జగన్ స్టయిల్ అదే.. తీర్పు చెప్పాల్సింది న్యాయస్థానాలు కాదు?

ఈ జగన్ ఏంటి….ఇంత మొండిగా వ్యవహరిస్తాడు….. కోర్టులు కాదన్న మొండిగా వ్యవహరిస్తాడు…. మీడియాకు మూకు తాడు వేయాలనుకుంటాడు….. మధ్యలో సీఐడీ ఒకటి….. ఎందుకింత అసహనం….. చాలామందికి వచ్చే [more]

Update: 2020-05-27 08:00 GMT

ఈ జగన్ ఏంటి….ఇంత మొండిగా వ్యవహరిస్తాడు….. కోర్టులు కాదన్న మొండిగా వ్యవహరిస్తాడు…. మీడియాకు మూకు తాడు వేయాలనుకుంటాడు….. మధ్యలో సీఐడీ ఒకటి….. ఎందుకింత అసహనం….. చాలామందికి వచ్చే సందేహాలు ఇవే…..! ఒక్కసారి జగన్ వైపు నుంచి ఆలోచించి చూడండి….. అతనొక్కడు ఒకవైపు…., రాజకీయాల్లో కాకలు తీరిన వాళ్ళు మరో వైపు….. అణిచివేతలు., కుట్ర రాజకీయాలు, సీబీఐ కేసులు, 16నెలల జైలు జీవితం ఇవన్నీ తెలిసిన మనిషికి తాను వేసే అడుగుకు పర్యవసానం తెలియదా? చంద్రబాబు పాలన, చంద్రబాబు రాజకీయం, చంద్రబాబు ప్రచారం చూసిచూసి జగన్ కూడా అలాగే చేయాలి అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం…. ఇద్దరి దారులు వేరు అని గుర్తించలేక ఈ సమస్య.

చెప్పుడు మాటలు విని….

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడుకు. వైఎస్ మరణం తర్వాత మొదట ముఖ్యమంత్రి పదవి, ఆ తర్వాత కేంద్రమంత్రి పదవి అందినట్టే అంది చేజారి పోయాయి. కాంగ్రెస్ పార్టీని ఐదు రాష్ట్రాల్లో అధికారానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కొడుకుని ఆ పార్టీ చెప్పుడు మాటలు విని దూరం చేసుకుంది. ఇక ఎన్నడూ కోలుకొని విధంగా అణగదొక్కలని ప్రయత్నించింది. అవినీతి మకిలి అంటించి ప్రజలకు దూరం చేయాలని 2010-14 మధ్య ఆ పార్టీ చేయని ప్రయత్నం లేదు. వాటిని జనం నమ్మలేదు. 2014లో అధికారం దక్కకపోయినా ప్రజల మధ్యే పోరాటం కొనసాగించాడు. పార్టీ పెట్టిన 9 ఏళ్ళకి జగన్ ను ముఖ్యమంత్రి పదవి వరించింది.

వైఎస్ అండతో ఎదిగిన వాళ్లే….

ఏడాదిలో ఎన్నోసార్లు కోర్టులలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. ఇదేదో ఒకటో రెండో సార్లు కాదు, 60కి పైగా ప్రభుత్వ నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకున్నాయి. న్యాయస్థానాల పారదర్శకత, క్రియాశీలత మీద చర్చను పక్కన పెడితే ప్రభుత్వం నిజంగానే మొండిగా వ్యవహరిస్తోందా? ప్రభుత్వం నిజంగానే పాలనలో విఫలం అవుతోందా? జగన్మోహన్ రెడ్డికి నిజంగానే పాలించడం చేత కావడం లేదా? ఇవన్నీ చాలామందికి వచ్చే సందేహాలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చూసిన కళ్ళతో పదేపదే జగన్మోహన్ రెడ్డిని పోల్చి చూసుకోవడం మనకు అలవాటైంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రి పదవిని ఆఫర్ చేసిన తర్వాత గంటల వ్యవధిలో పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా మారడం గుర్తుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రులకు ఏర్పాటు చేసిన విందు చివరి నిమిషంలో రద్దయింది. హైదరాబాద్ లో బయలుదేరి ఢిల్లీ వచ్చే సరికి ఆయన సహాయకులు జనార్దన్ ద్వివేది నుంచి వచ్చిన సమాచారాన్ని అతికష్టం మీద జగన్ కి చెప్పగలిగారు. అప్పుడు కూడా ఆయన అంతే ప్రశాంతంగా దానిని స్వీకరించగలిగారు. వైఎస్ వ్యతిరేకులు మొత్తం జగన్మోహన్ రెడ్డి శత్రువులుగా మారిపోయి., రకరకాల ఎత్తులు, కుట్రలు, ఫిర్యాదులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి మనసును విషతుల్యం చేశారు. అదే సమయంలో కేవీపీతో సహా చాలామంది వైఎస్ అనుచరులు, ఆయన అండతో రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళు తమ రాజకీయ భవితవ్యానికి జగన్ అడ్డంకిగా మారతాడనే భయంతో ఆయనకు దూరం జరిగారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారు చేసిన లేఖలో ఏముందో కూడా తనకు తెలియదని.., కాంగ్రెస్ కోశాధికారి మోతిలాల్ ఓరా చెబితే తాను సంతకం పెట్టానని శంకర్ రావు ., జగన్ జైలుకు వెళ్లిన తర్వాత ఢిల్లీలో రహస్యం బయట పెట్టాడు. జగన్ కి వ్యతిరేకంగా జన్ పథ్ కి, అక్బర్ రోడ్డుకి వెళ్లిన ఈ మెయిల్, ఫ్యాక్స్ మెసేజీలలో వైఎస్ మీద ఉన్న ద్వేషమే అసలు కారణం.

రాజకీయాలు కాకుంటే…..

జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసే సమయానికి దేశంలో ముందస్తు పన్ను అత్యధికంగా చెల్లించే వారి జాబితాలో అగ్ర స్థానంలో ఆయన పేరుండేది. అప్పట్లో ఢిల్లీలో ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకునే వ్యక్తి మాటలు బాగా గుర్తున్నాయి. బాస్ ఈ రాజకీయాలు, ఇవన్నీ పట్టించుకోకుండా వ్యాపారాలు చేస్తే ఎక్కడో ఉంటారు. ఈ ఆరోపణలు, విమర్శలు వైఎస్ బతికుంటే వచ్చేవా? న్యాయస్థానాలు సాహసించేవా? ఇన్ని వేధింపులు, అవమానాలు ఉండేవా? అన్నారు. ఈ వాదనలో కూడా కొంత నిజం ఉంది. సరే రాజకీయ నేతలెవరు ఆగర్భ శ్రీమంతులు, పుట్టుకతో కోటీశ్వరులు కాదు కాబట్టి ఇందులో ఎవరికి మినహాయింపులు చూడలేము.

ఎవరి దారి వారిదే….

న్యాయ స్థానాల తీర్పులు, అడ్డంకుల విషయంలో చంద్రబాబున, జగన్మోహన్ రెడ్డిని వేర్వేరుగా చూడాల్సిందే. చంద్రబాబుకి తాను నడిచే దారిలో విత్తనాలు చల్లుకుంటూ పోవడం, వచ్చే దారిలో పళ్ళు కోసుకోవడం అలవాటు. అలా అన్ని చోట్ల ఆయనకు అనుంగు అనుచరులు, శిష్యులు ఉంటారు. తన వారి విషయంలో ఆయన ఉదారంగా వ్యవహరిస్తుంటారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఇలా ఎందులో అయినా ఆయన మనుషులు ఉంటారు. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ఆయన హవా అన్ని చోట్లా నడుస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డిది అందుకు భిన్నమైన శైలి. చంద్రబాబు మార్గంలో తాను ఎందుకు వెళ్ళాలి అన్నది ఆయన ఆలోచన కావొచ్చు. అందుకే కోర్టు అభ్యంతరాలు, కేసుల గురించి పెద్దగా లెక్క చేస్తున్నట్టు కనిపించరు. న్యాయస్థానాలు సైతం ఇదే తీరులో ఉంటే జగన్ అనుకూల వర్గం మరింత బలంగా ఆయనకు మద్దతివ్వడం ప్రారంభిస్తారు. ఫలితంగా న్యాయ స్థానాల మీద సామాన్యులకు అపనమ్మకం ఏర్పడుతుంది. నిజానికి కేసులు, అవినీతి అనే అంశాలను జనం నమ్మి ఉంటే ఆయన సీఎం పదవిలోకి వచ్చే వారే కాదు. అవి రాజకీయ ప్రేరేపితమని జనాలకు కూడా అర్థమైపోయింది.

మీడియా హ్రస్వ దృష్టి…

ఇక ఏపీలో మీడియా జగన్మోహన్ రెడ్డికి మరో బలమైన శత్రువు. నిత్యం జగన్ పై వ్యతిరేకత పెంచడం కోసమే పని చేస్తున్నట్టు వాటి వ్యవహార శైలి ఉంటుంది. ఇక కొన్ని ఛానల్స్ జగన్ అనుకూలంగా ఉన్నట్టు కనిపించినా వాటిలో అక్కసు మాత్రం భారీగా ఉంటుంది. 2019కి ముందు టీడీపీ అనుకూల ఛానల్స్ తమ వల్లే ప్రభుత్వం నడుస్తోంది అనే భావనలో ఉండేవి. చంద్రబాబు సైతం వాటిని అలాగే ట్రీట్ చేసే వారు. మీడియా అధిపతులకి ఎక్కడ లేని ప్రాధాన్యత దక్కేది. ఎన్నికల ఫలితాల తర్వాత గోడ దూకేసిన ఒకాయనకి గతంలో చంద్రబాబు మాదిరి, జగన్ కూడా తనను నెత్తిన పెట్టుకుంటాడు అనుకుని భంగ పడ్డాడు. చివరికి కరకట్ట మీద స్వామిజీ పట్టాభిషేకంలో జగన్ పక్కన కూర్చుని తృప్తి పడాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా నెలలకు జగన్ తో భోజనం చేసే అవకాశం దక్కింది. ఇదే అదనుగా జగన్ ముందు తన అభిజాత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో సదరు మీడియా యజమాని కాంగ్రెస్ కి అనుకూలంగా జగన్ మీద వీలైనంత విషం చిమ్మాడు. ఇవన్నీ జగన్ మర్చిపోయుంటాడు అనుకుని లంచ్ మీటింగ్ లో భంగపడ్డాడు. టీడీపీ అనుకూల బూరల్లో అది ఒకటని జగన్ కి ఒక స్పష్టత ఉండటంతో ఆయనకి అదే చివరి విందు అయ్యింది. సొంత మీడియా మీద మితిమీరిన ప్రేమ కూడా ఏమి ఉండదు. మీడియా జస్ట్ మీడియా అంతే…. ఆ క్లారిటీ జగన్ కి ఉంది. నేషనల్ మీడియా, లోకల్ మీడియా, పర్సనల్ మీడియా ఏవైనా…. ఒకటే… ఇదంతా ఎందుకు అంటే జగన్ వేరు చంద్రబాబు వేరు….. జగన్ స్టయిల్ వేరు…. చంద్రబాబు స్టయిల్ వేరు….. జగన్ రాజకీయం వేరు….. చంద్రబాబు రాజకీయం వేరు…. తీర్పులు చెప్పాల్సిన న్యాయమూర్తులతో లౌక్యంగా ఉండటం ఒకరి స్టయిల్ అయితే….. తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు అన్నది ఇంకొకరి స్టయిల్…… ఎవరిని జనం నమ్ముతారో, ఎవరిని మెచ్చుతారో తెలియాలంటే మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News