ఆ గ్యాప్ లేకుండా చూసుకో జగన్ ?

రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూంటాయి, పోతూంటాయి. కానీ శాశ్వతమైన వ్యవస్థ మాత్రం అధికారులే. వారు కనీసంగా మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంటారు. వారు గుర్రం లాంటి [more]

Update: 2020-06-03 11:00 GMT

రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూంటాయి, పోతూంటాయి. కానీ శాశ్వతమైన వ్యవస్థ మాత్రం అధికారులే. వారు కనీసంగా మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంటారు. వారు గుర్రం లాంటి వారు. రౌతును బట్టి వారి పరుగు ఉంటుంది. ఏపీలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. అందరికీ బధ్ధులై అధికారులు పనిచేశారు. అయితే తమకు అసంతృప్తి కలిగించిన పాలకులను చేతికి మట్టి అంటనీయకుండా తెలివిగా ఇంటికి పంపించారు. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎక్కువగా అధికారులకు స్వేచ్చ ఇచ్చి పనిచేయించారన్నది స్థిరపడిపోయిన ఒక అభిప్రాయం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మామ ఎన్టీఆర్, అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. కానీ అధికారులు టీడీపీ ఏలుబడిలోనే ఎక్కువగా అసంతృప్తికి గురి అయ్యారన్నది కూడా ప్రచారంలో ఉంది.

అదే కారణమా…?

చంద్రబాబు సీనియర్ నేత. అయితే అన్ని విషయాలు తనకే తెలుసు అనుకుంటారని పేరు. ఆయన అధికారులను పనిచేయనివ్వరని కూడా విమర్శలు ఉన్నాయి. అన్నీ ఆయనే చెబుతారు. ఆయన అనుకున్నట్లుగానే పని జరగాలి. తేడా వస్తే ఉగ్ర రూపమే దాలుస్తారు. ఇక అధికారులను బాహాటంగా విమర్శించిన ఘటనలు బాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడూ నిన్నడి ఏపీ సీఎంగా పాలించినపుడూ కొన్ని చోటు చేసుకున్నాయి. అధికారులను అవినీతిపరులుగా చిత్రీకరించే విధానం టీడీపీ హయాంలోనే జరిగిందని అంటారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీల పేరిట చేసిన హడావుడి కూడా ఉద్యోగ వర్గాల భద్రతను ప్రశ్నార్ధకం చేసిందని చెబుతారు.

మారానని చెప్పి ….

ఇక చంద్రబాబు పదేళ్ల తరువాత విభజన ఏపీకి సీఎం అయ్యారు. తాను తప్పు చేశానని, అధికారుల విషయంలో మారానని బాబు చెప్పినా కూడా ఆయన చాలవరకూ పాత పోకడలే అనుసరించారని అంటారు. మంచి జరిగితే తన ఖాతాలో చెడు జరిగితే అధికారుల లెక్కల్లో రాసేయడం టీడీపీ ఏలుబడిలో చాలానే జరిగిందని ఇప్పటికీ అధికారులు వాపోతారు. ఇక హుదూద్ లాంటి విపత్తులు వచ్చినపుడు అధికారులను పనిచేయనీయకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులు అంతా అక్కడే విడిది చేసి మరీ చేసిన హడావిడి వల్ల ఫలితాలు తక్కువగానే వచ్చాయని అధికారులు విశ్లేషిస్తారు. అదే తాజాగా ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తీసుకుంటే అధికారులను ముందు పెట్టి వైసీపీ సర్కార్ పనిచేయించింది. వారికే స్వేచ్చ ఇచ్చింది. దాంతో తొందరగా ఫలితాలు వచ్చాయని చెబుతారు.

ఏడాదిలో అలా….

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇపుడు ఏపీలో 48 రకాల సంక్షేమ పధకాలు అమలు అవుతున్నాయి. అవన్నీ విజయవంతంగా క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు చేరుతున్నాయి. దీనికి కారణం అధికారుల నిబద్దతేనని ఏకంగా ముఖ్యమంత్రి జగన్ వారికే ఆ గొప్పతనాన్ని అపాదిస్తున్నారు. నిజంగా అధికారుల సహకారం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున పధకాలు జనంలోకి వెళ్ళడం, అర్హులు అందరికీ తేడా పాడా లేకుండా చేరడం జరిగే పని కాదు. ఈ విషయంలోనె కాదు, కరోనా విపత్తు వేళ కూడా మొత్తం యంత్రాంగం పూర్తి బాధ్యతతో ఏపీలో విధులను నిర్వహించింది. దానికి కూడా ముఖ్యమంత్రి జగన్ శభాష్ అంటున్నారు.

సెగ రగలకూడదు…..

ఇక అన్ని రకాలుగా జగన్ సర్కార్ కి అధికార యంత్రాంగం సహకరిస్తోంది. అయితే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మంచిగా ఉంటున్నా వారి హామీలను తీర్చే విషయంలో కొంత ఉదాసీనత వ్యవహరిస్తోందని అంటున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అది పెండింగులో ఉండడం పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కరవు భత్యం బకాయిలు నిలిచిపోయాయి. అన్నిటికంటే కూడా కరోనా విపత్తు వేళ సగం జీతలు ఇవ్వడాన్ని కూడా ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి పూర్తిగా సహక‌రించి పని చేస్తున్నామని, తమను పక్కన పెట్టడం తగదని అంటున్నారు. మరి వారిలో అసంతృప్తి సెగలు రగలకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకుంటే జగన్ సర్కార్ మరింతగా జనంలో పేరు తెచ్చుకుంటుంది.

Tags:    

Similar News