అన్నా .. అంటాడు కానీ… అలక్ష్యం చేస్తే మాత్రం?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను సయితం అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారు. తనకంటే వయసులో పెద్దవారైన అధికారులను అన్నా అనే అంటారు. అయినా పనితీరు విషయంలో రాజీ [more]

Update: 2020-05-21 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను సయితం అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారు. తనకంటే వయసులో పెద్దవారైన అధికారులను అన్నా అనే అంటారు. అయినా పనితీరు విషయంలో రాజీ పడరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల వరకూ తాను పనిలో అలసత్వం వహిస్తే క్షమించబోనని సంకేతాలు ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. కొందరిని పక్కకు తప్పించి తన ఆలోచనలు ఏమిటో అధికార యంత్రాంగానికి చెప్పకనే చెప్పారు.

బాబు సీఎంగా ఉన్నప్పుడూ…

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అధికారుల సస్పెన్షన్లు ఉండేవి. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొంత తక్కువగానే కన్పించినా అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీల పేరుతో అధికారులను సస్పెండ్ చేసేవారు. దీనికి ప్రచారం కూడా బాగా లభించేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేకమంది అధికారులు సస్పెండ్ అయ్యారు. పనితీరు ఆధారంగా బదిలీ వేటు వేశారు.

ఎల్వీ నుంచి మొదలు…

జగన్ కు పాలనానుభవం లేదని అనుకున్న వారు అధికారులపై పడుతున్న వేటును చూసి ప్రభుత్వ యంత్రాంగంలో కొంత వణుకు బయలుదేరిందనే చెప్పాలి. చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచే జగన్ తన కత్తికి పదును పెట్టారు. తాను చెప్పినట్లు చేయకపోవడం, వీడియో కాన్ఫరెన్స్ ల్లో సయితం జగన్ ను చిన్న బుచ్చే విధంగా మాట్లాడటం వల్లనే ఎల్వీని పక్కన పెట్టేశారు. అదే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించడం కోసం కేంద్రానికి జగన్ లేఖ రాశారు.

సస్పెన్షన్లు.. బదిలీల వేటు…

ఇక కరోనా సమయంలోనూ జగన్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ను, నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిలపై బదిలీ వేటు వేశారు. ఇక సలహాదారుల విషయంలో జగన్ కఠినంగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక సలహాదారు హెచ్.కె. సాహు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆయనను పదవి నుంచి తప్పించారు. ఏడాదిలోనే జగన్ ముఖ్యమంత్రిగా తన ఆలోచనలేమిటో, ప్రజా సమస్యల పట్ల ఎలాస్పందించాల్సి ఉంటుందో సస్పెన్షన్లు, బదిలీల ద్వారా చూపించారని అధికార యంత్రాంగంలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News