మారుతుంది అందుకే… మారాల్సింది జగనే

జగన్ విపక్షంలో ఉన్నపుడు తొమ్మిది మంది ఎంపీలు వైసీపీ తరఫున గెలిచారు. వారిలో తెలంగాణా రాష్ట్రం ఖమ్మం నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఒకరైతే మిగిలిన వారంతా [more]

Update: 2020-06-28 06:30 GMT

జగన్ విపక్షంలో ఉన్నపుడు తొమ్మిది మంది ఎంపీలు వైసీపీ తరఫున గెలిచారు. వారిలో తెలంగాణా రాష్ట్రం ఖమ్మం నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఒకరైతే మిగిలిన వారంతా ఏపీకి చెందిన వారే. అందరిలోకి మొదట వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసింది నంద్యాల ఎంపీ ఎస్ పీ వై రెడ్డి. ఆయన భారీ పారిశ్రామికవేత్త. అంతకు ముందు కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇక జగన్ వైసీపీలో చేర్చుకున్నాక ఆయన లక్ష ఓట్లతో 2014 ఎన్నికల్లో గెలిచారు. రాయలసీమలో జగన్ బలం తెలిసి ఆయన చేరారనుకోవాలి. ఆ తరువాత ఓటు వేసిన ఓటరు చేతి సిరా ఆరకముందే పార్టీ మారారు. ఆ తరువాత నెల రోజుల వ్యవధిలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీని వీడారు, ఇక కర్నూలు ఎంపీగా గెలిచిన ఎంపీ బుట్టా రేణుక కూడా తరువాత రోజులో వైసీపీని వీడారు. టీయారెస్ లో పొంగులేటి సుధాకరరెడ్డి చేరిపోయారు. అంటే తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే అందులో నలుగురు పార్టీని వీడారు. దాదాపు యాభై శాతం అన్నమాట.

ఎమ్మెల్యేలూ ఝలక్…..

ఇక ఒకరు ఇద్దరూ కాదు, ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి కొత్త చరిత్ర స్రుష్టించారు. అందులో నలుగురు మంత్రులు అయ్యారు కూడా. ఇలా జగన్ పార్టీ నుంచి కీలకమైన నాయకులు కూడా ఆనాడు పార్టీని వదిలిపోయారు. పోనీ వారంతా అధికారం కోసం పార్టీని వీడారని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు. అలా ఇలా కాదు బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగా విపక్షం నుంచి అధికార పక్షం వైపుగా ఫిరాయింపులు ఉండాలి. కానీ జరుగుతున్నది వేరు. ఏపీలో తొలి రెబెల్ ఎంపీగా రఘురామక్రిష్ణంరాజు ఉన్నారు. ఆయన మీద వేటు వేసేందుకు వైసీపీ కూడా రెడీ అయింది.

ఇదే వరసలో….

ఇక రఘురామ క్రిష్ణంరాజు ఎపిసోడ్ ఇపుడు అంతా చూస్తున్నారు. ఆయన మీద వైసీపీ సస్పెన్షన్ వేటు వేస్తే ఆయన ఫ్రీ బర్డ్ అవుతారు. అపుడు ఆయన ఏకంగా తనకు నచ్చిన పార్టీతో సన్నిహితంగా ఉండవచ్చు. అంటే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి డిటాచ్ అయినట్లు అన్నమాట. ఆయనకు ఎవరూ హైకమాండ్ ఉండరు, స్వేచ్చా జీవి అవుతారు. ఇపుడు రాజుగారు అదే కోరుకుంటున్నారు. అదే జరిగితే ఆయన బీజేపీ వైపు వెళ్తారని అంటున్నారు. మరి రాజు గారి సభ్యత్వం రద్దు కాకుండా పార్టీ నుంచి బయటపడి భారీ లబ్ది పొందితే జగన్ బాధితులు ఎవరైనా పార్టీలో ఉంటే వారు కూడా ఇదే రూట్లో నడుస్తారన్న ప్రచారం కూడా ఉంది.

నాయకత్వ లోపమేనా…?

జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కూడా ఎంపీలను కోల్పోతున్నారు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది. ఇది చెప్పాలంటే ఎన్టీయార్ కధ కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 1984లో ఎన్టీయార్ మీద నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే జనం భారీ సానుభూతి చూపి ఉద్యమించారు. అదే ఎన్టీయార్ మీద 1995లో వెన్నుపోటు జరిగితే జనం కూడా రెస్పాండ్ కాలేదు. కారణం పదే పదే అదే జరిగితే లోపమన్నది నాయకుడిలోనే ఉందని నమ్మారు కాబట్టి. జగన్ విషయం ఇపుడు అలాగే ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు జారిపోతున్నారంటే తప్పు ఒకవైపే ఉండదు, రెండవ వైపు కూడా ఎంతో కొంత ఉంటుంది. జగన్ అది మరచి వరసగా సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు మిగులుతారు అన్నది కూడా ఒక చర్చ. ఇక జగన్ సైతం పార్టీ నాయకులులతో పెద్ద గ్యాప్ కోరి పెంచుకున్నారు. పార్టీ అంటే జగన్ ఒక్కరే కాదు, నాయకులు కూడా ఉంటేనే విజయాలు దక్కుతాయి. వారి పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. మరి ఆ విషయం విస్మరించి అంతా నేనే అని అహంభావానికి పోతే పార్టీ చిక్కుల్లో పడుతుంది. ఈ విషయంలో మారుతున్న ఎంపీలను తప్పుపట్టడం కాదు, మారాల్సినది జగన్ కూడా.

Tags:    

Similar News