మోజుగా…మొండిగా.. మొరటుగా?

ముఖ్యమంత్రిగా జగన్ కుర్చీ ఎక్కి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో జగన్ పాలన ఎలా ఉంది అన్నది అందరికీ ఆసక్తికరమే. అంతటా చర్చనీయాంశమే. జగన్ పాలన తీసుకుంటే [more]

Update: 2020-05-26 13:30 GMT

ముఖ్యమంత్రిగా జగన్ కుర్చీ ఎక్కి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో జగన్ పాలన ఎలా ఉంది అన్నది అందరికీ ఆసక్తికరమే. అంతటా చర్చనీయాంశమే. జగన్ పాలన తీసుకుంటే రెండు భాగాలుగా తొలి ఏడాదిని చెప్పుకోవాలి. మొదటి ఆరు నెలలు మోజుగా సాగితే రెండవ ఆరు నెలలు కొంత మొరటుగా నిర్ణయాలు తీసుకుంటూ నేనే రాజూ, నేనే మంత్రి అన్న టైప్ లో జగన్ దూకుడుగా సాగరనిపిస్తుంది. జగన్ మొదటి ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం జగన్ అలాగే పాలన సాగించారు కూడా. తొలి ఆరు నెలల పాలన చూసిన విపక్షాలు సైతం జగనే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారేమోనని కంగారు పడ్డారు కూడా.

మొండిగా……

ఇక జగన్ లోని మొండితనం మొదట్లోనే చూచాయగా బయటపడింది. అది ప్రజావేదికను కూల్చివేసినపుడు. దాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదేంటి తొమ్మిది కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయిపోయింది అని బాధ పడ్డారు అంతకు ముందు చంద్రబాబు దాన్ని ప్రతిపక్ష నాయకుడు వినియోగించుకునేందుకు ఇవ్వాలని కోరారు. అది జరిగిన కొద్ది రోజులకే ఇలా కూల్చడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ మొండిగా ముందుకెళ్ళడం కూడా ఆయనలోని రెండవ మనిషిని జనాలకు పరిచయం చేసింది. ఓ వైపు అమరావతి రాజధాని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. మరో వైపు విపక్షాలు కూడా మూడు రాజధానులు వద్దు అన్నారు, అయినా సరే జగన్ తనదే రైట్ అంటూ విషయంలో అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

అది మరీనా…?

ఇక జగన్ తీసుకున్న మరో దూకుడు నిర్ణయం శాసనమండలి రద్దు. నిజానికి ఈ నిర్ణయం సొంత పార్టె వారికే నచ్చలేదు అని చెబుతారు. ఎందుకంటే మండలిలో ఏడాది పాటు ఓపిక పడితే వైసీపీకి మెజారిటీ వస్తుంది. ఎంతో మంది ఆశావహులు క్యూలో ఉన్నారు. పైగా మండలిని పునరుధ్ధరించింది జగన్ తండ్రి వైఎస్సార్. ఇలా సెంటిమెంట్లు, రాజకీయ అవసరాలు, సమీకరణలు అన్నీ కలసి ఉన్న మండలిని ఒక్క కలం పోటుతో రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు ఈ విషయంలో సొంత పార్టీ వారు ఎంత చెప్పినా కూడా జగన్ వినలేదు అంటారు.

లోకల్ బాడీ ఎన్నికలు…

ఇక లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వస్తే జగన్ ఇక్కడ కూడా పట్టుదలగా వ్యవహరించారు. ఎంత పట్టుదలగా అంటే ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలు జరిగితీరాలి అన్నంతగా. ఇది ప్రజాస్వామ్యం. అనుకున్నవి జరగడానికి ఎన్నో అవరోధాలు వస్తూంటాయి. బ్రేకులు పడుతూంటాయి. కరోనా వైరస్ కారణంగా చూపుతూ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. అది సబబేనని తరువాత రోజుల్లో తెలిసివచ్చింది. కానీ జగన్ మాత్రం నిమ్మగడ్డపైన విరుచుకుపడిన తీరు, ఆయన కులం ఎత్తి చూపుతూ అప్పట్లో చేసిన ఆరోపణలు మొరటు రాజకీయాన్నే తలపించాయని అంటారు.

అలా కనిపించాలని….

ఇక జగన్ మూడు రాజధానుల విషయం అయినా, మండలి రద్దు అయినా, లోకల్ బాడీ ఎన్నికలు అయినా వేరే విధంగా రియాక్ట్ అయితే బాగుడేది అంటారు పార్టీలోని వారు, హితైషులు కూడా. నలబైకి పైగా పధకాలు పేదలకు అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జగన్ ఇలా కొన్ని దూకుడు నిర్ణయాల మూలంగా కొంత వ్యతిరేకతను కోరి తెచ్చుకున్నారని చెబుతారు. పార్టీ అభిమానులు, ఓటర్లు, టార్గెటెడ్ గ్రూప్ ని పక్కన పెడితే తటస్థులు, మేధావులు మాత్రం రెండవ ఆరు నెలల కాలంలో జగన్ పాలనలోని మొండితనాన్నే చూశారు. ఇకనైనా జగన్ కొంత స్మూత్ గా డీల్ చేస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం వస్తుంది అన్నది పార్టీ లోపలా, బయటా మాట.

Tags:    

Similar News