మరో ఇద్దరికి అవకాశం… వారెవరనేదే?

శాసనమండలి రద్దు కాలేదు. పార్లమెంటులో ఇంకా పెండింగ్ లో ఉంది. దీంతో శాసనమండలిలో ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. జగన్ కు ఇది ఒకరకంగా [more]

Update: 2020-06-22 14:30 GMT

శాసనమండలి రద్దు కాలేదు. పార్లమెంటులో ఇంకా పెండింగ్ లో ఉంది. దీంతో శాసనమండలిలో ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. జగన్ కు ఇది ఒకరకంగా పరీక్ష లాంటిదే. శాసనసభలో ఆమోదించిన బిల్లులను శాసనమండలిలో వ్యతిరేకిస్తుండటంతో జగన్ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో మండలి రద్దు బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపారు.

మండలి రద్దు కాకపోవడంతో….

ఇది జరిగి ఐదు నెలలు దాటుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొంత ఆలస్యమయ్యే అవకాశముంది. అనేక రాష్ట్రాల నుంచి శాసనమండలిని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనలు కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అందుకే శాసనమండలి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. దీంతో మరికొద్ది కాలం శాసన మండలి రద్దు అయ్యే అవకాశం లేదు.

రాజ్యసభకు ఎన్నిక కావడంతో…

అయితే ఇప్పటికే శాసనమండలి సభ్యులిద్దరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వారిని ఎమ్మెల్సీలను చేసి జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. అయితే తానే శాసనమండలిని రద్దు చేస్తూ ప్రతిపాదన పంపడంతో వారిద్దరినీ జగన్ రాజ్యసభకు పంపారు. అయితే శాసనమండలి ఇప్పటి వరకూ రద్దు కాకపోడం, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో మరో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినట్లే.

మరో ఇద్దరికి అవకాశం….

వీరిద్దరి స్థానంలో మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. మంత్రులుగా ఉన్న వారిని రాజ్యసభకు పంపి వారిస్థానంలో తిరిగి కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో వైసీపీ లో కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తం మీద మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జగన్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అదే సామాజికవర్గం నేతలతో భర్తీ చేస్తారా? ఇతరులకు అవకాశమిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News