జగన్ గురి వారిపైనే

ఏపీలో ప్రజలు కడుతున్నపన్నుల సొమ్ముతో జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెగ బాధపడిపోతున్నారు. ఏపీలో పాలన సాగడంలేదని, కేవలం జగన్ రాజకీయాలే [more]

Update: 2019-11-26 02:00 GMT

ఏపీలో ప్రజలు కడుతున్నపన్నుల సొమ్ముతో జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెగ బాధపడిపోతున్నారు. ఏపీలో పాలన సాగడంలేదని, కేవలం జగన్ రాజకీయాలే సాగుతున్నాయని కూడా ఆయన అంటున్నారు. ఇక్కడే సుజనా అక్కసు కూడా బయట పెట్టుకుంటున్నారు. ఓట్ల కోసం జగన్ జనం సొమ్ముని పంచుతున్నారని, అవి ఓట్ల పంట పండితే ఇతర పార్టీలకు ఇబ్బంది అన్న మాట చౌదరి కామెంట్స్ లో వినిపిస్తోంది. నిజమే జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఆయన అభివృధ్ధిని పక్కన పెట్టి సంక్షేమ పధకాల మీదనే పూర్తిగా దృష్టి పెడుతున్నారు. తెల్లారిలేస్తే చాలు అధికారులకు ఆయన చెబుతున్నదీ ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పకూడదు, ప్రతీ హామీ ప్రజలకు నెరవేర్చాలని కూడా ఆయన ఒకటికి పదిమార్లు అంటున్నారు. నిజానికి జగన్ చూపు అంతా వచ్చే ఎన్నికల మీద ఉంది. ఆయన గెలిచిన రోజు నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో దాచుకోవాల్సింది కూడా ఏమీ లేదు.

అభివృధ్ధి అంటే…?

రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజలనే జగన్ గురిపెట్టి తనదైన పాలన చేస్తున్నారు. వారికి పక్కా ఇల్లు కట్టిస్తే చాలు, రేషన్ బియ్యం ఇవ్వాలి, పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పాలి. ప్రైవేట్ స్కూళ్ళు అయితే ఆర్ధిక భారం ప్రభుత్వం కొంత మోయాలి. ఆరోగ్యశ్రీ వంటి వాటి ద్వారా ఉచిత వైద్యం అందాలి. ఇలా జగన్ తన పార్టీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాలను పేదలను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి గురించే ఆయన ఆలోచిస్తున్నారు. అటు అభివృధ్ధి ఇటు సంక్షేమం అంటే డబ్బు సరిపోదు, కొత్త రాష్ట్రానికి ఉన్న వనరులు తక్కువ. అందువల్ల జగన్ సంక్షేమమే క్షేమం అనుకుంటున్నారు. దీని వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న పేరు ఉంటుంది. జనాలకు మేలు కనబడుతుంది. అదే పెద్ద ఓటు బ్యాంకు గా మారి రాజాకీయంగా కూడా ఉపకరిస్తుందని జగన్ అంచనా వేసుకుంటున్నారు.

అవే శ్రీరామ‌రక్ష ….

జగన్ కేంద్రంలోని బీజేపీని నమ్మినట్లుగా ఉంటూనే తన దారిలో తాను వెళ్తున్నారు. రాజకీయ క్రీడలో అనేకసార్లు మోసపోయి దెబ్బలు తిన్న జగన్ కి ఎపుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు అనుకోరు ఎవరు. అందువల్ల ఎవరైన కుట్ర చేసినా, తన ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టినా, తనకు వ్యక్తిగతంగా వేధించినా కూడా తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామ‌రక్షగా ఉంటాయని జగన్ భావిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఆయన సంక్షేమాన్ని భుజాన వేసుకున్నారు. అభివృధ్ధి అంటూ ఎక్కడో రోడ్లు వేసో మరేదో కట్టో ఓట్లు అడిగితే బీదా బిక్కిగా ఉన్న ఎనభై శాతం జనం ఓట్లెందుకు వేస్తారు. అమరావతి, పొలవరం వంటివి కట్టాల్సిందే. కానీ అవి డబ్బులు బాగా ఉన్నపుడు నెమ్మదిగా చేసుకోవచ్చు. అంతవరకూ పధకాలు అమలు చేయకపోతే జనం ఊరుకోరుగా.

మద్దతు ఇచ్చేది వాళ్ళే……

ఇక జగన్ ఇపుడు అన్ని పధకాలు ఒక క్యాలండర్ ప్రకారం ప్రకటించేశారు. వాటిని ఒక్కొక్కటిగా అమలులోకి తెస్తున్నారు. ఈ మధ్యలో ప్రతిపక్షాలు తమ రాజకీయం చూపించాలనుకున్నా పధకాల ఫలితాలు రాకపోతే జనం జగన్ ని తప్పు పట్టరు, విపక్షాల మీదకే దండెత్తుతారు. జగన్ జైలుకే, ఆయన బెయిల్ రద్దు అవుతుంది అని పదే పదే ఏపీలోని విపక్షాలు చెబుతున్న మాటలే నిజమనుకున్నా కూడా కావాలి జగన్ రావాలి జగన్ అనిపించేలా జగన్ తన పధకాలను విస్తరించుకుంటూ పోతున్నారు. అన్న ఎన్టీయార్ కు జరిగిన మాదిరిగా కుట్ర రాజకీయం చేయాలనుకున్నా అది బూమరాంగ్ అయి చివరకి జగన్ కే జనం మద్దతు ఉంటుంది. మొత్తానికి జగన్ సంక్షేమ మంత్రం పఠించడం వెనక బీజేపీ రామబాణాన్ని సైతం అడ్డుకునే శక్తి దానికే ఉందని గట్టిగా నమ్మడమే కారణంగా చెప్పుకోవాలి.

Tags:    

Similar News