జ‌గ‌న్‌పై కేసీఆర్ పంతం.. వ్యూహం పారుతుందా..?

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీళ్లు.. నిప్పులు కురిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు గోదావ‌రి నీటిని ఒడిసి ప‌డ‌తామ‌ని, నీళ్లను రెండు తెలుగు రాష్ట్రాలు సంపూర్ణంగా వినియోగించుకునేందుకు [more]

Update: 2020-05-25 02:00 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీళ్లు.. నిప్పులు కురిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు గోదావ‌రి నీటిని ఒడిసి ప‌డ‌తామ‌ని, నీళ్లను రెండు తెలుగు రాష్ట్రాలు సంపూర్ణంగా వినియోగించుకునేందుకు సంయుక్తం గా ప్రాజెక్టులు క‌డ‌తామ‌ని, స‌ముద్రంలోకి పోతున్న కొన్ని వేల టీఎంసీల జ‌లాల‌ను వేస్ట్ కాకుండా .. ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవ‌డం ద్వారా రెండు రాష్ట్రాల రైతుల క‌ల‌లు తీరుస్తామ‌ని ఇరు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్‌లు సంయుక్తంగా రెండు సార్లు ప్రత్యేకంగా భేటీలు నిర్వహించిమ‌రీ వెల్లడించారు. దీంతో ఇక, తెలుగు రాష్ట్రాల్లో అన్ని పొలాల‌కు, స్థలాల‌కు కూడా నీరు పారుతుంద‌ని,రైతుల క‌న్నీళ్లు ఇంకిపోయి.. పంట పొలాలు స‌స్యశ్యామలం అవుతాయ‌ని అంద‌రూ భావించారు.

జీవో నెంబరు 203 పై…..

ఇంత‌లోనే ఏం జ‌రిగిందో ఏమో.. ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాద‌న‌ల‌పై మౌనం వ‌హించారు. ఇదిలావుంటే, అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం గ‌త మార్చిలో 203 జీవోను విడుద‌ల చేసింది. దీని ప్రకారం రాయ‌ల‌సీమ‌కు నీళ్లు అందించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ ఎత్తు పెంచ‌డంతోపాటు, దీనికి సంబంధించిన కాల్వ ల విస్తర‌ణ‌ను చేప‌ట్టాల‌ని జ‌గ‌న్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ‌లో విప‌క్షాలు దీనిని రాజ‌కీయం చేశాయి. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచితే.. తెలంగాణ‌లో పొలాలు ఎండిపోతాయ‌ని విమ‌ర్శలు గుప్పించారు. దీంతో అక్కడి రాజ‌కీయ ప్రయోజ‌నాలు కాపాడుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా దీనిని వ్యతిరేకించ‌డం ప్రారంభించారు.

ఇది సాధ్యమయ్యేనా?

జ‌గ‌న్ ప్రభుత్వం జీవో ఇచ్చిందో లేదో వెంట‌నే తెలంగాణ‌లో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఆక్సిజ‌న్‌లా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే కృష్ణా నీటిని మ‌రింత‌గా తెలంగాణ‌లోకి ఎత్తిపోసుకునేందుకు వీలుగా జూరాల ద‌గ్గర ప్రాజె క్టు కొత్తగా నిర్మించాల‌ని నిర్ణయించిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో దుమ్ముగూడెం వ‌ద్ద ఎత్తు పెంచి ఏపీ ప్రభుత్వం భావిస్తున్న పోతిరెడ్డిపాడుకు ప‌రోక్షంగా చెక్ పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, దుమ్ముగూడెం ఎత్తుపెంచ‌డం సాధ్యమేనా? అనేది ఇప్పుడు నిపుణులు సంధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఇది అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న వ్యవ‌హార‌మ‌ని, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టుకే నిధులు లేక ఇబ్బంది ప‌డుతోంద‌ని అంటున్నారు.

పంతంతో నిర్మించగలరా?

ఈ స‌మ‌యంలో కృష్ణాన‌ది నీటికి గండికొట్టేలా జూరాల ద‌గ్గర కొత్తగా ప్రాజెక్టుతో పాటు, ఇక గోదావ‌రి మీద ఖ‌మ్మం జిల్లా దుమ్ముగూడెం ద‌గ్గర మ‌రో ప్రాజెక్టును నిర్మించాల‌నే కేసీఆర్ వ్యూహం ఏమేర‌కు కార్యాచ‌ర‌ణ దాలుస్తుంది? అనేది కీల‌క ప్రశ్న. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కృష్ణా బోర్డు కేటాయించిన నీటి కేటాయింపుల మేర‌కే తాము పోతిరెడ్డి పాడు ఎత్తు పెంచుతున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్ ప్రభుత్వ వాద‌న కూడా స‌మ‌ర్ధనీయంగా ఉన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఇలా పంతాల‌కు వెళ్లడం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు. ఏదేమైనా ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌హృద్భావ వాతావ‌ర‌ణం దెబ్బతిన‌కుండా ఇద్దరు నాయ‌కులు చ‌ర్చించుకుని ముందుకు వెళ్లాల‌నేది నిపుణుల సూచ‌న‌. మ‌రి ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News