జగన్ ఈ విషయంలో తప్పు చేసినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల అమలులో చాలా స్పీడ్. సాధారణంగా అధికారంలోకి వచ్చిన వారు తాపీగా అయిదు సంవత్సరాల కాల వ్యవధిలో తమ ఎన్నికల ప్రణాళికను [more]

Update: 2020-05-21 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల అమలులో చాలా స్పీడ్. సాధారణంగా అధికారంలోకి వచ్చిన వారు తాపీగా అయిదు సంవత్సరాల కాల వ్యవధిలో తమ ఎన్నికల ప్రణాళికను అమలు చేసేందుకు పూనుకుంటారు. కానీ ఏపీలో మాత్రం పదవీ స్వీకారం దగ్గర్నుంచే సీఎం జగన్ యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల వంటి వాటిపై ప్రభుత్వం శ్రద్ద పెట్టడం లేదని విమర్శలు వచ్చినా, సంక్షేమమే సర్కారుకు శిరోధార్యమని జగన్ భావించారు. దానినే ఆచరిస్తున్నారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలను కొంతకాలం వాయిదా వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ సత్వరం అమల్లోకి తెచ్చేశారు. వేల కోట్ల రూపాయలు నిధులను వివిద మార్గాల్లో సమీకరించి అమలు చేశారు. మాట తప్పకూడదనే సంకల్పం ఒక కారణమైతే, ప్రజలకు కావాల్సింది సంక్షేమమే అన్న బలమైన నమ్మకం మరో కారణం. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలు నిధుల కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. ఏపీ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. సర్కారీ ప్లాగ్ షిప్ ప్రోగ్రాముల కోసం ఏదో రూపంలో డబ్బులు సమకూర్చుకుంటోంది. అనేక స్కీములు అమలు చేస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ జగన్ సర్కారుకు ఆందోళన కలిగించే అంశం క్రమేపీ ఊపందుకుంటోంది. విపక్షాలన్నీ ఒక్కబాట మీదకు వస్తున్నాయి. ఆ పార్టీలు చేపడుతున్న నిరసనలకు ప్రజామద్దతు లభిస్తోంది. ఇది అధికారపార్టీకి ఆందోళనకారకం.

ప్రజల చేతిలో పైసలు…

గడచిన రెండు నెలలుగా ప్రజలకు ఉపాధి లేదు. వారికి వివిధ రూపాల్లో డబ్బులు సమకూర్చాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వివిధ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఆర్థిక రథం ముందుకు కదులుతుంది. ఇందుకుగాను హెలికాప్టర్ మనీ వంటి వినూత్న ఆలోచనలనూ రాజకీయవేత్తలు సూచిస్తున్నారు. అయితే కేంద్రం ఈ విధానం పట్ల మొగ్గు చూపలేదు. కనీసం అమెరికా, కెనడా వంటి దేశాలు అమలు చేస్తున్న ప్రత్యక్ష ఆర్థిక సాయానికి సైతం సాహసించలేదు. రుణాల ద్వారా వివిధ రంగాలకు నిధులు లభ్యత కలిగేలా ప్యాకేజీ రూపకల్పన చేసింది. దీనివల్ల తక్షణం ప్రజల చేతికి సొమ్ములు రావు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనిని సర్కారు సాకారం చేసిందనే చెప్పాలి. తమ సర్కారీ క్రెడిట్ పెరిగేలా సంక్షేమ పథకాల సొమ్ములను వ్యక్తిగత లబ్ధి పథకాల ద్వారా ప్రజలకు పంపిణీ చేసింది. ఆరుపథకాలకు సంబంధించిన నిధులను ఈ అరవై రోజుల్లో విడుదల చేశారు. కేంద్ర పన్నుల వాటా, రుణము, సహాయ నిధులు మొత్తం మీద రాష్ట్ర ఖజానాకు ఏ రూపంలో సొమ్ము సమకూరినా వాటిని సంక్షేమపథకాలవైపు మళ్లించారు. ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో పలుకుబడి పెరగడానికి ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి. అసలు ఎన్నికల ప్రణాళికలో చెప్పని అనేక వర్గాలకు సైతం పథకాలను రూపకల్పన చేసి జగన్ అమలు చేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల చేతిలో సొమ్ములు పెట్టగలిగారు. ఇదంతా ఒక ఎత్తు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను కొట్టిపడేసే సంక్షోభం, సమస్య రాష్ట్రప్రభుత్వానికి ఎదురవుతోంది.

ఏకమవుతున్న ప్రతిపక్షాలు…

పరిపాలన విషయంలో జగన్ సర్కారుది పెద్దగా చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు కాదు. మూడు రాజధానులు, శాసనమండలి రద్దు, ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీషు విద్య, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు వంటి నిర్ణయాలన్నిటిపైనా ఎదురు దెబ్బలే తగిలాయి. అయితే సంక్షేమ పథకాల హోరులో ప్రభుత్వానికి విధానపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. వివిధ వర్గాలకు నిధులను ఏయే సమయాల్లో సాయంగా అందిస్తామో తెలుపుతూ ఏకంగా క్యాలెండర్ నే జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ప్రతిపక్షాలకు ఇప్పుడు బలమైన అస్త్రం దొరికింది. అన్నిపార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలే వారి ఉద్యమాంశం. దీనిపై ఇప్పటికే దీక్షలకు దిగింది బీజేపీ. అమరావతి నుంచి హస్తిన వరకూ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న అంశం కావడంతో దీనిపై ముందుకే వెళ్లాలని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విపక్షాలు ఏకమై…

గతంలో ఇసుక కొరత, రాజధాని తరలింపు వంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. కానీ ప్రజల నుంచి పెద్ద మద్దతు లభించలేదు. ఇప్పుడు చేపట్టిన అంశం ప్రజలందరికీ సంబంధించినది కావడంతో కచ్చితంగా మైలేజీ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం కూడా రంగంలోకి దిగింది. తెలుగుదేశం సైతం తమ దీక్షలకు పిలుపునిచ్చింది. ఇప్పటిక వామపక్షాలు దీనిపై ఆందోళన చేశాయి. రెండు నుంచి మూడు రెట్లు విద్యుత్ బిల్లులు వస్తున్నట్లు వినియోగదారుల ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి ఆధారాలు చూపుతున్నారు. ఈ కరోనా కరవు కాలంలో బిల్లులు , స్లాబులు మారిపోవడంపై సమర్థంగా సర్కారు వ్యవహరించలేకోతోంది. ఇళ్లల్లో వినియోగం పెరిగిందంటూ డిస్కం అధికారులు సమస్యను తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ఇదే వాదనను తలకెత్తుకున్న జగన్ సర్కారు ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి తరహాలో ఇబ్బంది పడుతోంది. ప్రజలకు బిల్లుల షాక్ తో సర్కారీ వాదనలు తేలిపోతున్నాయి. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ పార్టీలు పక్కనున్న తెలంగాణతో పోల్చి చెబుతున్నారు. అక్కడ విద్యుత్ బిల్లులపై ఎటువంటి వివాదం లేకపోవడంతో ప్రతిపక్షాల ఆందోళనకు సహజంగానే నైతిక మద్దతు లభిస్తోంది.

స్థానిక ఎన్నికలకు షాక్…

సంక్షేమ పథకాలు ఎంతగా అమలు చేస్తున్నా, పెరుగుతున్న ధరలను ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ వంటి స్కీములను, రైతులకు పంట సాయాన్ని అందించినా పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మోత మోగిస్తున్న విద్యుత్తు బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈపాటికే రాజకీయ పార్టీల మద్దతుతో ప్రజలు రోడ్డెక్కి ఉండేవారు. లాక్ డౌన్ తో సర్కారుకు ఉపశమనం లభించింది. నేతల ఆందోళనలు ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమై లోటుపాట్లు సరిదిద్దాలి. డిస్కం ల ఆదాయం తగ్గినా ఈ కష్ట కాలంలో ప్రజలకు ఉపశమనం ఇవ్వడం ఎంతైనా అవసరం. డిస్కం ల వాదనకే మొగ్గు చూపితే ప్రభుత్వం భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News