జగన్ ను ఆ నిందను భరించాల్సిందేనా?

జగన్ ఒక ఉన్మాది, విద్వంసకారుడు, తుగ్లక్ ఇలా తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు తిడుతోంది. చంద్రబాబే ఏకంగా ఇటువంటి కఠిన పదజాలాన్ని వాడారు, ఇందంతా ఎందుకు వచ్చింది [more]

Update: 2020-06-26 13:30 GMT

జగన్ ఒక ఉన్మాది, విద్వంసకారుడు, తుగ్లక్ ఇలా తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు తిడుతోంది. చంద్రబాబే ఏకంగా ఇటువంటి కఠిన పదజాలాన్ని వాడారు, ఇందంతా ఎందుకు వచ్చింది అంటే ప్రజా వేదికను జగన్ 2019 జూన్ 25న కూల్చేశారు. అప్పటికి ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి నెల కూడా అవలేదు. రెండు రోజుల పాటు ఆయన కలెక్టర్ల మీటింగు అక్కడే పెట్టారు. దాంతో బాబు ఇల్లు పక్కనే కదా ఆయనకు కొత్త సీఎంగా తన దర్పాన్ని జగన్ చూపించడానికి ఆ ప్లేస్ ఎంచుకున్నారని అంతా అనుకున్నారు. కానీ జగన్ రెండవ రోజున బాంబు లాంటి వార్త చెప్పారు. ఈ బిల్డింగ్ కూలగొట్టేస్తున్నామని చెప్పి షాక్ తినిపించారు. ఇక కలెక్టర్లకు కూడా జగన్ క్లాస్ తీసుకున్నారు. అక్రమ కట్టడాల విషయంలో చూసీ చూడన‌ట్లుగా ఉండవద్దు అని కూడా జగన్ ఆదేశించారు.

ఏం జరిగింది…?

ఆ తరువాత వాయువేగాన చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమానికి నోటీసులు ఇచ్చామని వైసీపీ వారు ప్రచారం చేశారు. బాబుని గెంటేస్తున్నారని టీడీపీ వారు రివర్స్ లో డ్రామా స్టార్ట్ చేశారు. బాబు ఉంటున్న ఇల్లు అక్రమం అని వైసీపీ కౌంటరేసింది. ఇక క్రిష్ణా నది ఒడ్డున కరకట్ట మీద నదీ పరివాహిక ప్రదేశాల చట్టాలను ఉల్లఘించి కట్టిన ఇంట్లో బాబు ఉంటున్నారని పెద్ద నోరు చేసుకుంది వైసీపీ. అంతే కాదు మొత్తం క్రిష్ణా తీరం అంతటా ఉన్న అక్రమ కట్టడాలు ఒక్క పెట్టున లేచిపోతాయని కూడా వైసీపీ ప్రభుత్వ పెద్దలు పెద్ద బిల్డప్ ఇచ్చారు. అంతేకాదు, రాష్ట్రంలో చెరువులు నదీ గర్భాలను మూసేస్తూ కట్టిన అక్రమ కట్టడాల అంతు తేల్చుతామని కూడా అన్నారు.చివరకు ఏమీ కాలేదు.బాబు హ్యాపీగా అక్రమ కట్టడంలోనే గత ఏడాదిగా ఉంటున్నారు.

నింద మోస్తున్నారా…?

ఇక ప్రజా వేదిక కూల్చిన నింద మాత్రం వైసీపీ అధినేతగా, సీఎం గా జగన్ మోస్తున్నారు. నిజానికి ఇది తొమ్మిది కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో కట్టించినది. అక్రమ కట్టడాలు కూల్చాలి అనుకుంటే ముందు ప్రైవేట్ వారికి కూల్చి ఆనక ప్రభుత్వం వద్ద ఉన్న భవనాల సంగతి తేల్చితే బాగుండేది. ఇక అక్రమమో సక్రమమో ఒకసారి ప్రజా ధనం వెచ్చింది కట్టాక కూల్చడం భావ్యం కాదని కూడా మేధావులు సహా అంతా నాడు అభిప్రాయపడ్డారు. అలా ముఖ్యమంత్రి అయి కేవలం నెల కూడా కాక ముందే జగన్ తనలోని రెండవ మనిషిని జనాలకు చూపించరని అంటారు.

మచ్చ పోగొట్టాలంటే….?

ఇక జగన్ తమ మీద పడిన మచ్చ పోగుట్టుకోవాలంటే ముందు అర్జంటుగా బాబుని అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయించాలి. లేకపోతే బాబు తాను అక్రమ భవనంలో ఉంటూ మరో అక్రమ భవనం కూల్చిన దాన్ని చూపించి ప్రతీ ఏటా తద్దినాల మాదిరిగా సంతాప సభలు పెట్టిస్తూనే ఉంటారు. ఇక ముందే చెప్పినట్లుగా క్రిష్ణా తీరం వెంబడి ఉన్న అక్రమ కట్టడాల అంతు తేల్చాలి. అలాగే ఏపీలో ఉన్న ఇతర అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకోవాలి. అపుడే జగన్ తన చిత్తశుధ్ధిని, నిజాయతీని నిరూపించుకుంటున్నట్లవుతుంది. లేకపోతే జగన్ ని విద్వంసకారుడుగా బాబు చెప్పడం కాదు, జనం కూడా నమ్ముతారు. పైగా కక్షతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుప్ప చేసి పెట్టారని కూడా అంటారు.

Tags:    

Similar News