శత్రువులు ఎందుకు కలుస్తారు?

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారు నేడు మిత్రులుగా మారాలి. అయితే వారు మనస్ఫూర్తిగా పార్టీ [more]

Update: 2019-11-27 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారు నేడు మిత్రులుగా మారాలి. అయితే వారు మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేస్తారా? లేక జగన్ ఆదేశాలను కాదనలేక మౌనంగానే ప్రత్యర్థుల రాకను అంగీకరిస్తున్నారా? అన్నది చర్చగా మారింది. అయితే జగన్ మాట మేరకు ప్రస్తుతానికి అంగీకరించినా భవిష్యత్తులో ఇద్దరు నేతలు కలసి పనిచేసే పరిస్థితి లేదన్నది వాస్తవం. గతంలో చంద్రబాబు సయితం అనేక నియోజకవర్గాల్లో ఇదే సమస్యను ఎదుర్కొన్నారు.

గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…..

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. జగన్ కూడా కండువా కప్పేస్తున్నారు. చేరికల సమయంలో అప్పటికే ఆ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నప్పటికీ వారికి భవిష్యత్తుపై ఎలాంటీ హామీలు జగన్ ఇవ్వకపోవడంతో వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు ఉసూరుమంటూనే తలలు ఊపేస్తున్నారు.

ఒకరికి ఒకరు పొసగక…..

గన్నవరం నియోజవకర్గంలో వల్లభనేని వంశీ జగన్ కలిసే విషయం అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు తెలియదు. తర్వాత జగన్ ఆయన్ను పిలిపించి మాట్లాడారు. అలాగే గత ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నానికి తెలియకుండానే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ను పార్టీలో చేర్చుకున్నారు. అయితే దేవినేని అవినాష్ కు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఇక్కడ ఆ ప్రాబ్లం తలెత్తదు.

ప్రత్యర్థులుగానే…..

ఇక రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత తోట త్రిమూర్తులను పార్టీలోకి తీసుకున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకుని మూడు నెలలు కావస్తున్నా అక్కడి ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, తోట త్రిమూర్తుల మధ్య సయోధ్య లేదు. ఇప్పటి వరకూ తోట త్రిమూర్తులకు ఏ బాధ్యతలు అప్పగించలేదు. ఇద్దరు కలసి పనిచేయడం లేదు. ఇక అనకాపల్లి పార్లమెంటు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన ఆడారి ఆనంద్ ను పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ వైసీపీ ఎంపీ సత్యవతితో ఆయనకు పొసగడం లేదు. అలాగే రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణను జనసేన నుంచి తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలతో కలవడం లేదు. ఇలా కొత్తగా చేరిన నేతలందరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మరి భవిష‌్యత్తులో వీరు కలసి పనిచేస్తారా? అన్నది డౌటే.

Tags:    

Similar News