నిర్మలమ్మ చెప్పింది జగన్ ఫాలో అవుతారా ?

ఈ దేశంలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.అన్నింటికీ మించి కేంద్రం కూడా ఉంది. అయితే ఎక్కడా అమలు కాని పధకాలు అలవి కాని పధకాలు [more]

Update: 2020-06-08 14:30 GMT

ఈ దేశంలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.అన్నింటికీ మించి కేంద్రం కూడా ఉంది. అయితే ఎక్కడా అమలు కాని పధకాలు అలవి కాని పధకాలు ఒక్క ఏపీలోనే అమలవుతున్నాయి. దీని వల్ల ఎంత డబ్బు చేర్చినా ఖజనాకు చిల్లు పడిపోతోంది. దాన్ని పూడ్చడం నాడు చంద్రబాబు వల్లే కాదు, నేడు జగన్ వల్ల కావడంలేదు. సరే డబ్బులు లేవని ఏమైనా రాజీపడుతున్నారా అంటే లేదుగా. చంద్రబాబు ప్రయారిటీలు అమరావతి రాజధాని, విదేశీ విహారాలు అయితే జగన్ సంక్షేమ పధకాల జపం చేస్తూ ఎక్కడ ఉన్న డబ్బులన్నీ పంచి పందేరాలు చేస్తున్నారు.

కొత్త పధకాల్లేవు….

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో అనుభవం గడించింది. ఎక్కడ నుంచి డబ్బు వస్తోంది. ఏ వైపు నుంచి ఖర్చు అవుతోంది అన్నది చక్కగా బేరీజు వేసుకుంటోంది. ఇపుడు కరోనా మహమ్మరి వేళ లాక్ డౌన్ తో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై కొత్త పధకాలు కేంద్రం నుంచి ఉండవు. కనీసం ఒక ఏడాది పాటు ఇదే నిషేధం కొనసాగుతుందని కూడా చెప్పారు. కేంద్రంలోని అన్ని విభాగాలు దీన్ని అర్ధం చేసుకుని కొత్త ప్రతిపాదనలు పంపరాదని కూడా సూచించారు.

ఏపీ సంగతేంటి …?

కేంద్రమే ఇలా చేతులెత్తేసి కొత్త పధకాలు వద్దు అంటోంది. ఇక ఏపీకి కేంద్రం ఏం సాయం చేస్తుంది. మరో వైపు చూసుకుంటే లాక్ డౌన్ ఫలితాలు కనీసంగా ఏడాది నుంచి గరిష్టంగా రెండేళ్ల పాటు ఉంటాయని అంటున్నారు. అసలే ఆరేళ్ళుగా స్థిరమైన ఆదాయం లేని ఏపీకి ఇది మూలిగే నక్క మీద తాడిపండు లాంటిదే. తొలి ఏడాది మరి ఆర్భాటంగా బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్లు అంటూ ప్రకటించడమే కాదు, సంక్షేమానికి నూటికి ఎనభై రూపాయలు ఖర్చు చేస్తున్న ఏపీ సర్కార్ కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాల్సివుందని అంటున్నారు.

జగన్ మారతారా…?

ఏమో ఈ విషయంలో జగన్ మారుతారని చెప్పలేమని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. జగన్ దయార్ద్ర హృదయుడని, ఆయన చేతికి ఎముక అన్నదే లేదని పార్టీ నాయకులే అంటున్నారు. జగన్ చెప్పినవీ, చెప్పనివీ కలుపుకుని అనేక హామీలు తీర్చేసి తొలి ఏడాదిలోనే యాభై వేల కోట్ల రూపాయలు నేరుగా జనానికి నగదు పంచారని, ఇపుడు రెండవ ఏడాది అంత సులువుగా ఉండదని, కాబట్టి జగన్ కూడా ఖర్చులు బాగా తగ్గించుకోవాలని, కనీసం కొత్త పధకాలు ప్రకటించకుండా జాగ్రత్త పడితే పార్టీకి, ప్రభుత్వానికి కూడా మేలు అంటున్నారు. కానీ జగన్ ఊరుకుంటారా? లేదా? వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News