జగన్ స్ట్రాంగ్ అవుతున్నారు ?

ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ రాజకీయాల్లో జగన్ అతి కీలకమైన నాయకుడు. బలమైన నాయకుడు. ఇక ఆయన పెట్టిన పార్టీ కూడా టీడీపీ మాదిరిగా దశాబ్దాల పాటు [more]

Update: 2020-06-21 02:00 GMT

ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ రాజకీయాల్లో జగన్ అతి కీలకమైన నాయకుడు. బలమైన నాయకుడు. ఇక ఆయన పెట్టిన పార్టీ కూడా టీడీపీ మాదిరిగా దశాబ్దాల పాటు అధికారం చూసే అవకాశం ఉందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. జగన్ చాలా జాగ్రత్తగా పార్టీ మూల సిధ్ధాంతాలను కాపాడుకుంటూవస్తున్నారు. ఏ పార్టీకైనా అవే శ్రీరామ రక్ష. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసిన జగన్ ఆ పార్టీ ఫిలాసఫీని కూడా ఒడుపుగా తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ కి ఉన్న సంప్రదాయ వర్గాలను కూడా తెలివిగా లాగేసుకున్నారు. నిజానికి ఈ వర్గాల కోసం పోటీ పడే మరో పార్టీ కూడా ఏపీలో లేకపోవడం జగన్ అదృష్టం.

మైనారిటీల తరఫున…

జగన్ మైనారిటీల ప్రతినిధిగా ఉంటున్నారు. పార్టీని అలా నిలిపి ఉంచారు. స్వతహాగా ఆయన క్రిస్టియన్ మైనారిటీ వర్గానికి చెందినవారు కావడం కూడా ఆయనకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో పేరులో ఉన్న రెడ్డి తో హిందూ సమాజంలో కూడా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. పొలిటికల్ గా బలమైన రెడ్డి సామాజికవర్గం దన్ను కొడా పూర్తిగా తనకే అనిపించుకున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, వర్గాల బలం కూడా వైసీపీకి ఉండేలా చూసుకున్న జగన్ ఇపుడు బీసీలకు గాలం వేసి అక్కడా తన పట్టు పెంచుకున్నారు.

తగ్గలేదుగా…

కేంద్రంలోని బీజేపీతో సఖ్యతను కొనసాగించిన జగన్ పార్టీకి సంబంధించిన మౌలిక విషయాల్లో మాత్రం రాజీలేదని మరోమారు గట్టిగా చాటుకున్నారు రెండు రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించి జగన్ ముస్లిం మైనారిటీ వర్గాలకు నిఖార్సైన నాయకుడిగా నిలిచారు. ఈ విషయంలో జగన్ మీద ఆశలు పెట్టుకున్న బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. తాము ఎపుడు మైనారిటీ పక్షమేనని క్లారిటీగా చెప్పేశారు.

శాశ్వత పునాది….

కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. ముస్లిం మైనారిటీలకు కొంత అభద్రతాభావం ఉంది. దేశంలో కాషాయ రాజకీయాలకు పెద్ద నాయకులూ, పార్టీలు తలవంచుతున్న నేపధ్యంలో దేశంలో కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణా సీఎం లాంటి కొద్ది మంది మాత్రమే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. వారు ఆయా రాష్ట్రాల్లో లాంగ్ స్టాండింగ్ పొలిటికల్ కెరీర్ కొనసాగించడం విశేషం. ఇపుడు వారి పక్కన చేరిన జగన్ కూడా తన సుదీర్ఘ రాజకీయానికి బాటలు వేసుకున్నారు. ఏపీలో మైనారిటీ వర్గాలను ఆదుకుంటామంటూ జగన్ కి పోటీగా వచ్చే మరో నాయకుడు కూడా లేకపోవడం అదృష్టమే. చంద్రబాబు టీడీపీ ఊసరవెల్లి రాజకీయ విధానాలతో ఎపుడు మైనారిటీలు విశ్వసించని స్థితికి తెచ్చుకున్నారు. ఇపుడు కూడా ఆయన మోడీ దయ కోసం ఎదురుచూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ పోయి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. మరో వైపు బీజేపీ వామపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉనికిలో లేకుండా ఉంది. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు జగన్ మళ్లీ మళ్ళీ గెలిచేలా పార్టీకి గట్టి పునాదులు ఏర్పాటుచేసుకోవడం ద్వారా ముందు చూపున్న నేతగా నిలిచారు అంటున్నారు.

Tags:    

Similar News