జగన్ కి వాళ్ళిద్దరూ కావాలా?

జగన్ కి ఇపుడు అన్నీ ఉన్నాయి. కానీ ఆ లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ. కనీసం మూడు టెర్ములు అయినా [more]

Update: 2020-06-06 02:00 GMT

జగన్ కి ఇపుడు అన్నీ ఉన్నాయి. కానీ ఆ లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ. కనీసం మూడు టెర్ములు అయినా అధికారం మళ్ళీ మళ్ళీ ఖాయమని ప్రత్యర్ధులే లెక్కలేశారు. అలాంటిది ఏడాది తిరక్కుండానే మొట్టికాయలు వరసగా పడుతున్నాయి. జగన్ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా కోర్టు నుంచి వరసగా వస్తున్న వ్యతిరేక తీర్పులు తలబొప్పి కట్టించి తలవంపులు తెస్తున్నాయి. జగన్ పాలన చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ కొన్ని విషయాలు కనీసంగా ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. లేకపోతే విశాఖలో ఒక మత్తు డాక్టర్ ప్రభుత్వాన్ని ఆటాడించడమేంటి అని కూడా సొంత పార్టీలోనే నోళ్ళు నొక్కుకుంటున్నారు. ఒక నియమితుడైన మాజీ ఐఏఎస్ కూడా గట్టి ప్రత్యర్ధి కావడమూ విడ్డూరమేనని అంటున్నారు.

ఉండవల్లి అయితేనా…?

ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్సార్ ఆయన అనువాద ప్రతిభను మెచ్చి ప్రోత్సహించిన మేధావి. ఉండవల్లికి రాజకీయంగా, సామాజికంగా బలం తక్కువ. కానీ ఆయన బుద్ధి బలం ఎక్కువ. అది చూసే వైఎస్ ఆయన్ని బాగా ఉపయోగించుకున్నారు. లేకపోతే ఉండవల్లి ఏంటి మీడియా టైకూన్ రామోజీరావుని ముప్పతిప్పలు పెట్టడమేంటి. నిజంగా ఒక్క చిన్న తప్పు పట్టుకుని రామోజీరావు వంటి పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టిన ఉండవల్లి తెలివికి జోహార్ అనాల్సిందే. అటువంటి ఉండవల్లి సాటి వారు జగన్ కోటరీలో ఒక్కరు కూడా లేరా అన్న ప్రశ్న ఇపుడు వస్తోంది. ఉండవల్లి కనుక ఉంటే జగన్ కి ఉన్న దూకుడుకు, భారీ మెజారిటీకి కధ వేరే విధంగా ఉండేదన్న భావన ఇపుడు వైసీపీ అభిమానుల్లో ఉందిట.

ఆయన చాణక్యం….

ఇక రాజకీయంగా జగన్ తడబడుతూ ఇబ్బందుల పాలు అవుతున్నారు. కీలెరిగి వాత పెట్టడం ఎలాగో నాడు వైఎస్సార్ నీడగా తోడుగా ఉన కేవీపీ రామచంద్రరావు చేసి చూపించేవారు చేతికి మట్టి అంటకుండా మొత్తం సీన్ అటూ ఇటూ మార్చేసేవారు. ఇపుడు జగన్ కి ఉన్న బలానికి, అమితమైన జనాదరణకు కేవీపీ లాంటి వారి రాజకీయ చాణక్యం తోడు అయితే చంద్రబాబు లాంటి వారికి మరో నాలుగు సార్లు అయినా అధికారం దక్కుతుందా అన్న బెదురూ బెంగా కనిపించేవని అంటున్నారు.

కోరుతున్నారా…?

జగన్ అంటే వారికి పిచ్చి ప్రేమ. ఎంత అంటే కోర్టులను సైతం లెక్కలేకుండా సోషల్ మీడియాలో విమర్శలు చేసేటంత. తన అభిమాన నేతకు ఎందుకు ఇన్ని చిక్కులూ చికాకులు వస్తున్నాయని వైసీపీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వారు వైఎస్సార్ హయాంలో జరిగిన దాన్ని, ఇప్పటి జగన్ పాలన‌ను బేరీజు వేసుకుంటున్నారు. జగన్ కి ఉండవల్లి, కేవీపీ లాంటి వారి సాయం ఉంటేనే ఏపీని దున్నేసేవారని అంటున్నారు. వైసీపీలో ఇపుడు అలాంటి వారు లేకపోవడం మైనస్ ని కూడా అంటున్నారుట. ఈ మేరకు వారు నేరుగా వైసీపీ హై కమాండ్ కి విన్నపాలు పంపుతున్నారుట. ఆ ఇద్దరినీ వైసీపీలోకి తీసుకురావాలని, అపుడు పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని, ప్రతీ సమస్యకూ పరిష్కారం కూడా లభిస్తుందని అంటున్నారు. అయిత జగన్ తన తండ్రితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న ఆ ఇద్దరినీ పార్టీలోకి పిలవకుండా ఉంటారా. మరి వారు ఏమన్నారో, ఎందుకు దూరంగా ఉన్నారో. ఏది ఏమైనా ప్రజా క్షేత్రంలో బలం లేకపోయినా బుద్ధిబలం ఉన్న ఈ ఇద్దరినీ రాజకీయంగా అమితబలంతో ఉన్న వైసీపీ కలవరించడం అంటే వారి విలువ మాములుగా లేదుగా.

Tags:    

Similar News