సీనియర్లకు చెక్ ? అరచి గోల చేసినా?

జగన్ తనదైన టీం సెట్ చేసుకుంటున్నారు. ఆయన తన తండ్రి హయాంలో పనిచేసిన వారిలో కొందరికే మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన వారిలో తనతో పదేళ్ళుగా రాజకీయం [more]

Update: 2020-06-10 06:30 GMT

జగన్ తనదైన టీం సెట్ చేసుకుంటున్నారు. ఆయన తన తండ్రి హయాంలో పనిచేసిన వారిలో కొందరికే మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన వారిలో తనతో పదేళ్ళుగా రాజకీయం చేసిన వారినే తీసుకున్నారు. ఇందులో కూడా నమ్మకస్తులను దగ్గరపెట్టుకున్నారు. ఇక వారంతా జగన్ ఏజ్ గ్రూప్ వారు, ఇంకా తక్కువ వయసు వారే ఉండేలా చూసుకున్నారు. చంద్రబాబు మంత్రివర్గంతో పోలిస్తే జగన్ మంత్రివర్గంలో యంగ్ స్టర్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఇదీ తన విధానం అని జగన్ చెప్పేశాక కూడా అసమ్మతి పేరిట మూలుగుతూ, రాగాలు పెడుతున్న సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ భవిష్యత్తుకు తామే చేటు తెచ్చుకుంటున్నారని అంటున్నారు.

ఇదే చివరి చాన్స్ ….

జగన్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కొన్ని నిబంధనలు సడలించుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రతీ ఒక్క సీటు తనకు ముఖ్యం కాబట్టి యువతరంతో పాటు సీనియర్లకు కూడా కొంత పెద్ద పీట వేశారు. అయితే ప్రజలు దయతలచి బంపర్ మెజారిటీ ఇవ్వడంతో మంత్రివర్గాన్ని మాత్రం జగన్ తాను అనుకున్న మేరకు యువ కూర్పుతోనే జాగ్రత్తగా చేసిపెట్టుకున్నారు. తన తండ్రి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి మాత్రమే జగన్ చోటిచ్చారు. ఇక ఇందులో పిల్లి, మోపిదేవి రాజ్యసభకు వెళ్తున్నారు కాబట్టి ఆ సంఖ్య మరింత తగ్గుతుంది.

కష్టమేనా…?

ఇక మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి లాంటి వారు టీడీపీలో ఉంటే ఈపాటికి ఓడిపోయి మాజీగా మిగిలేవారని అంటున్నారు. ఆయన్ని జగన్ వెంకటగిరికి సీటు మార్పించి మరీ గెలిపించారంటే అది ఆనం గొప్పదనం కాదని గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ వంటి వారు కూడా జగన్ వేవ్ వల్లనే కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఈసారికి గెలిచారని గుర్తు చేస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది సీనియర్లు తలెగరవేస్తున్నారు. అయితే వీరంతా స్వీయ ప్రకాశం లేనివారేనని అంటున్నారు. జగన్ పుణ్యమాని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చిన వీరంతా ఇపుడు అసంతృప్తి పేరిట రచ్చ చేస్తే జగన్ మూడవ కన్నే తెరుస్తారని అంటున్నారు.

అది కూడా డౌటే…..

ఇక వచ్చే ఎన్నికల మీద చూపుతోనే జగన్ తనదైన రాజకీయాన్ని చేస్తున్నారు. ఆయన 2024 నాటికి సీనియర్లకు ఎవరికీ టికెట్ ఇవ్వబోరని కూడా అంటున్నారు. అదే విధంగా పార్టీకి కట్టుబడి ఉండకుండా కాంగ్రెస్ కల్చర్ తో హల్ చల్ చేద్దామనుకునేవారికి కూడా గట్టిగా చెక్ పెడతారు అంటున్నారు. జగన్ తన టీం ని సెట్ చేసుకున్నారని, అలాగే కొత్తవారు, తనకూ, పార్టీకి బద్ధులై పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందువల్ల అరచి గీ పెట్టినా అసంతృప్తి నేతల గోడు అరణ్య రోదనేనని అంటున్నారు. ఓ విధంగా వైసీపీలో వారి రాజకీయం దాదాపుగా ముగిసినట్లేనని కూడా అంటున్నారు.

Tags:    

Similar News