జగన్ మీద వీళ్లకు పెద్ద ఆశలే ఉన్నట్లుందిగా

జగన్ ముఖ్యమంత్రి అయి గట్టిగా ఏడాది కాలేదు. ఆయన ప్రధాని కావాలన్న వారూ ఉండడం విశేషమే. జగన్ కి మంచి భవిష్యత్తు ఉంది అన్నది అందరికీ తెలిసిందే. [more]

Update: 2020-05-22 14:30 GMT

జగన్ ముఖ్యమంత్రి అయి గట్టిగా ఏడాది కాలేదు. ఆయన ప్రధాని కావాలన్న వారూ ఉండడం విశేషమే. జగన్ కి మంచి భవిష్యత్తు ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఆయన కూడా సరిగ్గా తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వయసులోనే ఏపీకి సీఎం అయ్యారు. నాడు బాబు కూడా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఆయన ఉన్న టైంలో సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్రంలో ఉండేవి. దాంతో చంద్రబాబు తన చాణక్యాన్ని ఉపయోగించి ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఇపుడు జగన్ వంతు వచ్చింది. అయితే జగన్ కి ఈసారి ఆ చాన్స్ లేదు. ఎందుకంటే కేంద్రంలో బంపర్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. పైగా మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన కొరుకుడుపడని ఘటం అంటారు.

సంకీర్ణమేనా?

ఇపుడు ఇలా ఉన్నా కూడా నాలుగేళ్ల తరువాత దేశ రాజకీయం ఎవరూ చెప్పలేరు. మోడీ ప్రధానిగా ఇపుడు ఉన్నారు. 2024 నాటికి ఆయనకు 75 ఏళ్ళు నిండుతాయి. ఆయన స్థానంలో అమిత్ షాను ప్రధాని అభ్యర్ధిగా పెట్టుకుని బీజేపీ బరిలోకి దిగితే మాత్రం కమలానికి కష్టాలు తప్పవని విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికి రెండు సార్లు పూర్తి మెజారిటీ బీజేపీకి ఇచ్చిన దేశ ప్రజల ఆలోచనా విధానాల్లో కూడా భారీ మార్పులు వస్తాయని అంటున్నారు. ప్రధాని అభ్యర్ధిగా మోడీ ఉన్నా కూడా గడ్డు పరిస్థితి తప్పదని కూడా అంచనాలు ఉన్నాయి. దెశంలో మరో మారు సంకీర్ణ రాజకీయాలు 2024 నాటికి మొదలవుతాయని కూడా అంటున్నారు.

చక్రం తిప్పుతారా…?

అపుడు కనుక ఇప్పటిలాగానే జగన్ కి భారీ మెజారిటీ వచ్చి రెండు పదులు తగ్గకుండా ఎంపీ సీట్లు వస్తే మాత్రం కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని వైసీపీలో కూడా ఆశలు ఉన్నాయి. జగన్ కూడా 2019లోనే కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు. అయితే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిందని ఆయన ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరీ మీడియా మీటింగులో తెగ బాధపడ్డారు కూడా. ఇదిలా ఉంటే బీజేపీ ఆధిపత్యానికి జగన్ కూడా ఇబ్బంది పడుతున్నారని, కానీ రాజకీయంగా కాని కాలమని సర్దుకుంటున్నారని అంటున్నారు. అంటే 2024 నాటికి విపక్షాలు దేశంలో బలం పుంజుకుని ఒక కూటమిగా వస్తే జగన్ తన ఎంపీలతో తులాభారంగా మారి చక్రం తిప్పే చాన్స్ అందుకుంటారని అంటున్న వారు ఉన్నారు.

ప్రధాని అవుతారట…

ఇక జగన్ కి రాజకీయాల్లో సుదీర్ఘమైన భవిష్యత్తు ఉందని పార్టీలతో బేధం లేకుండా అంతా అంగీకరిస్తారు. ఇపుడు పైకి కనిపిస్తున్న రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు జగన్ ప్రత్యర్ధులు కూడా డెబ్బై ఏళ్లకు చేరువలో ఉన్నవారే. అందువల్ల జగన్ తో సరిసాటి వయసు కలిగి రాజకీయం చేసేవారు కొత్తగా పుట్టుకొచ్చినా కూడా వారికంటే కూడా అప్పటికి జగన్ రాజకీయంగా సీనియర్ అవుతారని అంటున్నారు. మరో వైపు చూసుకుంటే జగన్ కి ప్రధాని పదవి మీద కన్ను ఉందని ఒకనాటి ఆయన అనుచరుడు, ఇప్పటి ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఈ మధ్యనే ఓ మీడియా టాక్ లో గుట్టు విప్పారు.

జోస్యమే నిజమైతే..?

ఇక వైసీపీలో కీలక నేతగా ఉంటున్న లక్ష్మీ పార్వతి అయితే జగన్ ఎప్పటికైనా ప్రధాని అవుతారని, ఇది సత్యమని జోస్యం కూడా చెప్పేశారు. జగన్ ని ఆమె ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం, ఎన్టీయార్, వైఎస్సార్ ల‌ సరసన కూర్చోబెట్టారు. వారంతా తెలుగు కీర్తిని పెంచితే జగన్ వారి కంటే మరో అడుగు ముందుకేసి ప్రధాని కూడా అవుతారని ఆమె అంటున్నారు. మరి ఈ మాటలు వైసీపీకి ఆనందంగా ఉన్నా కూడా ఆచరణలో జగన్ మరింతగా రాణించాలని, ఏపీ రాజకీయాల్లో దీటైన నేతగా ఎదగాలి విశ్లేషకులు అంటున్నారు. అలా అయితే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News