ఆ స్టాంప్ అలా పడిపోయింది

రాజకీయాల్లో లౌక్యం చాలా అవసరం. అది ఉంటే ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. లోపల ఎలా ఉన్నా బయట చేసే ప్రతీదీ జనం కోసమే అన్నట్లుగా ఉండాలి. అలా [more]

Update: 2019-11-28 03:30 GMT

రాజకీయాల్లో లౌక్యం చాలా అవసరం. అది ఉంటే ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. లోపల ఎలా ఉన్నా బయట చేసే ప్రతీదీ జనం కోసమే అన్నట్లుగా ఉండాలి. అలా కనిపించాలి, అనిపించాలి. ఏపీ విషయానికి వస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ గత ప్రభుత్వ నిర్ణయాలను వరసగా తిరగతోడుతోంది. మామూలుగా అయితే ఇది సహజ ప్రక్రియగానే చూడాలి. ఎందుకంటే ఒక ఆఫీస్ లో మేనేజర్ మారితేనే పద్ధతులు చాలా మారిపోతాయి. అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్, ఆయనకంటూ ఒక రాజకీయ విధానం ఉంది. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో ఒక విజన్ ఉంది. పక్కన మేధావులు, సలహాదారులు బోలెడు మంది ఉన్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి కాగానే గత పాలనలో బాబు కట్టిన ప్రజా వేదికను కూల్చేశారు. దాంతోనే జగన్ చంద్రబాబు మీద కోపంతో ఉన్నారన్న సందేశం జనంలోకి వెళ్ళిపోయింది. నిజానికి ప్రజావేదిక అక్రమ కట్టడం అయినా కూడా అందులో ప్రజల సొమ్ము ఉంది. దాన్ని కనీసం వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవాల్సిఉంది. అది చేయకుండా జగన్ చేసిన దుందుడుకు పని వల్ల జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా బాబు మీద కోపంతోనే అని తమ్ముళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు, చివరికి జనానికి మంచి చేద్దామనుకున్నా కూడా బాబు మీద ద్వేషంతోనే అంటున్నారు.

ఇసుక, ఇంగ్లీష్……

ఈ రెండు సమస్యలు ఏపీని రాజకీయంగా ఎంతలా కుదిపాయో అందరికీ తెలిసిందే. ఇసుక విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం దక్కేలా చూస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జగన్ సర్కార్ కొత్త పాలసీ ప్రకటించింది. అయితే అప్పటిదాకా పాత పాలసీని కొనసాగించకపోవడం, ఈలోగా వరదలు రావడంతో జగన్ సర్కార్ ఇబ్బందులో పడింది. దాంతో ఏపీలో అన్ని ప్రతిపక్షాలు వైసీపీపైన దండెత్తడానికి ఇసుక ఒక ఆయుధం అయిపోయింది. ఇపుడు ఇసుక సరఫరా మెరుగుపడింది. అయినా బాబు మీద కోపంతో ఇసుక కొరత స్రుష్టించారని టీడీపీ, దాని వత్తాసు పార్టీలు అంటూనే ఉన్నాయి. ఆ నిందను జగన్ సర్కార్ మోయకతప్పడంలేదు. అదే విధంగా ఇంగ్లీష్ బోధన విషయంలో కూడా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అంతా అంటున్నారు. అయితే టీడీపీకి చెందిన నారాయణ విద్యా సంస్థలు మూసేయడానికి, మద్దతుగా ఉన్న శ్రీ చైతన్య వంటి వాటికి తాళం వేయించడానికే జగన్ ఇంగ్లీష్ బోధన అంటున్నారని నెగిటివ్ ప్రచారం మొదలెట్టేశారు. ఇక మతాన్ని కూడా తెచ్చేసి ఎంత రచ్చ చేయాలో అంత చేస్తున్నారు.

పోలవరం కధ అంతేగా?

పోలవరం విషయంలో కూడా జగన్ చేసింది కరెక్ట్ అన్న వారు ఉన్నారు. అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులను కట్టబెట్టిన తీరుకు వ్యతిరేకంగా పారదర్శకంగా పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. పాతవి రద్దు చేసి కొత్త వారికి ఇస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అయినా పోలవరం కట్టడంలేదు. ఇది కూడా బాబు మీద అక్కసుతోనే ఆపేసారని తమ్ముళ్ళు వీరంగం వేస్తుంటే వైసీపీ తప్పు చేసినట్లుగా ఉండాల్సివస్తోంది. ఇక ఒక్క టీడీపీ మాత్రమే కాదు, జనసేన, బీజేపీ, ఆఖరుకు కాషాయ పార్టీకి భిన్నధ్రువాలైన వామపక్షాలు సైతం బాబు మీద కోపంతో జగన్ పాలన చేస్తున్నారని అంటున్నారు. సీపీఐ అగ్రనేత నారాయణ సైతం జగన్ ని ఈ విధంగా అంటున్నారంటే జగన్ ఆలోచన చేసుకోవాల్సిందే. చేసిన పనుల్లో ప్రజలకు మేలు జరుగుతుందని వివరించడంలో జగన్ విఫలం అవుతున్నారని అంటున్నారు, పైగా ముందే చెప్పినట్లుగా కూల్చుడుతో జగన్ కధ మొదలెట్టడంతో ఆ స్టాంప్ అలా గట్టిగా పడిపోయింది. ఇకనైనా ప్రభుత్వం ఎవరో వ్యక్తులను ద్రుష్టిలో పెట్టుకుని కాదు, విశాలమైన ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తోందని నమ్మించేలా వైసీపీ కార్యాచరణ ఉండాలని అంతా సూచిస్తున్నారు.

Tags:    

Similar News