ఆరోజునే విశాఖకు రాజధాని… ముహూర్తం ఫిక్స్

విశాఖకు రాజధాని రావడం ఖాయమని వైసీపీ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. అయితే అదంత సులువు కాదని తాము అడ్డుకున్నామని మరో వైపు టీడీపీ నేతలు అంటున్నారు. [more]

Update: 2020-06-02 02:00 GMT

విశాఖకు రాజధాని రావడం ఖాయమని వైసీపీ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. అయితే అదంత సులువు కాదని తాము అడ్డుకున్నామని మరో వైపు టీడీపీ నేతలు అంటున్నారు. ఇక బీజేపీలో కొత్త పూజారి సుజనా చౌదరి అయితే అమరావతి నుంచి తరలిపోకుండా రాజధానికి పూర్తిగా బ్రేకులు వేశామని ఇప్పటికే ప్రకటించేసుకుంటున్నారు. ఎవరు ఏమనుకుంటున్నా అంతా మరచిపోతునన్ సంగతి ఒకటి ఉంది. అక్కడ ఉన్నది జగన్. ఆయన అనుకుంటే కాదని వెనక్కి వెళ్ళడం అసలు జరిగే పని కాదు. జగన్ కి విశాఖ మోజు అలాగే ఉంది. ఆయన రాజధానిగా ఈ మెగాసిటీని చేస్తానని చెప్పారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి కూడా.

ముహూర్తం రెడీ….

విశాఖకు రాజధాని తరలింపునకు సంబంధించి బ్రహ్మాండమైన ముహూర్తాన్ని పెట్టామని విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానందేంద్ర స్వామి అంటున్నారు. విజయదశమి వేళ విశాఖకు పాలనారాజధానికి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు సూచించినట్లుగా చెప్పారు. ఇది మంచి ముహూర్తమని, గట్టి ముహూర్తమని కూడా స్వామి అంటున్నారు. ఇప్పటికి రెండు ముహూర్తాలు రాజధాని తరలింపు కోసం స్వామి పెట్టారు. మొదటిగా మార్చి 25న ఉగాది వేళ తరలించాలన్నది ఒకటైతే. రెండవది మే 28న రాజధాని తరలింపునకు ముహూర్తం. ఈ రెండు ముహూర్తాలు కరోనా కారణంగా కొట్టుకుపోయాయి. ఆ తరువాత మంచి రోజులు లేకపోవడంతో ఆశ్వియజమాసం విజయదశమి వరకూ ఆగాల్సిందేనని స్వామి అంటున్నారు.

అన్నీ రెడీ…….

ఇక గత ఆరు నెలలు కాలంగా రాజధాని తరలింపు విషయంలో జగన్ సర్కార్ తెర వెనక భారీ కసరత్తు చేస్తూనే ఉంది. దానికి సంబంధించిన పనులను దగ్గరుండి మరీ ఎంపీ విజయసాయిరెడ్డి చూసుకుంటున్నారు. తొలుత మిలీనియం టవర్స్ లో ముఖ్యమంత్రి నివాసం అనుకున్నారు కానీ అది తరువాత విరమించుకున్నారు. ఇపుడు బీచ్ రోడ్డులోని గ్రేహౌండ్స్ లో సీఎం జగన్ నివాసం, క్యాంప్ ఆఫీస్ గా నిర్ణయించారు. ఇక మధురవాడ సమీప ప్రాంతాలలో ఉద్యోగుల నివాసాలకు కూడా ఎంపిక చేసిన భవనాలను గుర్తించారని భోగట్టా. మొత్తానికి రాజధాని ఎపుడు తరలివచ్చినా కూడా ఇక్కడ సర్వం సిధ్ధంగానే ఉంచారు.

చిక్కులు తొల‌గేనా …?

మూడు రాజధానుల విషయం ఇపుడు చిక్కుల్లో పడింది. ఓ వైపు న్యాయస్థానంలో వాజ్యం నడుస్తోంది. మరో వైపు శాసనమండలి అధికార వికేంద్రీకరణ బిల్లుని స్టాండింగ్ కమిటీకి పంపించింది. అయితే కమిటీయే ఏర్పాటు కాకుండా రాజకీయం నడుస్తోంది. ఇంకో వైపు శాసనమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రం పరిశీలనలో ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా కొత్త విద్యా సంవత్సరం ఆగస్ట్ నుంచి మొదలు కాబోతోంది. అక్టోబర్లో సచివాలయం తరలిస్తే పిల్లలతో బదిలీలకుఉద్యోగులు సహకరిస్తారా అన్నది చూడాలి. ఇవన్నీ ఇలా ఉంటే విజయదశమి వేళ విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేస్తే అన్ని రకాల సమస్యలు కూడా సద్దుమణుగుతాయని, ప్రభుత్వానికి కూడా ఎంతో రిలీఫ్ గా ఉంటుందని పాలన సజావుగా సాగుతుందని స్వామీజీ అంటున్నారు. మంచి ముహూర్తం తో జగన్ సర్కార్ ఎదుర్కుంటున్న అన్ని సమస్యలు పటాపంచలు అవుతాయని కూడా జోస్యం చెబుతున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News