ఇప్పుడు కాదట.. అవి పూర్తయిన తర్వాతేనట?

రాజ్యసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో ఇద్దరు మంత్రులు మాజీలవుతున్నారు. వారు రేపో మాపో తమ పదవులకు రాజీనామా చేయడం లాంఛనం. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట [more]

Update: 2020-07-04 02:00 GMT

రాజ్యసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో ఇద్దరు మంత్రులు మాజీలవుతున్నారు. వారు రేపో మాపో తమ పదవులకు రాజీనామా చేయడం లాంఛనం. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ రాజీనామాలు చేస్తే జగన్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాక 23 మంది మంత్రులే ఉంటారు. అంటే రెండు ఖాళీలు ఉంటాయన్నమాట. సరే ఈ రెండింటితోనే సీఎం జగన్ సరిపెడతారా లేక మార్పులూ చేర్పులూ పెద్ద ఎత్తున ఉంటాయా అన్నదే ఇపుడు అసలైన చర్చ.

ఆశల మోసులు….

ఇక మంత్రి పదవి అన్నది ఎమ్మెల్యే అయిన ప్రతీవారికీ టార్గెట్. పైగా ఏడాది పాలన కూడా ముగిసింది కాబట్టి ఇపుడు జూనియర్లూ సీనియారిటీ కోటాలోకి చేరిపోయారు. వారు సైతం కుర్చీ కావాలంటున్నారు. ఆ జాబితాలో ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో ఆశావహులు చాలా మంది ఉన్నారు. తామెందుకు కుర్చీ ఎక్కకూడదు అన్నది వారి ఆశ, ఆలోచన. విశాఖ నుంచి గుడివాడ అమరనాధ్, కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు మంత్రిపదవి కోసం రేసులో ఉన్నారని అంటున్నారు. అలాగే విజయనగరం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. శ్రీకాకుళం నుంచి పలాస ఎమ్మెల్యే సీదర అప్పలరాజు, కళావతి, కంబాల జోగులు, ధర్మాన ప్రసాదరావు ఉన్నారు.

వారే ఔట్….

ఇక కుర్చీ దిగిపోతారనుకుంటున్న వారిలో ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పనితీరు అసలు బాగాలేదని వైసీపీ హై కమాండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆమె మీద సొంత మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు విమర్శలు చేశారంటేనే మంత్రిగా ఆమె ఎంతగా విఫలం అయ్యారో తెలుస్తోంది అంటున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణ దాస్ మీద కూడా జగన్ గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మంత్రిని చేస్తే ఎక్కడా కూడా దూకుడు చూపించలేకపోయారని అంటున్నారు. దాంతో మంత్రివర్గ విస్తరణ అంటూ ఉంటే ఈ ఇద్దరి సీట్లూ లేచిపోతాయని అంటున్నారు. వీరి స్థానం కోసం ఆశావహులు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విశాఖలో అవంతి శ్రీనివాస్ పట్ల పెద్దగా వ్యతిరేకత లేదని, జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో అక్కడ సీటు కోసం పోటీ పెరుగుతోంది.

లోకల్ బాడీ తర్వాతే…?

ఇక జగన్ మంత్రివర్గ విస్తరణ అనే తేనెతుట్టెను కదల్చడానికి ఇపుడేమీ తొందరపడరని అంటున్నారు. ఇప్పటికిపుడు ఖాళీ అయిన రెండు కీలకమైన శాఖలను సీనియర్లకు బదలాయిస్తారని, లేకపోతే శాఖలలో మార్పులు చేర్పులు చేసి మరో మారు అవకాశం ఇస్తారని అంటున్నారు. అప్పటికీ తీరు మార్చుకోకపోతే లోకల్ బాడీ ఎన్నికల వరకూ చూసి అపుడు వారి పనితీరు, పార్టీ గెలుపు వంటివి కొలమానంగా తీసుకుని పెద్ద ఎత్తున మంత్రివర్గం విస్తరణ చేస్తారని అంటున్నారు. మొత్తానికి పిల్లి, మోపిదేవి స్థానాలు అలాగే ఖాళీగా ఉంటాయని అంటున్నారు. కానీ మంత్రివర్గం విస్తరణ ఖాయమని, అది జగన్ చెప్పినట్లుగా కాకుండా రెండేళ్ళ లోపే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఎవరి జాతకాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News