జగన్ కి మేలే చేస్తున్నారా ?

నిజానికి ఈ దేశంలో హిందూత్వ కంటే కూడా సూడో సెక్యులరిజమే రాజకీయంగా ఉత్తమ ఫలితాలు ఇచ్చింది, హిందూత్వ బీజేపీకి కలసి వచ్చిందనుకున్నా అంతకు మించి కారణాలు అనేకం [more]

Update: 2020-05-29 11:00 GMT

నిజానికి ఈ దేశంలో హిందూత్వ కంటే కూడా సూడో సెక్యులరిజమే రాజకీయంగా ఉత్తమ ఫలితాలు ఇచ్చింది, హిందూత్వ బీజేపీకి కలసి వచ్చిందనుకున్నా అంతకు మించి కారణాలు అనేకం ఆ పార్టీ విజయానికి ఉన్నాయి. ఇక బీజేపీ కూడా అధికారం రుచి మరిగాక ఎక్కువగా హిందూత్వం గురించి మాట్లాడడం తగ్గించిన సంగతి కూడా గమనార్హం. ఇవన్నీ ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని, బీజేపీ దేవుడి పార్టీ కాబట్టి తాము కూడా అటే ఓటేస్తే బతికి బట్టకడతామని కొన్ని పార్టీలు వేస్తున్న కుప్పిగెంతులు చూస్తే అర్ధమవుతుంది. హిందూత్వ కార్డు కూడా బీజేపీకి వర్కౌట్ అయింది కేవలం ఉత్తరాదిలోనే. దక్షిణాదిన ఆ పార్టీకి ఆ కార్డు ఏమీ ఓట్లు తేలేదు సరికదా ఎప్పటికీ అంగుష్టమాత్రంగానే ఉంచేసింది. దానికి కారణం ఉంది ఈ వైపు ప్రజానీకం కాస్తా లౌకిక భావజాలంతో ఉంటారు.

పదే పదే….

జగన్ కుటుంబం క్రిస్టియన్ మతం తీసుకుంది. అది రహస్యమేమీ కాదు. ఆయన చెప్పుకున్నారు కూడా. ఇక పాలకుడిగా ఆయన అన్ని మతాలతోనూ బాగానే ఉంటున్నారు. ఇపుడు జగన్ ని హిందువులకు వ్యతిరేకం చేయాలని వట్టిపోయిన రాజకీయ జూదాన్ని విపక్షాలు ఆడుతున్నాయి. ఇక్కడ గడుసుతనం ఏంటంటే దేవుడు లేడన్న పార్టీలు కాబట్టి వామపక్షాలు సైలెంట్ గా ఉంటాయి. అలాగని అవి జగన్ పక్షం కావు. మిగిలిన పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన బీజేపీతో కలిపి రచ్చ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే బీజేపీ కంటే ఎక్కువగా అరచి గోల పెడతాయి. కానీ పదే పదే జగన్ ని హిందువులకు వ్యతిరేకంగా చూపెట్టాలని ఉత్సాహంతో చేస్తున్న రాజకీయంతో జగన్ కే అతి పెద్ద మేలు చేస్తున్నామన్న సంగతి మరచిపోతున్నాయి.

అదెలాగంటే …?

ఏపీలో ముస్లిం మైనారిటీలు బాగానే ఉన్నారు. అలాగే దళితులు కూడా భారీ ఓటు బ్యాంక్ గా ఉన్నారు. వీరంతా గతంలో కాంగ్రెస్ కి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉండేవారు, ఇపుడు జగన్ మొత్తం ఓట్లను ఈ వైపుగా లాగేశారు. గత ఏడాదిగా జగన్ మీద హిందూ వ్యతిరేక ముద్ర పూయాలని ఇతర పార్టీలు చేస్తున్న విష రాజకీయంతో ఈ వర్గాలు మరింత దన్నుగా జగన్ వైపునకు నిలిచే అవకాశాలు ఉంటున్నాయి. దాంతో జగన్ మరింత బలవంతుడు అవుతున్నాడు. ఇది మాత్రం విపక్షం గుర్తించడంలేదు అంటున్నారు.

అయినా గెలిచారు…..

ఇక జగన్ తండ్రి వైఎస్సార్ మీద అప్పట్లో ఇలాగే హిందూత్వ వ్యతిరేక రాజకీయాన్ని టీడీపీ నడిపింది. ఏడు కొండలను రెండు కొండలుగా వైఎస్సార్ చేయాలనుకుంటున్నారని పెద్ద గొడవే చేసింది. అయినా సరే 2009 ఎన్నికల్లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. అంటే జనం ఆ మాటలను నమ్మలేదనే అనుకోవాలి. అదే విధంగా హిందూత్వ ఓటు బ్యాంక్ సాలిడ్ గా ఒక వైపు కూడి రాజకీయంగా పంట పండించే సీన్ కూడా లేదని కూడా అర్ధమవుతోంది.ఇపుడు కూడా జగన్ మీద తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్ముతున్నారని, హిందూ దేవుళ్ళు లెక్కలేదని చేస్తున్న ఆరోపణలను నమ్మే సెక్షన్లు పెద్దగా ఉండవు. అలాగే వారిలో కూడా వైసీపీ ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టే వారెవరూ లేరు. కానీ విపక్షం మాత్రం విఫలమైన ఈ రాజకీయ ప్రయోగాన్నే నమ్ముకుని ఎప్పటికపుడు బొక్క బొర్లా పడుతూనే ఉంది. నిజంగా ఇది సిధ్ధాంత రాహిత్యానికి రాజకీయ విషాదానికి మచ్చు తునకగా చూడాలి.

Tags:    

Similar News