జగన్ డొల్లతనం బయపడినట్లేనా ?

పార్టీ జగన్ పెట్టాలనుకున్నారని 2010 చివర్లో వినిపించింది. ఆ మాటను కొంత పుకారుగా అప్పటికే జగన్ పక్కన చేరిన అంబటి రాంబాబు తదితరులు మీడియాకు చేరవేస్తూ వచ్చారు. [more]

Update: 2020-06-26 08:00 GMT

పార్టీ జగన్ పెట్టాలనుకున్నారని 2010 చివర్లో వినిపించింది. ఆ మాటను కొంత పుకారుగా అప్పటికే జగన్ పక్కన చేరిన అంబటి రాంబాబు తదితరులు మీడియాకు చేరవేస్తూ వచ్చారు. దానికి ముందు ప్రాతిపదిక ఏంటి అంటే జగన్ ఎంపీ పదవికి, కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. ఆ తరువాత ఉప ఎన్నికలు ఆరు నెలల్లో జరగాల్సివుంది. దాంతో జగన్ తప్పనిసరిగా ఒక పార్టీ పెట్టాల్సివచ్చింది. ఇక అప్పటికే శివకుమార్ అనే వ్యక్తి వైఎస్సార్ మీద అభిమానంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరిట రిజిష్టర్ చేయించారు. జగన్ ఆ పార్టీలో చేరి దానికే అధినేత అయ్యారు. శివకుమార్ ని కూడా పార్టీలోకి తీసుకుని ఆదరించారు. ఇదీ ఇపుడు నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు లేవనెత్తుతున్న పార్టీ మూలాలకు సంబంధించిన ప్రధానాంశాలలో ఇది ఒకటిగా ఉంది.

అంతా తానై …..

ప్రాంతీయ పార్టీ అంటే అన్నీ తాను అయి వ్యవహరించడం సహజం. కానీ వైసీపీలో పార్టీగా సర్వం సహా జగనే కనిపిస్తున్నారు. పార్టీ మీటింగులు లేవు, పొలిట్ బ్యూరో లాంటిది ఒకటి రాజకీయ వ్యవహరాల కమిటీ అని క్రియేట్ చేసినా అది సమావేశం అవదు, పార్టీలో ఎందరు ఉపాధ్యక్షులు ఉన్నారు, ఎందరు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, ఎందరు జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరికీ తెలియవ్. జగనే పార్టీగా వైసీపీ నడుస్తోంది. ఇక చాలామందికి వైసీపీ ఫుల్ ఫార్మ్ కూడా తెలియదు అంటే ఆశ్చర్యం లేదు కూడా.

అదొకటి ఉండాలిగా..?

రాజు గారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ లాజిక్ పాయింట్లే ఎత్తారు. క్రమశిక్షణా సంఘం ఒకటి ఉంటుంది. అది పరిశీలించి అవిధేయులకు షోకాజ్ నోటీస్ ఇస్తుంది. అది సమావేశమైనట్లుగా మినిట్స్ ఉండాలి. ఎందుకంటే వైసీపీ మామూలు పార్టీ కాదు, ఎలెక్షన్ కమిషన్ వద్ద రిజిష్టర్ అయిన పార్టీ. పైగా అధికారంలో ఉంది. అందువల్ల పార్టీ నిర్మాణం పక్కాగా ఉండాలి. మరి ఈ మౌలికమైన విషయాలు పార్టీ పెద్దలు ఎందుకు మిస్ అయ్యారో ఎవరికీ తెలియదులా ఉంది.

ఆ హోదా ఎలా ….?

అసలు ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలుగానే వైసీపీ, టీడీపీ ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్ అయ్యాయి. కానీ చంద్రబాబు తాను జాతీయ ప్రెసిడెంట్ అని ప్రకటించుకుంటారు, ఇక ఆయన కుమారుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. వైసీపీలోనూ అంతే విజయసాయిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఒక జాతీయ పార్టీగా గుర్తింపు ఎన్నికల సంఘం వద్ద ఉండాలంటే కచ్చితంగా నాలుగు రాష్ట్రాలలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి. కనీసంగా ఆరు శాతం ఓట్లు ఒక్కో రాష్రంలో సంపాదించాలి. లేకపోతే అక్కడ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం ఉండాలి.

ఇరకాటమేనా…?

మరి ఇవేమీ అటు వైసీపీకి, ఇటు టీడీపీకి లేవు. సరిగ్గా ఈ పాయింటే పట్టుకున్నారు రాజు గారు. వీటికి ఇపుడు అర్జంటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ హై కమాండ్ మీద ఉంది. అంతే కాదు, ఇంకా మరిన్ని ప్రశ్నలు ఆయన వేసే అవకాశం ఉంది. పార్టీగా వైసీపీ నిర్మాణం, రెగ్యులర్ మీటింగులు వీటి మీద కూడా రాజు గారు ప్రశ్నలు సంధిస్తే వైసీపీ ఇరకాటంలోనే పడుతుంది. ఓ విధంగా రాజు గారు కళ్ళు తెరిపించారనే అనుకోవాలేమో. ఇప్పటికైనా పార్టీ పట్ల, వాటి బాధ్యుల పట్ల, పార్టీ సమావేశాలు ఎంత విలువైనవో వైసీపీ హై కమాండ్ కి అర్ధమవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News