం చేయాలి. అలాంటిది ఆయనే కాడి వదిలేసేలా మాట్లాడితే ఎలా అన్నది వైసెపీతో పాటు అన్ని రాజకీయ పక్షాల్లో ఇపుడు చర్చగా ఉంది.

హక్కే మరి …..

విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి స్పష్టంగా చెప్పారు. అది ఏపీకి ఇచ్చిన హక్కుగా చూడాలి. అసలు ఎలాంటి హామీ కానీ ఏదీ కానీ లేని తెలంగాణా రాష్ట్రాన్ని సాకారం చేసిన చరిత్ర మన పొరుగునే కనిపిస్తుంది. దానితో పోలిస్తే ప్రత్యేక హోదా అన్నది చాలా చిన్న విషయమే. అయితే దీనికి ఉన్న ఇబ్బందులు దీనికీ ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా సమయోచితంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. జగనే చెప్పినట్లుగా మనమే ఈ హామీని మరచిపోతే కేంద్రానికి ఏమి పట్టింపు ఉంటుంది. అందువల్ల పెద్ద మనిషిగా కొత్త బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటున్న బోస్ లాంటి వారు ప్రత్యేక హోదా కోసం అడుగడునా పోరాడాలి. జగన్ కి బాసటగా నిలవాలి. ఏపీ ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి. ఆ విషయంలో జగన్ సైతం ఎంపీలకు దిశానిర్దేశం చేయాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News