జగన్ మనసు కరిగింది… అందుకనే అలా?

భారత్ లో మోడీ సర్కార్ వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం మోడీ వైఖరిని దేశం తప్పు పట్టింది. [more]

Update: 2020-05-18 08:00 GMT

భారత్ లో మోడీ సర్కార్ వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం మోడీ వైఖరిని దేశం తప్పు పట్టింది. వారే కోట్ల సంఖ్యలో ఉన్న వలస కూలీలు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మోడీ విధించినప్పుడు వీరికోసం ఎలాంటి ఆలోచన చేయలేదు. రోజులు గడిచి నెలలు దాటుతూ ఉండటం తో ఒక పక్క ఉపాధి లేక పస్తులు ఉండలేక వలస కూలీలు సొంత ఊళ్లకు కాలినడకన బయల్దేరారు. వీరి దయనీయ సమస్య పై ప్రచార మాధ్యమాల్లో వరుస కథనాలు కూడా కేంద్రంలో కదలిక తీసుకు రాలేదు. వేలు, వందల కిలోమీటర్లు రాష్ట్రాలను దాటుకుంటూ పేద కూలీలా పాట్లు ప్రతి ఒక్కరిని కదిలించాయి.

దయచూపని కేంద్రం …

అయినా కానీ మోడీ సర్కార్ వీరికి భోజన వసతి సదుపాయాలు ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నదే కానీ సరైన రవాణా సదుపాయాల కల్పనకు ముందుకు రాలేదు. ఇక లాక్ డౌన్ 3 లో మాత్రం దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ లా రావడంతో శ్రామిక రైళ్ళు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే వీరి ప్రయాణ ఖర్చులను రాష్ట్రాల నెత్తినే రుద్దడంతో ఆయా ప్రభుత్వాలు మిన్నకున్నాయి. శ్రామిక రైళ్ళను ప్రారంభించినా వలస కూలీల కష్టాలకు, కన్నీళ్ళకు, ఆకలి బాధలకు చెక్ పడలేదు. దాంతో దేశవ్యాప్తంగా వీరి నడక ప్రస్థానం సాగుతూనే వుంది.

చలించిన జగన్ … కదిలిన యంత్రాంగం …

వలస కూలీల పై ఎదో ఒక శాశ్వత పరిష్కారం కేంద్రం చూపుతుందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ చివరకు అక్కడ నుంచి ఎలాంటి సానుకూలత రాకపోవడంతో చలించారు. దాంతో అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే ఉన్న వేలమంది నిరాశ్రయులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ సమాయత్తం కావాలని కనీసం వారి వారి రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సుల్లో వదిలి రావాలని ఆదేశించారు. ఇలా వెళ్లేవారికి దారి పొడుగునా భోజన సదుపాయాలకు కలెక్టర్లను ఏర్పాటు చేయాలని కోరారు. కూలీలు ఎక్కడ కనిపించినా వారిని వాహనాల్లో తరలించేందుకు ఎపి సర్కార్ యంత్రాంగం హుటాహుటిన కదిలింది. ఈ చర్యలతో వలస కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం అయినా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియా లో సైతం అభినందనలు తెలిపారు.

రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి అనడంతో …

వలస కూలీల అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చెప్పడం అనేక ఇబ్బందులకు గురిచేసింది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఒక్కో రకంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రమే లాక్ డౌన్ నిబంధనలు ఫ్రేమ్ చేసిన విధంగా వీరి సమస్య పై కూడా పెట్టి ఉంటె వలస కూలీల బాధలు తీరేవి. అలా కాకుండా కేంద్రం రాష్ట్రాలకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం సమస్యను మరింత జటిలం చేసింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు వలస కూలీలను సొంత రాష్ట్రాలకు ఖర్చు పెట్టి రప్పించుకునేందుకు ఆసక్తి చూపలేదు. గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన వేలమంది మత్సకారులను రప్పించడం వారికి రెండు వేలరూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించడం జరిగాయి. ఈ తీరులో ప్రతి రాష్ట్రం తమ పౌరుల విషయంలో వ్యవహరిస్తే సమస్యే వచ్చేది కాదు. లేదా కేంద్రమే లాక్ డౌన్ కి ముందు వలస కూలీలు సొంత రాష్ట్రానికి తరలించే ఏర్పాటు చేసి ప్రకటన చేసి ఉన్నా కోట్లాదిమంది కన్నీటిని తుడిచి ఉండేది.

వారికి రెడ్ కార్పెట్ …

వైరస్ కట్టడిలో పలు అంశాల్లో మోడీ పై ప్రశంసల జల్లు కురిసింది. కేవలం వలస కూలీల వ్యవహారంలో మాత్రం కేంద్రం విమర్శలపాలైంది. విదేశీయులకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి లాక్ డౌన్ 2. 0 లో కేంద్రం పంపేసింది. అలాగే మిషన్ వందే భారత్ పేరిట విదేశాల్లో చిక్కుకున్న వారిని రప్పించే బృహత్తర కార్యక్రమం యజ్ఞంలా చేపట్టింది. ఇలా డబ్బున్న వారి పట్ల ఒకలా, పేదల పట్ల మరోలా ఇక్కడ వ్యవహారం సాగిందన్న చర్చ సోషల్ మీడియా లో హోరెత్తిపోయింది. ఈ ఒక్కటి సరిగ్గా డీల్ చేసి ఉంటె దేశంలోని విపక్షాలకు అస్త్రాలే లేకుండా పోయేవని పలువురు విశ్లేషకులు అంటున్నారు. వలస కూలీల పై చూపిన వివక్ష మాత్రం మోడీ సర్కార్ కి శాపం గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఈ సమస్యపై జగన్ సర్కార్ ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ వేగంగా చర్యలు చేపట్టి ఇతర రాష్ట్రాల శ్రామికుల మనసు దోచుకుంది.

Tags:    

Similar News