జగన్ కి ఆయన కూడా తోడయ్యారు

నిజంగా సరైన సమయంలో జగన్ కి మద్దతు లభించింది. ఒక విధంగా చెప్పాలంటే భారీ ఊరట దక్కింది. జగన్ తనపైన వస్తున్న ఆరోపణలకు ఎంతలా మదన‌పడ్డారో తూర్పుగోదావరి [more]

Update: 2019-11-25 03:30 GMT

నిజంగా సరైన సమయంలో జగన్ కి మద్దతు లభించింది. ఒక విధంగా చెప్పాలంటే భారీ ఊరట దక్కింది. జగన్ తనపైన వస్తున్న ఆరోపణలకు ఎంతలా మదన‌పడ్డారో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సభలో బయటపెట్టుకున్నారు కూడా. తాను మంచి పని చేద్దామనుకుని ఇంగ్లీష్ బోధనను సర్కార్ బడులలో ప్రవేశపెడుతూంటే నానా మాటలు అంటున్నారని జగన్ ఓ విధంగా సభాముఖంగా ఆవేదన చెందారు. బీసీ పిల్లలు, పేదల కోసమే ఇంగ్లీష్ భాష ప్రవేశ పెట్టాలనుకుంటు న్నట్లుగా జగన్ స్పష్ఠంగా చెప్పారు. అయితే దాన్ని అటూ తిప్పి ఇటూ తిప్పి మధ్యలో మతాన్ని కూడా తెచ్చేశారు. ఇక క్రిస్టియన్లుగా అందరికీ మార్చడానికే జగన్ సర్కార్ ఈ విధంగా కంకణం కట్టుకుందని కూడా బండలేశారు. నిజానికి ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం మాత్రమే అని కచ్చితంగా ప్రభుత్వం చెప్పాక కూడా పనిగట్టుకుని విమర్శలు చేయడం అంటే ఒకింత బాధ ఎవరికైనా ఉంటుంది.

దత్తపీఠం స్వామీజీ మద్దతు….

జగన్ పాలన విషయంలో దత్తపీఠం స్వామీజీ శ్రీ గణపతి సచ్చితానంద పూర్తి మద్దతు ప్రకటించారు. చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ బోధన మంచిదని ఆయన సమర్దించారు. అంతే కాదు, వీసా కోసం వెళ్తే అక్కడ తెలుగు మాట్లాడతారా అంటూ స్వామి అర్ధవంతమైన ప్రశ్న వేశారు. జగన్ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారంటూ కూడా ఆయన ప్రశంసలు కురిపించడం ఈ సమయంలో జగన్ కి గొప్ప రిలీఫ్ గానే చెప్పుకోవాలి. వంశ‌పారంపర్య అర్చకుల కొనసాగింపు మంచి నిర్ణయం అని కూడా ఆయన అన్నారు. వైఎస్సార్ లాగానే జగన్ చక్కగా పాలిస్తున్నారని అంటూనే విపక్షాలకు కూడా స్వామీజీ చురకలు అంటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొంత సమయం ఇవ్వాలి, అంతే కానీ వెంటనే విమర్శలు చేయడమేంటని కూడా స్వామీజీ అనడం కూడా సబబుగానే ఉంది.

ఆ రంగు తుడిచేశారుగా?

నిజానికి జగన్ మీద అవసరమైనపుడల్లా మతం ముద్ర వేస్తున్నారు. ఇలా అన్న చంద్రబాబు అమరావతి లో వంద కోట్లతో భారీ చర్చి కడతాను అని తాను ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చిన సంగతిని సులువుగా మరచిపోతున్నారు. జగన్ మీద అవినీతి ఆరోపణలు అయిపోయాయి. ఇక మిగిలింది మతం ముద్ర అనుకుని బండలు వేస్తున్నారనుకోవాలి. అయితే గతంలో వైఎస్సార్ పాలనలో అయినా ఇపుడు జగన్ జమానాలో అయినా హిందువులకు జరుగుతున్న మేలుని ఆ వర్గాలు చెప్పడంలేదు, మరో వైపు ప్రభుత్వం కూడా గట్టిగా ప్రచారం చేసుకోవడంలేదు. ఇక అన్ని కులాలు, మతాలు సమానంగా జగన్ చూస్తున్న సంగతిని కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు.

హిందూ కార్డు అవసరమే….

ఇదే సమయంలో కొన్ని హిందూ సంస్థల అధిపతులు కూడా ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సచ్చిదానంద స్వామీజీ హిందువులకు జగన్ మేలు చేస్తున్నారని చెప్పడం ద్వారా ఆయన మీద పడ్డ మతం రంగు తుడిచేసినట్లైంది. ఇప్పటివరకూ జగన్ కి విశాఖ శారదాపీఠం స్వామీజీ మద్దతుగా ఉన్నారు. ఇపుడు దత్తపీఠం కూడా తోడు కావడంతో విపక్షాల వాదనలు చాలావరకు వీగిపోతున్నాయనే చెప్పాలి. అదే సమయంలో జగన్ సైతం హిందు కార్డ్ కోసం తన వంతుగా కదుపుతున్న పావులతో విజయవంతం అవుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News