తప్పులు దిద్దుకోకపోతే … కష్టమే కదా … ?

వైఎస్ జగన్ పాలన మొదలు పెట్టి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది గా ఆయన అడుగడుగునా కష్టాలే ఎదుర్కొన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని [more]

Update: 2020-05-30 06:30 GMT

వైఎస్ జగన్ పాలన మొదలు పెట్టి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది గా ఆయన అడుగడుగునా కష్టాలే ఎదుర్కొన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని స్వయం కృతాపరాధాలు ఉన్నాయి. ఇక ఖాళీ ఖజానాతో పాటు విపక్షానికి అతి పెద్ద బలమైన మీడియా తోపాటు గేమ్ చేంజర్ గా ముద్రపడ్డ రాజకీయ దిగ్గజం చంద్రబాబు సారధ్యంలో టిడిపి అడుగడుగునా అధికారపక్షానికి ఉన్న కొద్దిమంది ఎమ్యెల్యేలతో గట్టిగానే ప్రతిఘటిస్తుంది. మీడియా టైగర్ గా ముద్రపడ్డ చంద్రబాబు అండ్ టీం ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు.

ఖాళీ ఖజానాతో …

దీనికి తోడు వైసిపి అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఖాళీ ఖజానాతో నెరవేర్చడం సులభమైంది కాకపోయినా జగన్ సర్కార్ కిందా మీదా పడుతూ లేస్తూనే హామీల అమల్లో మాత్రం దూసుకుపోతుంది. అయితే ప్రధానంగా జగన్ సర్కార్ చెప్పినదానికి చేస్తున్న పనికి మాత్రం కొన్ని అంశాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రోది అయ్యింది. అందులో ప్రధానమైంది ఇసుక విధానం. జగన్ తొందరపాటు నిర్ణయాలతో అధికారంలోకి వచ్చి రాగానే పాత విధానం రద్దు చేసి కొత్త విధానం రూపొందించడానికి చాలా నెలల సమయమే తీసుకున్నారు. కానీ కొత్త విధానం అమలు అయ్యేలోగా ఇసుక మాఫియా ఏపీ లో రాజ్యమేలింది. తీరా కొత్త విధానం తీసుకు రాగానే వరదలు వచ్చి ఇసుక లభ్యతే లేకుండా పోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న విపక్షం ముప్పేట దాడి చేసింది.

నేటికీ సక్రమంగా లభించని ఇసుక …

ఆ తరువాత ఇసుక లభిస్తున్నా ఆన్ లైన్ లో అమ్మకాల ద్వారా సర్కార్ కి ఆదాయం లభిస్తున్నా నేటికి ఇసుక విక్రయాలు మాఫియా చేతుల్లోనే కొనసాగడం సర్కార్ కి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. ఇది ఇలా సాగుతుండగానే కరోనా తో లాక్ డౌన్ విధింపు మరో రెండు నెలలు భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోవడం ఆ తరువాత జగన్ ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా పనులు మొదలు అయినా ఆన్ లైన్ లో ఇసుక మాయాజాలం తో లభ్యత లేకపోవడం మరోసారి ఎపి లో ఈ వ్యవహారంలో సర్కార్ నవ్వుల పాలు అవ్వక తప్పడం లేదు.

విద్యుత్ బిల్లుల్లో ఫుల్ బ్యాడ్ …

ఇది కాక లాక్ డౌన్ సమయంలో రెండు నెలల బిల్లులను ఒకే బిల్లుగా ఇవ్వడం విద్యుత్ స్లాబ్ ల్లో ఉండే వ్యత్యాసంతో వినియోగదారులు ఘొల్లుమన్నారు. జరిగిన తప్పులను పెద్ద ఎత్తున విపక్షం ఎత్తిచూపినా సరిదిద్దుకోవాలిసిన సర్కార్ ఎదురుదాడికి దిగడం మరో మైనస్ అయ్యిందనే చెప్పాలి. ఇదే సమస్య తెలంగాణ లో ఎదురుకాకుండా కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ లో చెల్లించిన మొత్తమే కట్టాలనడంతో అక్కడ ఈ గోల లేదు. ఎపి లో మాత్రం విద్యుత్ బిల్లుల వివాదం విపక్షాలకు పెద్ద అస్త్రాన్నే ఉచితంగా అందించింది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆర్ధిక ఇబ్బందులున్నా కొనసాగిస్తూ ధైర్యంగా ముందుకు వెళుతుంది. అయినా మధ్యతరగతి ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు వారి నుంచి వినవస్తున్నాయి.

సంక్షేమం భేష్ … కానీ …

విద్యా, వైద్యం, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వంటి నిర్ణయాలతో జగన్ సర్కార్ దూసుకుపోతున్నా కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం అడుసు తొక్కి కాలుకడుక్కునే ప్రయత్నాలు అనుభవాలేమితో చేస్తుంది. దీనికి ఉదాహరణలుగా ఎన్నికల కమిషనర్ ను తొలగించడం, టిటిడి భూములు అమ్మాలని ప్రయత్నం చేసి వెనక్కి తగ్గాలిసి రావడం, రాజధాని వికేంద్రీకరణ కు, శాసనమండలి రద్దు వంటి నిర్ణయాల్లో దూకుడుగా వ్యూహం లేకుండా వెళ్ళి దెబ్బ తింటుందన్న చర్చ నిత్యం సాగుతూనే ఉంది. అవినీతి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలకు ఇప్పుడిప్పుడే అడుగులు పడుతూ ఉండటంతో మరికొంత కాలానికి కానీ వీటి రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. అలాగే మద్యపాన నిషేధం అంశంలో జగన్ సర్కార్ చర్యలు నాటుసారా ఉత్పత్తికి తెరతీసేలా మారాయి. దీన్ని అరికడుతూ అడుగులు వేయకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బడుగు బలహీన వర్గాలకు, ఆటోవాలాలు నుంచి అమ్మఒడి వరకు మంచి మార్కులే జగన్ సర్కార్ కి పడుతున్నా నవయువ ముఖ్యమంత్రి జగన్ మరింత గా రాటుదేలి ఆటుపోట్లు అధిగమించి నవ్యంధ్ర పునాదులు పటిష్టం చేయాలిసిన గురుతర బాధ్యత గుర్తెరిగి నడుచుకోవాలిసి ఉంది.

సంపద పంచడం కాదు సృష్ట్టించాలి …

ఓట్ల కోసం ప్రజలను సోమరులుగా మార్చే కార్యక్రమం కాకుండా వారికి పని కల్పించే కార్యక్రమానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టాలి. పోలవరం వంటి మెగా ప్రాజెక్ట్ లను శరవేగంగా పూర్తి చేస్తే సంపద సృష్ట్టించబడుతుంది. ఏపీకి జీవం జలమే . అది గోదావరిలోనే లభిస్తుంది. గోదావరిపై పోలవరం పూర్తి అయితే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా లతో బాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర సైతం నీటి కష్టాలనుంచి గట్టెక్కుతాయి. ఆదిశగా జగన్ సర్కార్ వేగవంత చర్యలు చేపట్టాలి. విమర్శలు, ఆరోపణలకు కొంతకాలం పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటే పదికాలాలు ప్రజా మన్ననలు జగన్ ప్రభుత్వం అందుకుంటుంది. లేనిపక్షంలో భవిష్యత్తులో జనం మార్పు కోరే అవకాశాలు మెండుగా ఉంటాయి అనడానికి టిడిపి సర్కార్ నే నిదర్శనం.

Tags:    

Similar News