జగన్ తో ఫెవికోల్ బంధమట

జగన్ కాంగ్రెస్ నుంచి ఒంటరిగానే బయటకు వచ్చారు. ఆయన వెంట రాజకీయ పార్టీలకు చెందిన ఉద్ధండులు ఎవరూ లేరు. కానీ ఆయన కుటుంబానికి సన్నిహితుడైన ఒక ఆడిటర్ [more]

Update: 2020-06-05 08:00 GMT

జగన్ కాంగ్రెస్ నుంచి ఒంటరిగానే బయటకు వచ్చారు. ఆయన వెంట రాజకీయ పార్టీలకు చెందిన ఉద్ధండులు ఎవరూ లేరు. కానీ ఆయన కుటుంబానికి సన్నిహితుడైన ఒక ఆడిటర్ జగన్ తో ఉండేవారని నాటి మీడియా రాసుకొచ్చింది. ఆ తరువాత ఆయన పేరు విజయసాయిరెడ్డి అని, ఆయన కూడా జగన్ సీబీఐ కేసుల్లో ఏ టూ గా ఉన్నారని రావడంతో అది పెద్ద ఎత్తున మీడియాలో హైప్ అయింది. ఆ మీదట జగన్ పక్కన పేరు విజయసాయిరెడ్డిదే అయింది. పదహారు నెలల పాటు ఇద్దరు జైలు జీవితం అనుభవించారు. ఇలా జగన్ పక్కన కఠిన కష్టాల్లో ఉన్న విజయసాయిరెడ్డి విలువ ఏంటో జగన్ కే ఎక్కువ తెలుసు అంటారు.

వదగలరా….?

తన వల్ల కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారని పలుమార్లు ఓడినా కూడా మోపిదేవి వెంకటరమణను జగన్ ఏరి కోరి అవకాశాలు ఇవ్వడమే కాకుండా మంత్రిని చేశారు. ఇక ఇపుడు శాసనమండలి రద్దు అవుతుందంటే ఏకంగా రాజ్యసభకు పంపించి తన అండ ఎపుడూ ఉంటుందని గట్టిగా చెప్పుకున్నారు. అలాగే తన వల్ల మంత్రి పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసి బయటకు వచ్చారని ఆయన్ని ఏకంగా డిప్యూటీ సీఎం చేసి కీలకమైన రెవిన్యూ శాఖ అప్పగించారు. అలాగే ఎంతో మంది నాడు తనతో అడుగులు వేసిన వారిని గుర్తుంచుకుని మరీ జగన్ పెద్ద పీట వేస్తూ వచ్చారు. అలాంటిది తన నీడగా తోడుగా ఉన్న విజయసాయిరెడ్డిని జగన్ ఎందుకు వదులుకుంటారు, ఇంత చిన్న లాజిక్ ని రాజకీయ ప్రత్యర్ధులు ఎలా మరచిపోతున్నారో తెలియదనే చెప్పాలి.

జన్మంతా కలిసే….?

తనకు జగన్ కి మధ్యన విభేధాలు పెట్టేవారికి విజయసాయిరెడ్డి ఒక్కటే మాట చెప్పారు. తమ ఇద్దరికీ గట్టి బంధమని, తాను జన్మంతా జగన్ తోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇందులో రెండో మాట లేదు. జగన్ కి తనకు చిచ్చు పెడుతూ మీడియాలో వార్తలు రాయించుకుని తృప్తి పడాల్సిందేనని ఆయన అంటున్నారు. తనకు వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం ఈనాటికి కాదని, అది ఎప్పటికీ కొనసాగుతుందని కూడా విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా క్యాడర్ నమ్మవద్దని కూడా ఆయన కోరారు.

ఇది చాలదా….?

అపుడెపుడో రామాయణం, భారతల్లో ఇలాంటి చెలిమిని చూశాం, ఇలాంటి బంధాలను ఈరోజుల్లోనూ చూస్తున్నామంటే అది జగన్ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందనే చెప్పాలి. జగన్ నుంచి వేరు పడిన వారి కారణాలు ఏవై ఉన్నా కూడా ఉన్న వారు మాత్రం ఫెవికాల్ లా అతుక్కుపోతారంతే. అలాంటిది విజయసాయిరెడ్డి జగన్ తాత రాజారెడ్డి నుంచి, వైఎస్సార్ నుంచి ఆ కుటుంబంతో కలసి ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజు జగన్ విషయంలో ఆయన వేరుగా ఎలా ఆలోచిస్తారు. అసలు అది జరుగుతుందా. జగన్ ముఖ్యమంత్రి అయ్యారంటే ఇంతటి అభిమానం, అనుబంధం ఆయనతో పెనవేసుకున్న వారు ఎందరో ఉన్నారు, వారు ఎప్పటికీ జగన్ తోనే తమ బాట అంటారు. ఇది చాలు కదా ఒక నాయకుడి జీవితానికి కావాల్సింది. రాజకీయ ప్రత్యర్దులకు లేనిదీ, జగన్ కి మాత్రమే ఉన్న బలమే అదని చెప్పుకోవాలి.

Tags:    

Similar News