నిజమే…శత్రువులు పెరుగుతున్నారు

నిజం… గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనలేదు. జగన్ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి మరీ జనం మనసు దోచి మరీ [more]

Update: 2019-11-25 06:30 GMT

నిజం… గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనలేదు. జగన్ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి మరీ జనం మనసు దోచి మరీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ప్రజలు కూడా జగన్ ను విశ్వసించి 151 సీట్లు కట్టబెట్టారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే జగన్ కు శత్రువుల సంఖ్యం పెరుగుతూ వస్తుంది. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి రాలేదని సీనియర్ నేతలు సయితం ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు.

ఐదు నెలల్లోనే….

జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమై కేవలం ఐదు నెలలు మాత్రమే అయింది. అయితే తనను గెలిపించిన ప్రజలకు వీలయినంత త్వరగా మంచి చేయాలని కేవలం సంక్షేమ పథకాలపైనే దృ‌ష్టి సారించారు. తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు పర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పాదయాత్రలో చంద్రబాబు పై చేసిన విమర్శలకు కూడా సీఎం అయిన తర్వాత జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ వాటిని రద్దు చేస్తూ వెళుతున్నారు.

నిర్ణయాలు ఏకపక్షమంటూ….

తొలుత ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభమై పోలవరం టెండర్లు రద్దు, బందరు పోర్టు క్యాన్సిల్ వంటివి జగన్ తీసుకున్న నిర్ణయాలు. అయితే వీటిని తప్పుపడుతూ విపక్షాలన్నీ కేవలం 30 రోజులకే ఏకమయ్యాయి. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా తాను చెప్పినట్లే జగన్ నడుచుకోవాలంటాడు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే తెలుగు భాష అంతరించిపోతున్నట్లు బిల్డప్ ఇస్తారు. ఈ ఇద్దరూ ఏకమయ్యారన్నది అందరికీ తెలిసిందే.

అందరూ కలసిపోయి…..

ఇక ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యమే లేని బీజేపీ సయితం జగన్ ను టార్గెట్ చేసింది. చిన్న విషయాలను సయితం రాద్ధాంతం చేస్తోంది. ఇసుక, ఇంగ్లీష్, మతం వంటి విషయాల్లో బీజేపీ జగన్ పై కన్నెర్ర చేస్తుంది. ఇక తాజాగా కమ్యునిస్టు పార్టీలు సయితం జగన్ వెంట పడ్డాయి. ఐదు నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి ఇంత మంది శత్రువులను మూటగట్టు కోవడం ఇదే ప్రధమమంటున్నారు. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఇన్ని సమస్యలను ఎదుర్కొనలేదన్నది విశ్లేషకుల మాట. మొత్తం మీద మంచికో, చెడుకో జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం శత్రువుల సంఖ్యను పెంచుతూ పోతుంది.

Tags:    

Similar News