ఏది నిజం… ఏది ఫేక్ న్యూస్?

జగన్ సర్కార్ ఏర్పడింది అన్నది మాత్రం నిజం. ఇక ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోబోతోంది అన్నది మరో నిజం. ఈ మధ్య ఏడాది పాలనంతా అయోమయం. సరే [more]

Update: 2020-05-17 06:30 GMT

జగన్ సర్కార్ ఏర్పడింది అన్నది మాత్రం నిజం. ఇక ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోబోతోంది అన్నది మరో నిజం. ఈ మధ్య ఏడాది పాలనంతా అయోమయం. సరే జగన్ సహా అంతా కొత్త వారు అని అనుకున్నా అవతల వైపు విశేష అనుభవం ఉన్న విపక్షంగా టీడీపీ ఉంది. దాంతో ఆ పార్టీ అధికార పార్టీని ఒక్కన చెడుగుడు ఆడించేస్తోంది. ఇక సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య రచ్చ ఒక లెక్కన ఉంది. దాంతో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టింగులు కనిపిస్తాయి. ఇందులో విధానపరమైన నిర్ణయాల మీద కూడా పోస్టింగులు ఉంటాయి. ఇంకోవైపు విపత్తులు, సున్నితమైన అంశాలు ఉంటాయి. వాటి మీద కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ఏది నిజమో తెలియడం లేదు. ఇక ఈ మొత్తం పరిణామాలతో ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు. సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.

రాజధాని నుంచి….

విశాఖ రాజధాని అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. ఆరు నెలల క్రితం జగన్ విశాఖను పాలనా రాజధాని చేస్తానని అసెంబ్లీలోనే చెప్పారు. ఆ తరువాత ముహూర్తాలు పెట్టడం అన్నది టీడీపీ వంతు అయింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏప్రిల్ 28న రాజధాని విశాఖకు తరలిపోతుంది అని జోస్యం చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆ తరువాత ఇపుడు మరో ముహూర్తం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. మే 28న విశాఖకు జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ చేస్తారన్నది ఆ న్యూస్. దాన్ని ఆధారం చేసుకుని కోర్టుకు కూడా కొందరు వెళ్లారు. అక్కడ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. తమకు అటువంటి ఉద్దేశ్యం లేదని ప్రభుత్వం చెప్పుకుంటోంది.

బాబు సైతం…..

ఇక సోషల్ మీడియాలో, ఇతర వార్తల్లో వచ్చిన వాటిని నిర్ధారించుకోకుండా చంద్రబాబు లాంటివారు మే 28న విశాఖకు రాజధాని వెళ్ళిపోతోందని అంటున్నారు. మరి ఇది నిజమా? కాదా? అంటే ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ మాత్రమే ఆధారం. ప్రభుత్వ పెద్దలు ఎవరూ దాన్ని ఖండించడంలేదు, అలాగని లేదని కాదనీ చెప్పడమూ లేదు. మొత్తం మీద విశాఖ రాజధాని అన్న గందరగోళం గత ఆరునెలలుగా సాగుతున్నా కూడా ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేకపోతోంది అన్నది జనంలో ఉన్న భావన.

చర్యలు ఉండవా…?

నిజానికి జగన్ విపక్షంలో ఉన్నపుడు ఆయన మీద, పార్టీ మీద అసత్య ప్రచారం జరిగేది, ఆ బురద వారు తుడుచుకునేవారు, ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. వారే ప్రభుత్వంలో ఉన్నారు. అసత్య ప్రచారాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారే తప్ప అవేమీ లేవు. దాంతో అవే ప్రచారంలో ఉంటున్నాయి. ఏపీలో నేరాలు, చోరీలు ఎక్కువవుతున్నాయని, జనం జాగ్రత్తగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారుల పేరు మీద న్యూస్ బయటకు వచ్చేసి చక్కర్లు కొట్టేస్తోంది. దాని మీద అలాంటిది ఏదీ లేదని ఏకంగా డీజీపీ వివరణ ఇవ్వాల్సివచ్చింది. ఇక పదవతగతి పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించేస్తూ విద్యార్ధులను, తల్లితండ్రులను కూడా కంగారు పెట్టేసే ఫేక్ పోస్టింగులు ఈ మధ్య పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. దాని మీద మంత్రి ఆదిమూలం సురేష్ అవన్నీ తప్పు అని చెప్పుకోవాల్సివచ్చింది.

అలుసైపోతున్నారే …?

మరో వైపు ప్రాణాల మీదకు వచ్చిన విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో కూడా అక్కడ గ్యాస్ ట్యాంకర్ పేలిపోతోందని ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దాంతో ఒక రాత్రి అంతా విశాఖ వాసులకు కాళరాత్రి అయింది. ఇలా ప్రతీ విషయంలో ఫేక్ న్యూస్ వెల్లువలా బయటకు వస్తూంటే ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వదిలేస్తోందా అన్న డౌట్లు వస్తున్నాయి. సున్నితమైన విషయాల మీద కూడా నకిలీ సమాచారం వస్తే ప్రజలు నానారకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రతిష్ట కూడా మంట కలుస్తోంది. కానీ కఠిన చర్యలు లేవు. ఎందుకిలా జరుగుతోంది. అవును ఇంతకీ ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉందా. లేక పాత సర్కారే పనిచేస్తోందా. ఏది నిజమో..ఏది అబద్దమో అసలు అర్ధం కావడంలేదు కదా.

Tags:    

Similar News