ఏడాది పండుగను ఆవిరి చేసేశారుగా ?

జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. అలా ఇలా కాదు, డెబ్బయ్యేళ్ల రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోనే అరుదైన విధంగా రికార్డులు బద్దలు కొట్టారు. అటువంటి అపూర్వ విజయాన్ని [more]

Update: 2020-05-31 14:30 GMT

జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. అలా ఇలా కాదు, డెబ్బయ్యేళ్ల రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోనే అరుదైన విధంగా రికార్డులు బద్దలు కొట్టారు. అటువంటి అపూర్వ విజయాన్ని పండుగ చేస్తుందామనుకుంటే కరోనా మహమ్మారి ఏపీ గుమ్మంలోనే పొంచి ఉంది. సరే ఉన్నదాంట్లోనే వీడియో సమావేశాల ద్వారా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం విజయాలని ప్రజలకు చేరవేద్దామనుకుంటే అనుకోని విధంగా టీటీడీ భూముల వేలం వివాదం వచ్చి విపక్షానికి ఆయుధాన్ని ఇచ్చింది. అంతే గత కొన్ని రోజులుగా ఏకమొత్తంగా విపక్షం రెచ్చిపోతోంది. దాంతో జగన్ ఏడాది పాలన విజయాల పండుగ ప్రచారం వెనక్కు పోయి మీడియా అంతా ఇదే ఫోకస్ చేస్తూ ముందుకు వచ్చేసింది. జనాలకు సైతం ఇపుడు ఇదే ఆలోచింపచేసేలా ఉండడం వైసీపీని కంగారు పెడుతోంది.

సర్దుకున్నా…..

నిజానికి జగన్ మనస్తత్వానికి ఒకసారి నిర్ణయం చేశాక వెనక్కు తగ్గడం అన్నది లేదు. కానీ టీటీడీ భూముల వేలం విషయంలో మాత్రం ఇప్పటికి ఏమీ చేయమంటూ కధను సశేషం చేశారు. అయినా సరే అప్పనంగా వచ్చిన పొలిటికల్ మైలేజిని విపక్షాలు ఎందుకు వదులుకుంటాయి.అందుకే అంతా కలసి దూకుడు మీద అదే ప్రచారం చేస్తూ వస్తున్నాయి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఒక రోజు ఉపవాస దీక్షలకు దిగింది. జనసేన కూడా దాంతో జత కలిసింది. ఇక తెలుగుదేశం కూడా ఇదే అంశంపై రాధ్ధాంతం చేస్తోంది. మొత్తానికి ఏపీలో దేవుడు భూముల వేలం కధలే ఇపుడు గట్టిగా వినిపిస్తున్నాయి.

పరువు తీశారా..?

జగన్ సర్కార్ లో ఉన్న పదుల సంఖ్యలో సలహాదారులు ఏమయ్యారో తెలియదు. ఇక రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ఏమయ్యారో అంతకంటే తెలియదు. భూముల అమ్మకాల విషయంలో వైసీపీ దూకుడుగా వెళ్తూంటే కరోనా వేళ ఇది సమయం కాదని వాదించే వారు లేకుండా పోయారు. ఎవరికైనా బంగారం, భూములు, దేవుడు సెంటిమెంట్లుగా ఉంటాయి. ఆ సెంటిమెంట్లతోనే వైసీపీ ఇపుడు జూదమాడుతోంది. అందుకే బెడిసికొడుతోంది. ఇది ఓ విధంగా విపక్షాల గొప్పతనం కానే కాదు, వైసీపీ నేతల తప్పుడుతనం. అందుకే జగన్ సర్కార్ ఏడాది సంబరాలు ఒక్కటే ఏపీలో మారుమోగాల్సిన వార్త అవుతుందనుకున్న వేళ ఇలా కధం అడ్డం తిరిగింది.

ఆచీ తూచీ…..

జగన్ సర్కార్ ఇకనైనా ప్రతీ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాలి. తిరుమల తిరుపతి దేవుడు అంటే ప్రపంచం మొత్తం ఆదరించే కలియుగ దైవం. ఆయన విషయంలో వైసీపీ నేతలకు భక్తి లేదనడానికి ఎవరికీ అర్హతలేనప్పటికీ వారు చేస్తున్న చర్యలు మాత్రం అనుమానాస్పదంగా ఉంటున్నాయి. అప్పట్లో ఏడు కొండలను రెండు కొండలు వైఎస్సార్ చేస్తార‌ని పెద్ద ఎత్తున సాగిన విపక్షాల విష‌ ప్రచారం ఒకసారి గుర్తుకు తెచ్చుకుని ఇకనైనా జాగ్రత్త పడాలి. లేకపోతే ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఒకే ఒక్క తిరుమల దేవుడి అంశం మొత్తం వ్యవహారాన్ని మార్చేస్తుంది. ఇది గుర్తిస్తే వైసీపీకి ప్రతీ రోజూ ఇకపైన పండుగే అవుతుంది.

Tags:    

Similar News