జగన్ కోటరీ నుంచి బయటపడాల్సిందేనా?

జగన్ చుట్టూ కోటరీ.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయింది. ఇందులో ఎక్కువ సమయం జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు [more]

Update: 2020-06-15 06:30 GMT

జగన్ చుట్టూ కోటరీ.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయింది. ఇందులో ఎక్కువ సమయం జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసమే కేటాయించారు. తాను పాదయాత్రలోనూ, మ్యేనిఫేస్టో లోనూ ఇచ్చిన హామీల అమలుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఏడాదిలోనే 90 శాతం హామీలను అమలు చేశామని జగన్ చెప్పుకుంటున్నారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను జగన్ ఆపలేదు. ఇది వైసీపీ నేతల నుంచే విన్పిస్తున్న మాట.

చంద్రబాబు కూడా…..

అయితే అదే సమయంలో జగన్ కోటరీలో బందీ అయిపోయారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అదీ సొంత పార్టీ నుంచే. నిజమే. ప్రతి ముఖ్యమంత్రి వెనక ఒక కోటరీ ఉంటుంది. వారిని దాటుకుని వెళ్లందే ముఖ్యమంత్రిని కలిసే వీలుండదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనూ ఇలాంటి కోటరీ ఒకటుండేది. అందుకే టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు చంద్రబాబు కోటరీ తమను కలవనివ్వకుండా చేసిందని, తమ సమస్యలను చెప్పుకునే వీలు లేకపోయిందని టీడీపీ నేతలు వాపోయారు. వల్లభనేని వంశీ లాంటి పార్టీని వీడిన నేతలయితే చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా ఉండగా కలవడం అసాధ్యమని చెప్పేశారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి….

ిప్రస్తుతం జగన్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. ఇందులో జగన్ స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఎమ్మెల్యేలను, ఎంపీలకు జగన్ కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గాల్లో సమస్యలను తెలుసుకుని ఉండాల్సింది. కానీ జగన్ ఏడాది కాలంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసే ప్రయత్నం చేయలేదు. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు కండువాలు కప్పడానికి సమయం ఉంటుంది కాని, సొంత పార్టీ నేతలను కలిసేందుకు జగన్ కు వీలు చిక్కడం లేదన్న విమర్శలు ఆ పార్టీ నుంచే ఎప్పటి నుంచో విన్పిస్తున్నాయి.

ఇలాగయితే కష్టమే…?

తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ పై సీరియస్ వ్యాఖ్యలే చేశారనుకోవాలి. ఆయన చుట్టూ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కోటరీగా ఉన్నారని చెప్పారు. వారిని తప్పించుకుని జగన్ ను కలవడం అసాధ్యమని చెప్పారు. ఏడాది కాలంలో ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప ఎవరినీ జగన్ కలవలేదని అన్నారు. నిజమే ఎవరి స్థాయిలో వారికి సమస్యలు ఉంటాయి. వాటిని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రిగా జగన్ వారికి సమయం కేటాయించాలి. అలా చేయనందునే జగన్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటికైనా జగన్ కోటరీ నుంచి బయటపడితేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. లేకుంటే చంద్రబాబు తరహాలోనే జెండా పీకేయక తప్పదు.

Tags:    

Similar News