జగన్ కి అంత నమ్మకమా? అతి విశ్వాసం కాదుగదా?

ముఖ్యమంత్రిగా జగన్ స్టయిలే వేరు. ఆయన చంద్రబాబుకు పూర్తి భిన్నం. దాని వల్ల ఆయన పొలిటికల్ గా మైలేజ్ చూసుకోవడం లేదు. పని జరుగుతుందా? లేదా అన్నదే [more]

Update: 2020-05-16 00:30 GMT

ముఖ్యమంత్రిగా జగన్ స్టయిలే వేరు. ఆయన చంద్రబాబుకు పూర్తి భిన్నం. దాని వల్ల ఆయన పొలిటికల్ గా మైలేజ్ చూసుకోవడం లేదు. పని జరుగుతుందా? లేదా అన్నదే ఆయన అంచనా వేసుకుంటున్నారు. అందుకే ఆయన రాష్ట్రంలో కరోనా విపత్తు వంటివి ఉన్నా కూడా తాను వెనక ఉండి మంత్రులను ముందు పెడుతున్నారు. సూచనలు, సలహాలు అన్నీ ఇస్తూ మంత్రులనే రంగంలోకి దించుతున్నారు. ఇక విశాఖలో జరిగిన ఘోరమైన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో సైతం జగన్ రాజకీయం కోసం, సానుభూతి కోసం పాకులాడలేదు, ఆయన తన వంతు బాధ్యత నిర్వహించి మంత్రులనే ముందుంచారు. వారి ద్వారానే అక్కడ మొత్తం ఆపరేషన్ జరిపిస్తున్నారు.

అదే తేడా…?

చంద్రబాబుకు, జగన్ కి అదే తేడా అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు తన మంత్రులను కూడా అసలు నమ్మరు. పైగా ఆయనకు ప్రచారం పిచ్చి ఉంది. అందుకే హుదూద్ టైంలో అవసరం లేకపోయినా కూడా వచ్చి వారానికి పైగా లేనిపోని హడావుడి చేశారు. దాని వల్ల పనులు జరగకపోగా అధికారులు, నాయకులు అంతా సీఎం చుట్టూ తిరిగారు. ఇక తిత్లీ తుఫాన్ శ్రీకాకుళంలో వస్తే కూడా బస్సుల మీద తాను సహాయం చేస్తున్న పోస్టర్లు వేయించుకున్న సీఎంగా బాబుని చెబుతారు. ఇక లక్షల్లో నాడు సాయం నాడు ఇచ్చారు. అయితే చంద్రబాబు రావాలని, ఆయన చేతుల మీదనే సాయం అందిస్తామని చెప్పి నాడు అధికారులు చెక్కులని నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇపుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో బాధితునికి కోటి రూపాయలు సాయం అందించారు. ఇంత‌టి పెద్ద మొత్తం సాయం చేస్తున్నపుడు ముఖ్యమంత్రి తానే అక్కడ ఉండి ఫోటోలు తీయించుకుని ప్రచారం చేసుకోవచ్చు. పైగా వీలైనంత పొలిటికల్ కవరేజి వస్తుంది. కానీ జగన్ మాత్రం మంత్రుల చేతుల మీదుగానే ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిపించారు.

పాలనంటే అదే…..

ఇక తన మంత్రులు కూడా తనతో పాటుగా జనంలో ఉండాలి, వారు కూడా పనిచేయాలి. తాను పర్యవేక్షణ చేయాలి. మొత్తానికి క్షేత్ర స్థాయిలో ఏ ఇబ్బందులూ లేకుండా సాఫీగా అనుకున్న కార్యక్రమం జరగాలి. ఇదీ జగన్ విధానం. అయిన దానికీ, కాని దానికీ ముఖ్యమంత్రి వచ్చేసి జనంలో ఉంటే కొత్త ఇబ్బందులు కూడా వస్తాయి. అందువల్ల పాలనలో ఆ విభజన ఉండాలి. ఇదే దేశంలో కూడా జరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబే అన్నీ తాను అన్నట్లుగా గతంలో వ్యవహరించారు. దానికి తోడు ఆయనకు తానే ఫోకస్ మొత్తం కావాలని ఉండేది. పైగా మంత్రుల మీద నమ్మకం తక్కువ. ఇదే మాట అవంతి అంటూ తమ నాయకుడు జగన్ అని చెప్పుకునేందుకు తాము ఆనందిస్తామని అంటున్నారు. చంద్రబాబుకు ఎవరి మీద నమ్మకం లేదు, కానీ జగన్ అలా కాదు, మంత్రులను బాగా నమ్ముతారు. పాలన అంటే ఇదేనని మంత్రి అంటున్నారు.

పార్టీకి లాభమేనా…?

అయితే ఇపుడున్న పరిస్థితుల్లో రూపాయి సాయం చేసినా కూడా జనంలో చెప్పుకుంటూ విపరీతమైన ప్రచారం పొందుతున్నారు. జనధన్ ఖాతాలో నెలకు అయిదు వందల రూపాయలు మోడీ వేస్తే తమ బీజేపీ ఘనత ఇది అంటూ బీజేపీ నేతలు ఊరూ వాడా చెప్పుకున్నారు. ఇక ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు చేసిన పనిని పదింతలు గొప్పగా చెప్పుకుంటే అది రాజకీయంగా లాభంగా మారుతుంది. పార్టీకి కూడా మేలు జరుగుతుంది. చంద్రబాబు అలా ప్రచారానికి పెద్ద పీట వేస్తూ ఒక బెంచ్ మార్క ని సెట్ చేసి వెళ్లారు. ఇపుడు జగన్ అచ్చమైన పాలన చూపిస్తున్నా జనాలకు ఏదో వెలితిగా ఉంటోంది. జగన్ తెర వెనక ఉండి ఎంత చేస్తున్నా ఏమీ చేయనట్లుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మరీ బాబులా కాకపోయినా జగన్ కూడా అవసరం అయిన సందర్భాల్లో జనంలోకి ఎక్కువగా వస్తే అది పార్టీకి, ఆయనకూ కూడా లాభమేనని వైసీపీలో వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News