బంపర్ మెజారిటీ కూడా బరువుగానే ఉందా?

చిత్రంగా ఉంది ఇలా విశ్లేషించుకున్నపుడు. నిజమే రాజకీయాలే బహు చిత్రం. అవి అంతే ఒక పట్టాన అర్ధం కావు. ఎపుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కూడా. [more]

Update: 2020-06-11 14:30 GMT

చిత్రంగా ఉంది ఇలా విశ్లేషించుకున్నపుడు. నిజమే రాజకీయాలే బహు చిత్రం. అవి అంతే ఒక పట్టాన అర్ధం కావు. ఎపుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కూడా. అధికారం చేతిలో ఉంది కదా అని అక్కడంతా సంబరాలు జరుగుతాయని లేదు. పోయింది కదా అని ఇటు వైపు చేతులు ముడుచుకునేదీ లేదు. ఎపుడు ఓడలు బండ్లు అవుతాయో ఎవరికి తెలుసు. అందునా ఢక్కామొక్కీలు తిన్న వారే అటూ ఇటూ ఉన్నారు. విషయానికి వస్తే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే అసంతృప్తి. రెండు పార్టీలలోనూ అధినేతల మీదనే ఈ అసమ్మతి రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రెండు పార్టీల్లోని నాయకులు ఎదుటి పక్షం అధినేతే బాగు బాగు అంటూండడం కూడా రాజకీయ చిత్రమే.

బరువు అవుతోందా…?

బంపర్ మెజారిటీ కూడా ఎపుడు బరువే. అందుకే అంటారు అవసరానికి మించిన అతి ఎపుడూ ఉండకూడ‌దని, 151 సీట్లు వైసీపీకి రాగానే బరువు భరించలేనిదిగా మారింది. అధినేత జగన్ సైతం ఊహించలేని మెజారిటీ అన్నారు కూడా. ఈ విజయం ఎంతలా పార్టీని ప్రభావితం చేసింది అంటే జగన్ సైతం తన ఎమ్మెల్యేలను కలసి అచ్చంగా ఏడాది అవుతోందిట. అంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల జగన్ సైతం వారిని సులువుగా కలుసుకోలేని స్థితి. ఇక అసెంబ్లీ అంతా మనవాళ్ళే అన్న ధీమా కూడా హై కమాండ్ కి ఉంటే మమ్మల్ని పట్టించుకోవడంలేదన్నది వైసీపీ ఎమ్మెల్యేల బాధ. దాని నుంచే అసమ్మతి స్వరం హెచ్చుగా మారి నిరసన‌ రాగమాలపిస్తోంది.

చేతులు కట్టేశారా ..?

ఎమ్మెల్యేలు అంటే ఏదో కనిపించాలిగా. దర్జా, దర్పంతో పాటు పనులు కూడా జరగాలి. ఇక అన్ని రకాలుగా లాభపడాలి కూడా. కానీ జగన్ మూతులు కట్టేయడంతో వారంతా దిక్కుతోచక గిలగిలలాడుతున్నారు. మా సర్కార్ బాగుంది. అవినీతి లేదు అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వారికి సంతోషం ఎక్కడ ఉంటుంది. రాజకీయం అంటేనే వ్యాపారం. మరి పెట్టుబడికి తగిన దిగుబడి రావద్దూ. అందుకే అనుకుంటున్నారుట. గత తెలుగుదేశం సర్కార్ మేలు. నాడు ఎమ్మెల్యేలదే రాజ్యమంతా అని.

జగన్మోహనమేనట‌…

మరో వైపు టీడీపీలో చూసుకుంటే సీనియర్లు కూడా ఆ పార్టీని విమర్శిస్తున్నారు. కరణం బలరాం లాంటి వారు ఎన్టీయార్ కాలం నుంచి ఉన్నారు. పార్టీ సొంత సామాజికవర్గానికి చెందిన వారు. వారు ఇపుడు చంద్రబాబు అసమర్ధుడు అంటూంటే మొదటికే మోసంగా పార్టీ తీరు తయారైందనిపిస్తుంది. అలాగే ఆ పార్టీ నుంచి గెలిచి వైసీపీ అధినేత జగన్ ను మెచ్చుకుంటున్న మద్దాల గిరి వంటి ఎమ్మెల్యేలు జగన్ ఒకే అంటే చాలు పరుగున టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ఫ్యాన్ నీడకు చేరుతారు అని జోస్యాలు చెబుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వారు సైతం మౌనంగా ఉంటూ జగన్ కి మద్దతు ఇస్తున్నారు. వీటిని చూసుకుని వైసీపీ మా పాలన బాగుందని మురిసిపోతూంటే, వైసీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఎంపీల నిరసనలను వినిపించి జగన్ సర్కార్ కి కౌంట్ డౌన్ మొదలైంది అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లాంటి వారు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే రెండు వైపులా అసమ్మతి ఉంది. రెండు పార్టీలలోనూ నిరసన సెగలు రగులుతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అవి ముదిరేలోపే చక్కదిద్దుకోకపోతే అధినేతలకే అసలు ముప్పు అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News