జగన్ కి పెద్ద తలనొప్పి….అలా అయితే కష్టమే ?

వైసీపీ అధినేతగా ఉన్నపుడే జగన్ హామీ ఇచ్చారు. ఏపీని పాతిక జిల్లాలుగా చేస్తామని. పాదయాత్ర వేళ ఆయన చాలా చోట్ల తిరుగుతూ అక్కడికక్కడ కొత్త జిల్లాల హామీలు [more]

Update: 2020-07-05 15:30 GMT

వైసీపీ అధినేతగా ఉన్నపుడే జగన్ హామీ ఇచ్చారు. ఏపీని పాతిక జిల్లాలుగా చేస్తామని. పాదయాత్ర వేళ ఆయన చాలా చోట్ల తిరుగుతూ అక్కడికక్కడ కొత్త జిల్లాల హామీలు ఇచ్చేశారు. పార్లమెంట్ పరిధిని తీసుకుని ఒక జిల్లా చేస్తామని చెప్పుకొచ్చారు. నిజానికి ఇది బీజేపీ నినాదం. రాష్ట్రం రెండు ముక్కలు అయిన కొత్తల్లో బీజేపీ వారు ఏపీని పాతిక జిల్లాలుగా విడగొట్టాలని కోరుతూ వచ్చారు. ఆ తరువాత వారు ఎందుకో ఊరుకున్నారు. ఇక దాన్ని జగన్ పట్టుకున్నట్లుగా ఉంది. ప్రతీ పార్లమెంట్ సీటూ ఒక జిల్లా అని ఆయన ఆర్భాటంగా ప్రకటించారు. అది సరే అనుకున్నా దానికి ఉన్న శాస్త్రీయత ఏంటి అన్నది ఇపుడు మేధావుల ప్రశ్నగా ఉంది. ఆరేడు అసెంబ్లీ సీట్లను కలిపి ఒక పార్లమెంట్ సీటు చేశారు. పైగా రెండు మూడు జిల్లాలలోని అసెంబ్లీ సీట్లతో కూడా లోక్ సభ సీట్లు అయినవి ఏపీలో ఉన్నాయి.

అరకులో అలా …..

అరకు పార్లమెంట్ సీటు తీసుకుంటే ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల అసెంబ్లీ సీట్లు అందులోకి వస్తాయి. ఆ విధంగా చూసుకుంటే అరకు అయిదు జిల్లాలుగా చేయాలా అన్న మాట ఉంది. పైగా ఎక్కడా రంప చోడవరం, మరెక్కడో శ్రీకాకుళం సీతంపేట ఇవన్నీ కలసి అరకు జిల్లా కేంద్రానికి రావడం అంటే కుదిరే పనేనా, ఒక్క రోజు పడుతుంది అన్న మాట కూడా ఉంది. జిల్లాల విభజన అంటే పాలన మరింత దగ్గరగా, సులువుగా ఉండాలని అంటారు. జిల్లా పరిధి ఎలా చూసుకున్నా యాభై కిలోమీటర్ల దూరం మించకపోతేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. అరకు జిల్లా అంటే గరిష్టంగా రెండు వందల కిలోమీటర్ల పై చిలుకు ప్రాంతాలు అన్నీ కూడా ఇక్కడ కలుస్తాయి. మరి అలా కొత్త జిల్లా చేయడం కంటే పాత జిల్లాలో వారు ఉండడమే బెటర్ కదా అంటున్నారు.

సిక్కోలు బాధ …

ఇక 1950 వరకూ ఒడిషాలోనే శ్రీకాకుళం ఉండేది. ఆ తరువాత అది జిల్లా అయింది. 1978లో శ్రీకాకుళం నుంచి విజయనగరం వేరు పడి కొత్త జిల్లా అయింది. పార్లమెంట్ పరిధిలో జిల్లా అంటే శ్రీకాకుళంలో ఉన్న పది అసెంబ్లీ సీట్లతో కనీసంగా నాలుగైదు సీట్లు కోల్పోవాలి, అంటే సగం జిల్లాను అన్న మాట. పైగా అభివృధ్ధి జరిగిన ఎచ్చెర్ల, రాజాం వంటి ప్రాంతాలు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కలుస్తాయి. అక్కడే విద్యాలయాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక పాలకొండ వెళ్ళి అరకు గిరిజన జిల్లాలో కలుస్తుంది. దీనివల్ల మాకేంటి అంటున్నారు శ్రీకాకుళం జిల్లవాసులు, అభివ్రుధ్ధి కోసమే అయితే శ్రీకాకుళాన్ని మూడు జిల్లాలుగా చేయాలని డిమాండ్ వస్తోంది. రాజాం కేంద్రంగా ఒక జిల్లా, ఉద్ధానం కేంద్రంగా మరో జిల్లా, పాలకొండ కేంద్రంగా గిరిజన జిల్లా చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ అంతేగా …?

ఇక విశాఖ జిల్లా తీసుకుంటే అతి పెద్ద జిల్లా అటు ఏజెన్సీ నుంచి ఇటు రూరల్ జిల్లా నుంచి విశాఖ రావడానికి ఎంతో వ్యయప్రయాస అవుతుంది. పార్లమెంట్ సీటు లెక్కన జిల్లా అంటే అరకు, అనకాపల్లి, విశాఖగా మూడు జిల్లాలు అవుతాయి. విశాఖ జిల్లా వరకూ ఒకే అయినా అనకాపల్లి జిల్లా అంటే మొత్తం రూరల్ ప్రాంతం అంతా దూరంగా జిల్లా కేంద్రానికి దూరం అవుతుందని అంటున్నారు. ఎక్కడో పాయకరావు పేట నుంచి అనకాపల్లి దాకా వచ్చినా ఒకటే, ఇదివరకులా విశాఖ వచ్చినా ఒకటేనని అంటున్నారు. దాంతో నర్శీపట్నం జిల్లాను చేయమని డిమాండ్ వస్తోంది. మొత్తానికి జిల్లాల విభజన అంటే శాస్త్రీయంగా ఉండాలి తప్ప హడావుడిగా చేయరాదని, పైగా పార్లమెంట్ సీట్ల ప్రాతికన అన్నది తప్పుడు విభజన అని కూడా అంటున్నారు. చూడాలి మరి జగన్ సర్కార్ కి ఇది కొత్త తలనొప్పిలా మారుతుందేమో.

Tags:    

Similar News