సారీ అన్నా…. ట్రబుల్ లో ఉన్నా…!!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఆశలు పెట్టుకున్న వారందరీకీ షాకిచ్చినట్లుగానే కనపడుతుంది. వైసీపీ నేతలు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పట్లో అయ్యే [more]

Update: 2019-11-27 06:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఆశలు పెట్టుకున్న వారందరీకీ షాకిచ్చినట్లుగానే కనపడుతుంది. వైసీపీ నేతలు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పట్లో అయ్యే అవకాశాలు కన్పించడం లేదు. మరోవైపు గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారు, ఓటమి పాలయిన వారు సయితం జగన్ తమకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. జగన్ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలను తెప్పించుకుని జాబితాను రూపొందించారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీపై….

రేపో మాపో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనుకున్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను గ్రౌండ్ చేయడంతో పాటు పార్టీలో కష్టపడన నేతలకు కూడా లిఫ్ట్ ఇద్దామని జగన్ తొలుత భావించారు. ఈ మేరకు జగన్ స్వయంగా రిపోర్ట్ లు తెప్పించుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీకి రెడీ అయిపోయారు. కొందరు సీనియర్ నేతలకు కూడా తన మనసులో మాట చెప్పేశారు. ఇక ఏముంది తమకు పదవులు వచ్చేసినట్లేనని కొందరు నేతలు సంబరపడి పోయారు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఆర్థిక పరిస్థితిపై…..

అయితే తాజాగా జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నామని, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఖజానాపై అదనపు భారం పడుతుందని జగన్ అన్నట్లు సమాచారం. మరో ఏడాది పాటు నామినేషన్ పోస్టుల భర్తీని వాయిదా వేయాలనుకుంటున్నానని జగన్ ఎంపీల వద్ద తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నట్లు సమాచారం.

ఏడాది తర్వాతేనా?

దీంతో పాటుగా ఎంపీల సిఫార్సులకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. డిసెంబరు 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద జగన్ ఐదు నెలలుగా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారనే చెప్పాలి.

Tags:    

Similar News