జగన్ ను అర్జంట్ గా ఏదో ఒకటి చేయాల్సిందేనా?

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి నిండా ఏడాది అయింది నిన్ననే. ఇంకా నాలుగేళ్ళ పదవీకాలం ఉంది. ఇంతలోనే బాబు గారి బావమరిది బాలయ్యబాబు చిలక జోస్యం చెప్పారు. [more]

Update: 2020-06-04 14:30 GMT

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి నిండా ఏడాది అయింది నిన్ననే. ఇంకా నాలుగేళ్ళ పదవీకాలం ఉంది. ఇంతలోనే బాబు గారి బావమరిది బాలయ్యబాబు చిలక జోస్యం చెప్పారు. ఈ సర్కార్ ఎక్కువ కాలం ఉండదని, వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని. నిజానికి ఈ మాట చాలా కాలంగా తమ్ముళ్ళు అంటూనే ఉన్నారు. చూస్తూండంగా ఏడాది అయింది. ఇలాగే మిగిలిన కాలం నడుస్తుందేమోనని పసుపు పార్టీలో భయం ఉన్నట్లుంది. అందుకే ఇపుడు కొత్త పల్లవి అందుకుంటున్నారు జగన్ సర్కార్ ని బర్తరఫ్ చేయాలంట. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారుట.

నిజమేనా?

ఏపీలో చాలా కాలంగా టీడీపీ తమ్ముళ్ళు ఒక మాట పదే పదే అంటున్నారు. దాని అర్ధాలు పరమార్ధాలు ఇదేనేమోనని ఇపుడు అనిపిస్తోంది. జగన్ సర్కార్ కోర్టులను అసలు ఖాతరు చేయడం లేదని, న్యాయ స్థానాల విలువను తగ్గిస్తున్నారని టీడీపీ నేతలు అంటూ వచ్చారు. ఇక మరో నేత వర్ల రామయ్య లాంటి వారు అయితే కోర్టులు తలచుకుంటే ఈ పదవులు పోవడానికి ఎంత పని అంటూ అసలు గుట్టు చెప్పేశారు. అంటే ఏదో విధంగా జగన్ సర్కార్ ని రాజ్యాంగ వ్యతిరేకశక్తింగా చూపించే ప్రయత్నం జరుగుతోందన్నమాట. ఇపుడు అది కాస్తా మరికాస్తా ముందుకెళ్ళి ఇపుడు జగన్ సర్కార్ కోర్టుని ధిక్కరిస్తోందని అంటున్నారు.

సహజమేనా?

నిజానికి కోర్టు తీర్పులు వస్తూంటాయి. కొన్ని అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా వస్తూంటాయి. అయితే వాటి మీద తమకు ఇబ్బందులు ఉంటే పై కోర్టులలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు అదే రాజ్యాంగం ఇచ్చింది. ఇక కోర్టు తీర్పుల మీద స్టేలు తీసుకోవడం, అదేశాల అమలుకు ఇదమిద్దంగా సమయం చెప్పకపోతే కనీసంగా రెండు నెలల పాటు ఆపి అ తరువాత ఆ నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటుగా ఉపయోగించడం అన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నవే. అందరూ ఆచరించినవే. ఇపుడు కొత్తగా జగన్ ఏదో చేస్తున్నారని అనుకోవడం,ఆయన రాజ్యాంగాన్ని పట్టించుకోవడంలేదని యాగీ చేయడం పూర్తి రాజకీయమేనని అంటున్నారు.]

అది సాధ్యమేనా..?

కోర్టులు తీర్పులు చెబుతూంటాయి. వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వాలు. అయితే ఆ విషయంలో సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయం కోసం ప్రయతించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అక్కడ కూడా సరైన తీర్పు రాకపోతే అపుడు పాత ఆదేశాలనే అమలు చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే అపుడు రాజ్యాంగ ధిక్కారం అవుతుంది. ఈలోగా కొంపమునిగినట్లుగా జగన్ సర్కార్ ని బర్తరఫ్ చేయమని అడిగడం అంటే రాజకీయ దిగజారుడు తనమే. పూర్తి మెజారిటీ ఉన్న సర్కార్ని అసలు బర్తరఫ్ ఎందుకు చేస్తారు, బొమ్మై కేసులో సుప్రీం కోర్టు చెప్పిందేంటి అన్నది కూడా ఆలోచించకుండా జగన్ ని వెంటనే ఇంటికి పంపేయాలనుకోవడం తమ్ముళ్ళ దురాశే అనిపిస్తుంది. అయినా కేంద్రంలో మోడీ సర్కార్ జగన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని బీజేపీ బడా నేత రాం మాధవ్ లాంటి చెబుతున్నా జగన్ ఏదో చేసైనా కుర్చీ దించాలనుకోవడం తమ్ముళ్ళ పగటి కల తప్ప మేరేమీ కాదు.

Tags:    

Similar News