టీడీపీ కోటలో జగన్ పాగా ?

రాజకీయాలు చూడను, కులం చూడను, ప్రాంతం అంతకంటే చూడను, మాకు ఓటేశారా? లేదా? అన్నది అసలు చూడను…ఇదీ జగన్ నినాదం. నిజంగా ఈ నినాదానికి జగన్ కట్టుబడి [more]

Update: 2020-05-26 12:30 GMT

రాజకీయాలు చూడను, కులం చూడను, ప్రాంతం అంతకంటే చూడను, మాకు ఓటేశారా? లేదా? అన్నది అసలు చూడను…ఇదీ జగన్ నినాదం. నిజంగా ఈ నినాదానికి జగన్ కట్టుబడి ఉన్నారనడానికి అచ్చమైన ఉదాహరణ విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో బాధితులను ఆదుకున్న విధానం. పాలిమర్స్ చుట్టూ కూడా ఉన్న గ్రామాలన్నీ తెలుగుదేశానికి పెట్టని కోటలు. ఆ పార్టీ పుట్టాకే ఈ గ్రామాలు పుట్టాయనుకోవాలేమో. దాంతో అవి పసుపు పార్టీ పట్ల పూర్తి విధేయతను, భక్తిని చాటుకుంటాయి. ఇక్కడ ఉన్న గ్రామాల పేర్లలో నందమూరి నగర్ అని కూడా ఉంది. అంటే తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న గారి పేరు మీద వెలసిన గ్రామం. అటువంటి గ్రామాలన్నీ కూడా గ్యాస్ లీకేజితో ప్రమాదంతో ఇబ్బంది పడ్డాయి. దాంతో వైసీపీ సర్కార్ అన్ని గ్రామాలను ఒక చోట చేర్చి మరీ భారీ సాయం చేసింది.

ఓటేయలేదా…?

నిజానికి ఈ గ్రామాలన్నీ విశాఖ పశ్చిమ నియోకవర్గంలోకి వస్తాయి. ఇక్కడ రెండు సార్లు వైసీపీని జనం ఓడించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే కూడా టీడీపీ అభ్యర్ధికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. అంటే ఇక్కడ ప్రజలు వైసీపీని ఆదరించలేదని స్పష్టమవుతోంది. అయినా సరే ఈ గ్రామాల ప్రజలను వైసీపీ సర్కార్ ఎంతగానే దగ్గరకు తీసుకుంది. బాధిత గ్రామాలతో పాటు, చుట్టుపక్కన ఉన్న వారదరికీ ఇంట్లో ఎందరు ఉంటే అందరికీ తలా పది వేల రూపాయలను ముఖ్యమంత్రి జగన్ హామీ మేరకు నష్టపరిహారంగా సత్వరమే పంపిణీ చేశారు. వారి కోసం శాశ్వతంగా అక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా ఎల్జీ పాలిమర్స్ నే అక్కడ నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆకట్టుకున్నారా…?

ఇక ఇంతలా వైసీపీ సర్కార్ తక్షణం స్పందించి యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడమే కాదు పది రోజుల్లోనే పరిస్థితి మొత్తాన్ని అదుపులోకి తేవడం అంటే మాటలు కాదు, దాంతో ఆ గ్రామస్తులు అంతా ఫిదా అవుతున్నారు. వారిలో మార్పు కూడా పక్కాగా కనిపిస్తోంది. ఎంతలా అంటే అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వారు వచ్చి రెచ్చగొట్టినా, ఆందోళనలు చేయమని పిలుపు ఇచ్చినా కూడా వారు పట్టించుకోనంతగా. ఒకనాడు ఇదే గ్రామాలలో వైసీపీకి చోటు ఉండేది కాదంటారు. ఇపుడు నేతలు వెళ్తే స్వాగతిస్తున్నారు.

మనసు గెలిచారు…….

నిజంగా జరిగింది దుర్ఘటన అయినా కూడా సకాలంలో తీసుకున చర్యలు, ముఖ్యమంత్రి జగన్ వారిని ఓదార్చిన తీరు అన్నీ కలసి వారికి ప్రభుత్వం పట్ల నమ్మకం పెంచాయి. అంతే కాదు, జగన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని కూడా వారు ఇపుడు భావిస్తున్నారు. రాష్ట్రమంతా గెలిచిన జగన్ కి విశాఖ అర్బన్ జిల్లా ఎపుడూ పట్టు చిక్కడంలేదు. అటువంటిది ఇపుడు మాత్రం ఈ గ్రామాల ప్రజలతో పాటు విశాఖ జనంలోనూ వైసీపీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది అంటే ఇది చాలు రాజకీయంగా చేయలేని పనిని మంచి మనసుతో, మని పనులతో సాధించగలమని నిరూపించడానికి. జగన్ చేసింది అదే. మరి రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఓటర్ల అసలు మనసు ఏంటన్నది బ్యాలెట్ సాక్షిగా బయటపడుతుంది.

Tags:    

Similar News