జగన్ జానీవాకర్ గాళ్లతో జాగ్రత్త…?

బెంగాలీ స్వీట్స్ ఇష్టం మిఠాయి షాప్ రెగులర్ గా వెళ్లేలా చేస్తోంది. నిన్న అలా వెళితే ఫోన్ లో ఓ వ్యక్తి ఆర్డర్ తీసుకుంటూ వాటి రేట్ [more]

Update: 2020-05-21 08:00 GMT

బెంగాలీ స్వీట్స్ ఇష్టం మిఠాయి షాప్ రెగులర్ గా వెళ్లేలా చేస్తోంది. నిన్న అలా వెళితే ఫోన్ లో ఓ వ్యక్తి ఆర్డర్ తీసుకుంటూ వాటి రేట్ చెబుతున్నాడు….. అటు తిరిగి ఉంటే ముఖం కనిపించలేదు…. బ్లాక్ డాగ్, జానీ వాకర్, గ్లెన్ఫిడిచ్, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ ఇలా మిఠాయి షాప్ మద్యం పేర్లు వినిపిస్తుంటే కుతూహలం ఆపుకోలేక రెడ్ లేబుల్ ఎంత అన్నాను…. అతను గిర్రున వెనక్కి తిరిగి అలాగే చూస్తూ ఉండిపోయాడు. నేను అతడిని చూసి అరేయ్ నువ్వా అన్నాను…. వాడు అన్నా కావాలా….! అన్నాడు తెలిసిన ముఖం కావడంతో….. ఆస్తులు అమ్ముకోవాలి. నాకు వద్దులే. అన్నాను…. కాసేపు కబుర్లు చెప్పాక, వ్యాపారం బాగుందా అంటే. హిహిహి అన్నాడు. బాగానే ఉంటుందిలే మీ కోసమే కదా ఈ టాస్క్ ఫోర్స్ లు, నిషేధాలు అని స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చేశా.

ఎమ్మెల్యేగారి లెఫ్ట్ ఫింగర్…

ఇంతకీ జానీ వాకర్ అబ్బాయి ఎవరో చెప్పలేదు కదా…. ఓ ఎమ్మెల్యే గారి లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్….. తెలిసిన వాడే…. చాన్నాళ్లుగా ఆయన్ని నమ్ముకుని బతుకుతున్నాడు. ఆయన ఫ్లెక్సీలలో ఓ మూల తల పెట్టుకుని బతికేస్తుంటాడు. లాక్ డౌన్ పుణ్యాన ఇలా ఉపాధి దొరికింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తే లాస్ అవుతుందని దిగులు పెట్టుకున్నాడు.

2012లోనే చెప్పి….

మద్య నిషేధం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన నాకెలాంటి అనుమానాలు లేవు. ఆయనకు మద్యం గిట్టదు కాబట్టి మిగతా వారికి మద్యం అనవసరం అని బలంగా నమ్ముతున్నారు. పదేళ్ల క్రితం కృష్ణా జిల్లా మైలవరంలో కల్తీ మద్యం తాగి జనం చచ్చిపోయినపుడు బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చినపుడు మద్యం మీద తొలిసారి మాట్లాడారు. ఆంధ్రా ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అసలు మద్యాన్ని ఆదాయ వనరులా ఎందుకు చూడాలి. ఢిల్లీ మాదిరి ప్రభుత్వమే ఎందుకు విక్రయించకూడదు, బాధ్యతగా వ్యవహరించకూడదు అని ప్రశ్నిస్తే….. అసలు ప్రభుత్వం అయినా ఎందుకు అమ్మాలి. నిషేధిస్తే సరిపోతుందిగా అని బదులిచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేధిస్తాం అని 2012లో జగన్ ప్రకటించారు.

అనుకున్నంత ఈజీ కాదు….

ఆ తర్వాత కూడా చాలా సార్లు మద్య నిషేధం గురించి బలంగా చెప్పారు. మద్య నిషేధం అనుకున్నంత ఈజీ కాదు. మద్యం అమ్మకాల మీదే అధికారిక సోకులన్ని ఆధారపడి ఉంటాయి. ఏ పనికైనా డబ్బులు కావాలి. సంక్షేమం, ప్రత్యక్ష నగదు పంపిణీ పథకాలు పాలనలో భాగం అయ్యాయి. సరే మద్య నిషేధం, అమ్మకాల గురించి పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నది చూస్తే రోజూ పోలీసులు.. ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు పోటీలు పడి మద్యం పట్టుకుంటున్నాయి. ఈ బృందాలు వేలు, లక్షల ఖరీదు చేసే మద్యాన్ని , వాహనాలను ఎగబడి పట్టుకుంటున్నాయి. ఇంతకీ ఈ మద్యం ఎక్కడిది? రాష్ట్ర సరిహద్దులో నుంచి పన్నులు లేకుండా ప్రవహించే మద్యం అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఈ రాష్ట్రంలో అమ్మే మద్యాన్ని ఇదే రాష్ట్రంలో పట్టుకోవడమే అసలు ప్రశ్న. మన పన్నుతో మన ఒళ్లు గుల్ల చేసుకోవాలి కాబట్టి పక్క వాళ్ళ పన్ను వసూలు చేసే మందు ఇక్కడ ఒప్పుకోరు. ఇందులో లాజిక్ ఉంది.

లాభ పడేది వాళ్లేగా……

కాపు సారాకి ఏ పన్ను ఉండదు కాబట్టి దానిని అసలే ఒప్పుకోరు…. మరి రాష్ట్రంలో ఓ చోట రెడ్, మరో చోట ఆరెంజ్, ఎక్కువ గ్రీన్ జోన్లు ఉన్నాయి. మే మొదట్లో చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. దుకాణాలు తెరిచిన ప్రాంతాలకు తెరవని ప్రాంతాల వాళ్ళు వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. డిమాండ్ ఉంది కాబట్టి జానీవాకర్ లాంటి వాళ్ళు మొబైల్ షాప్స్ నడుపుతున్నారు. ఎటూ ప్రభుత్వం ఎమ్మార్పీ మీద 75శాతం పన్ను వేసింది కాబట్టి వీళ్ళు ఇంకో 50-100శాతం లాభం కలుపుకుని బతికేస్తున్నారు. మద్యం మీద ఆరేడు వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. ఇంకా ఎక్కువే రావొచ్చు కూడా. అసలు మద్య నిషేధం ఎందుకు అమలు చేయాలన్నది ఓ సారి సమీక్షించుకోవాలి. జేబులు ఖాళీ చేసే ధరలు ఇళ్లను గుల్ల చేసేస్తాయి. తాగితాగి రోగాల బారిన పడితే మళ్ళీ ప్రభుత్వమే వైద్యం చేయించాలి. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాలి. ఇదంతా ఎకానమిలో భాగమే అయినా బోలెడు శేష ప్రశ్నలు, మధ్యలో లాభ పడే వారు ఎవరన్నది కూడా తాగని వాళ్ళు ఆలోచిస్తారు. అంచేత మద్య నిషేధం ఎవరి జేబులు నింపుతుంది అనే క్లారిటీ తెచ్చుకోవాలి. లేకపోతే జనం అసలే చీలిపోయి ఉన్నారు. మందు తాగే వాళ్ళు ధరలు పెంచిన మంట మీద ఉంటారు. సంపాదించిన కాసిన్ని డబ్బులు మళ్ళీ ఆ మందుకు తగలేస్తున్నారని వాళ్ళ ఇళ్లలో కసి పెంచుకుంటారు. ఇక ఇలా అప్పో సప్పో చేసిన మద్యాన్ని అక్రమం పేరుతో లాగేసుకుంటే అదో మంట… లాభ పడేది మాత్రం జానీ వాకర్…. వాళ్లే ఎమ్మెల్యే…. మిగిలిన నైన్ ఫింగర్స్.

Tags:    

Similar News